గనిలో... వనిలో... కార్ఖానాలో!

రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి.. ఆ సమయంలో మగవాళ్లు లేకపోయినా ఏ ఫ్యాక్టరీ ఆగిపోలేదు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఓడరేవులు యథావిధిగా నడిచాయి.

Published : 01 May 2024 02:17 IST

మే డే సందర్భంగా...

రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి.. ఆ సమయంలో మగవాళ్లు లేకపోయినా ఏ ఫ్యాక్టరీ ఆగిపోలేదు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఓడరేవులు యథావిధిగా నడిచాయి. కోట్లమంది ఆడవాళ్లు కార్మికశక్తిగా మారి చెమట చిందించడమే ఇందుకు కారణం. తిండి గింజలు పండించే శ్రామికశక్తిలో సగం మనమే ఉన్నాం. ప్రపంచంలో ఏ నగరాన్ని తీసుకున్నా... అక్కడి ఆకాశ హర్మ్యాల వెనక మన చెమట చుక్కలు కచ్చితంగా ఉంటాయి. ఇంత చేస్తే దక్కిందేంటి? ఈ రోజుకీ ప్రపంచంలో ఒక్క దేశం కూడా మగవాళ్లతో సమానంగా మహిళలకు వేతనాలు ఇచ్చి ‘పే గ్యాప్‌’ అనే పదాన్ని జయించలేకపోయింది. ఎందుకని? మరి ఈ వివక్షను తగ్గించుకొనే దారే లేదా?.... 

మిళనాడులోని కోయంబత్తూరుకి దగ్గరగా ఉంది కిర్లోస్కర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌. ఇక్కడ ఇంటి అవసరాలకు కావాల్సిన మోటార్‌ పంపులు తయారుచేస్తారు. పదిహేడు సెకన్లకి ఒక పంపు చొప్పున.. నెలకి లక్ష చేస్తారు. ఇదో రికార్డు కూడా. అంతా ఆడవాళ్లే. మగవాళ్లు ఎక్కడా కనిపించరు. చుట్టుపక్కల గ్రామాల నుంచి బస్సుల్లో వచ్చి మూడు షిఫ్టుల్లోనూ పనిచేస్తారు. పదమూడేళ్లుగా ఈ ఆల్‌విమెన్‌ యూనిట్‌ విజయవంతంగా నడుస్తోంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో ‘విక్టోరియా సీక్రెట్‌’ బ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. సెలెబ్రిటీలు ధరించే ఈ లోదుస్తులు కాంచీపురం మహిళల చేతుల్లో తయారైనవే. ఇవి మాత్రమే కాదు ఐఫోన్ల దగ్గర నుంచి, ఆటోమొబైల్‌ వస్తువుల వరకూ అవలీలగా చేస్తారు ఇక్కడి మహిళలు. వీళ్ల సామర్థ్యం తెలుసుకొనే అనేక బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. మనదేశ శ్రామికశక్తిలో దాదాపుగా 33శాతం మహిళలు ఉంటే... అందులో 42శాతం ఒక్క తమిళనాడు నుంచే ఉండటం ఆశ్చర్యంగా ఉంది కదా?

ప్రభుత్వ విధానాలే...

సాధారణంగా ఆడవాళ్లు ఉద్యోగాల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి? చదువుకున్నా, అర్హత ఉన్నా కుటుంబం, పిల్లలు, ఇల్లు వంటి కారణాలతో వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేయలేక 44 శాతం మహిళలు ఉద్యోగ జీవితాన్ని ఎంచుకోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కాస్త వినూత్నంగా ఆలోచించింది. మహిళలు ఫ్యాక్టరీలు ఉన్న చోటికి రావడం కాదు, మహిళలు ఉన్న చోటుకే వాటిని తీసుకెళ్లింది. గ్రామీణ మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చింది. వాహన సదుపాయం కల్పించింది. దాంతో కిర్లోస్కర్‌, విక్టోరియా సీక్రెట్‌ మాత్రమే కాదు... యాపిల్‌, హ్యూండాయ్‌, నైక్‌, ఫోర్డ్‌, వోల్వో వంటి సంస్థలు తమ ఉత్పత్తుల తయారీకి ఆసక్తి చూపించాయి. ఇక మెట్రోపాలిటన్‌ నగరాల్లో పనిచేయాలనుకొనేవారికోసం ప్రభుత్వం తొళి(సఖి)హాస్టల్స్‌ని ప్రారంభించింది. ప్రపంచబ్యాంకు సహకారంతో ‘కొత్త జీవితం’ పేరుతో మహిళల్ని ప్రోత్సహిస్తోంది. తమిళనాడు తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఏపీ, కేరళ వంటివి ఉంటే బిహార్‌ ఆఖరున ఉంది. మరి వీళ్లెందుకు వెనకబడ్డారంటే మనం ముందు చెప్పుకొన్న కారణమే. పిల్లలు, కుటుంబానికే వీళ్లు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. డెలాయిట్‌ సంస్థ ‘విమెన్‌ ఎట్‌ వర్క్‌’ పేరుతో పదిదేశాల మహిళలపై సర్వే చేసింది. దీని ప్రకారం పనిచేసే చోట స్త్రీ, పురుష సమానత్వం పాటిస్తే మూడురెట్లు ఉత్పత్తి పెరుగుతుందని చెప్పింది. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా?

ఇప్పుడిప్పుడే...

ఒకప్పుడు మైనింగ్‌, పరిశ్రమలు అంటే మగవాళ్లే గుర్తుకు వచ్చేవారు. ఆ అభిప్రాయాన్ని చెరిపేస్తూ టాటాస్టీల్‌, జేకే సిమెంట్స్‌, వేదాంత, కోల్‌ఇండియా, ఓలా వంటి సంస్థలూ పురుషాధిపత్యం ఉండే రంగాల్లోకి మహిళల్ని ఆహ్వానిస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకొనే ఆడవాళ్లూ పెరుగుతున్నారు. ‘జేకే సిమెంట్స్‌లో నేను అడుగుపెట్టినప్పుడు అంతా నన్ను వింతగా చూసేవారు. ఆ వివక్షని జయించి ముందుకు వచ్చా. తక్కిన అమ్మాయిలూ ముందుకు రావాలంటే వాళ్లకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. సీనియర్‌ మహిళలని మెంటార్లుగా నియమించడం, తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా అమ్మాయిలని ప్రోత్సహించవచ్చు’ అంటారు జేకే సిమెంట్‌ ఎండీ వినీతా సింఘానియా. ‘రిక్రూట్‌మెంట్‌ దశలోనే వారిపై నమ్మకం ఉంచడం,  పదోన్నతుల్లో పారదర్శకత, మాతృత్వ సెలవులు, ఇంటినీ ఆఫీసునీ బ్యాలెన్స్‌ చేసుకొనేలా వారిని ప్రోత్సహిస్తే మాన్యుఫాక్చరింగ్‌లో అమ్మాయిల సంఖ్యను పెంచొచ్చు’ అంటారు ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌లో చీఫ్‌ హెచ్‌ఆర్‌ హోదాలో ఉన్న సరితా త్రిపాఠి. పోతే, 2025నాటికి 13.3 కోట్ల కొత్త కొలువులు వస్తాయి. నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే శ్రామికశక్తిలో మహిళలు సమానంగా ఎదగొచ్చు అంటోంది వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ నివేదిక.


స్త్రీ, పురుష సమానత్వం పాటించే విషయంలో నార్వే, స్వీడన్‌... వంటి నార్డిక్‌ దేశాలు ముందుంటాయి. అటువంటి దేశాలు కూడా ఇంతవరకూ ‘సమాన వేతనాన్ని’ సాధించలేకపోవడం విచారకరం. జెండర్‌ పే గ్యాప్‌ని తగ్గించిన విషయంలో బెల్జియం ముందుంది. ఐస్‌ల్యాండ్‌లో మాత్రం ఆడవాళ్లకంటే మగవాళ్లకి ఎక్కువ వేతనం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్