సోలో పర్యటనలకోసం..!

బ్యాంకు ఉద్యోగిగా 14 ఏళ్ల అనుభవం ఆమెది. రొటీన్‌ జీవితంతో మనసుకు కావాల్సింది పోగొట్టుకుంటున్నానేమో అనిపించిందీమెకు. ఒంటరిగా పర్యటక ప్రాంతాలను సందర్శించడం మొదలు పెట్టింది.

Published : 03 May 2024 01:36 IST

బ్యాంకు ఉద్యోగిగా 14 ఏళ్ల అనుభవం ఆమెది. రొటీన్‌ జీవితంతో మనసుకు కావాల్సింది పోగొట్టుకుంటున్నానేమో అనిపించిందీమెకు. ఒంటరిగా పర్యటక ప్రాంతాలను సందర్శించడం మొదలు పెట్టింది. తనలాగే ప్రయాణాన్ని ప్రేమించేవారి కోసం ‘ది ఫ్లాపర్‌ లైఫ్‌’ స్టార్టప్‌తో సోలో ట్రావెలర్స్‌కు దేశవిదేశాలను చూసొచ్చే ఏర్పాట్లు చేస్తోంది... జీనల్‌జోషి.

జీనల్‌ పుట్టి, పెరిగిందంతా ముంబయి. చదువయ్యాక బ్యాంకులో ఉద్యోగానికి చేరింది. అకస్మాత్తుగా ఓరోజు ఆమెకు ఉద్యోగంలో బ్రేక్‌ తీసుకోవాలనిపించింది. ఏళ్లతరబడి ఒకేలా గడపడం నచ్చలేదంటుంది జీనల్‌. ‘ఒంటరిగా ఏదైనా అందమైన ప్రాంతానికి వెళ్లాలనుకున్నా. అలా సింగపూర్‌కు నేను చేసిన సోలో ట్రావెలింగ్‌ మనసుకెంతో ఆనందాన్నిచ్చింది. ఒత్తిడి, ఆందోళన దూరమయ్యాయి. నేనే కాదు, ప్రతిఒక్కరూ దైనందిన జీవనానికి భిన్నంగా కుటుంబంతో ఏడాదికొకసారైనా పర్యటించాలి. అలాగే మనకోసం కూడా సమయాన్ని కేటాయించుకుని ఒంటరిగా ప్రయాణించాలి. అప్పుడే మనసంతా కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. ప్రకృతికి అంతటి శక్తి ఉంది మరి. ఈ అనుభవాలన్నీ మహిళలకూ చేరేలా చేయాలనుకున్నా’నని చెప్పే జీనల్‌ 2016లో మహిళల కోసమే ప్రత్యేకంగా ‘ది ఫ్లాపర్‌ లైఫ్‌’ స్టార్టప్‌ ప్రారంభించింది. గ్రూపు లేదా సోలో ట్రావెలర్స్‌కు సౌకర్యాలు అందిస్తూ.. దేశవిదేశాలకు పర్యటనలను ఏర్పాటుచేస్తోంది. తగిన భద్రతనూ కల్పిస్తోంది.

ఇబ్బందులూ లేకపోలేదు !

బృందంతో కలిసి వెళితే అందరికీ సంబంధించి ఒకే ఎజెండా ఉంటుంది. అలా కాకుండా ఒంటరిగా వెళితే మనసుకు నచ్చిన చోట ఎక్కువసేపు ఉండొచ్చు. నచ్చింది తినే స్వేచ్ఛ ఉంటుంది. రొటీన్‌కు భిన్నంగానూ గడపొచ్చు. అందుకే చాలామంది సోలో ట్రావెలింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారంటోంది జీనల్‌. ‘ఒత్తిడి తగ్గించుకోవడానికీ, బ్రేక్‌ తీసుకుని నచ్చినట్లు గడపడానికీ మహిళలు ఇష్టపడుతున్నారు. అయితే ఈ రకమైన పర్యటనలో ఇబ్బందులూ ఉంటాయి. ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సౌకర్యాలే కాదు, సమస్య ఎదురైతే తక్షణం పరిష్కరించాలి. దీనికోసం దేశమంతా మా మహిళాగైడ్స్‌ ఉన్నారు. ఒంటరిగా పర్యటించడానికి వచ్చే కొందరు తమలాంటి మరికొందరితో బృందంగా కలిసి సరదాగా పర్యటిస్తారు. ఇంకొందరు గ్రూపుతో కాకుండా ఒంటరిగా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. వీరందరికీ తగిన ఏర్పాట్లతోపాటు భద్రతనీ కల్పిస్తాం. పర్యటకుల అభిరుచి మేరకు స్కూబా డైవింగ్‌, ట్రెక్కింగ్‌వంటి అడ్వెంచర్స్‌ సహా నేచర్‌, స్థానికులతో కలిసి పంచుకోగలిగేవి నా ప్రణాళికలో ఉంటాయి. ఓసారి ఆస్ట్రేలియా నుంచి ఒకామె భూటాన్‌ పర్యటనకొచ్చింది. తీరా ఆమె స్వదేశానికి వెళుతున్నప్పుడు విమాన సమయం అనుకున్నదాని కన్నా ముందుకు జరిగింది. దాంతో అప్పటికప్పుడు  విమానాశ్రయానికి దగ్గరగా బస ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 400కుపైగా టూర్స్‌ చేశాం. ఇండియాలోని అందమైన ప్రాంతాలే కాకుండా చైనా, శ్రీలంక, యూరోపియన్‌ దేశాల్లోనూ పర్యటనలు ఏర్పాటు చేశా. సోలో ట్రావెలింగ్‌లో నన్ను నేను మేనేజ్‌ చేసుకోగలుగుతున్నాననే ఆత్మవిశ్వాసం పెంపొందే ప్రయోజనమూ ఉంది. మా స్టార్టప్‌ ద్వారా గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థులు సోలో ట్రావెలింగ్‌కే పెద్దపీట వేస్తున్నార’ని చెబుతున్న జీనల్‌ ప్రతి మహిళా వయసు, స్థాయితో సంబంధంలేకుండా ఒక్కసారైనా సోలోగా పర్యటిస్తే చాలు, కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు అంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్