ఎడారి నేలలో... వసంతాలు పూయించి!

పుట్టింటి వాళ్లది సంపన్న కుటుంబం... భర్త టెక్స్‌టైల్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.. కోటలో రాణిలా కాలు కదపకుండా, వైభవంగా జీవితాన్ని వెళ్లదీయొచ్చు. కానీ ఎడారినేలలో తోటి మహిళల కష్టం తెలుసుకోవడం కోసం వాళ్లతోపాటు తనూ నెత్తిన కడవ పెట్టుకున్నారు.

Updated : 04 May 2024 07:40 IST

పుట్టింటి వాళ్లది సంపన్న కుటుంబం... భర్త టెక్స్‌టైల్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.. కోటలో రాణిలా కాలు కదపకుండా, వైభవంగా జీవితాన్ని వెళ్లదీయొచ్చు. కానీ ఎడారినేలలో తోటి మహిళల కష్టం తెలుసుకోవడం కోసం వాళ్లతోపాటు తనూ నెత్తిన కడవ పెట్టుకున్నారు. వాళ్ల కన్నీళ్లు తుడిచేందుకు వందలకొద్దీ చెక్‌డ్యామ్‌లు కట్టారు. అందుకే వాళ్ల గుండెల్లో గంగమ్మగా కొలువు తీరారు. ‘వాటర్‌ మదర్‌ ఆఫ్‌ ఇండియా’ అమలా రుయియా స్ఫూర్తి కథనమిది...

పుట్టింటికి కష్టమొస్తే ఏ ఆడబిడ్డైనా ఏమీ పట్టనట్టుగా మౌనంగా ఉండిపోతుందా? ఓ రోజు సాయంత్రం టీవీ ముందు కూర్చున్న అమల కూడా అలానే బాధపడ్డారు. రాజస్థాన్‌తో సహా అనేక ప్రాంతాలు చుక్క నీటికోసం అల్లాడిపోతున్నాయి. తీవ్రమైన కరవుతో మనుషులూ, పశువులూ తేడా లేకుండా ప్రాణాలు పోతున్నాయి. ఆ కరవు ఊళ్లలో తన పుట్టిల్లు రామ్‌గఢ్‌ కూడా ఉంది. అప్పటికే అమల కుటుంబం ఆ కరవు ప్రాంతాలకు ట్యాంకర్ల కొద్దీ నీళ్లు, టన్నుల కొద్దీ ఆహారాన్ని లారీల్లో పంపించింది. అయినా అమలకి అవేమీ సంతృప్తినివ్వలేదు. దీనికో శాశ్వత పరిష్కారం ఇవ్వాలనుకున్నారామె. ‘ఒక బిందెడు నీళ్ల కోసం రోజూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్న మహిళలకు సాయం చేద్దామని రాజస్థాన్‌ వెళ్లా. ఒక బిందె నెత్తిన పెట్టుకుని నిప్పులు చెరిగే ఎండలో రెండంటే రెండు నిమిషాలు నడిచేసరికి ప్రాణం పోయినంత పనైంది. అంతవరకూ నా ఫిట్‌నెస్‌పై ఉన్న భ్రమలన్నీ ఎగిరిపోయాయి. మరి అక్కడి ఆడవాళ్లకు ఏడాదిపొడవునా ఉన్న ఈ కష్టాన్ని తొలగించాలంటే ఏదో ఒకటి చేయాలనుకున్నా. అదే విషయాన్ని ఇంట్లో చెబితే.... వద్దంటే వద్దన్నారు. అది చేయడానికి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు ఉన్నాయి, ఆ ఎడారిలో నీకెందుకీ కష్టాలు.. తోచినంత డబ్బు సాయం చేసి వదిలేయ్‌ అన్నారు. నేనూ పట్టువదల్లేదు. బతిమాలాను, నా వల్ల కాకపోతే వెనక్కి వచ్చేస్తా అని నచ్చజెప్పాను. అలా 1998లో ‘ఆకార్‌ ట్రస్ట్‌’ ప్రాణం పోసుకుంది’ అంటారు అమల.

నాకేమైనా పర్లేదు అనుకున్నా...

వాన నీటిని ఒడిసిపట్టుకోవడానికి సంప్రదాయ చెక్‌డ్యామ్‌ విధానాన్నే అనుసరించారు అమల. ఒక్కో చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి అప్పట్లో రూ.5లక్షల వరకూ అయ్యేది. అందులో 30 శాతం స్థానికులు భరిస్తే... తక్కిన సొమ్ము తమ ట్రస్ట్‌ నుంచి అందించాలనుకున్నారామె. ఇందుకోసం మొదట తీవ్రమైన కరవులో ఉన్న మండావర్‌ గ్రామాన్ని ఎంచుకున్నారు. డ్యామ్‌ నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాన్ని గుర్తించడానికి ఎడారి నేలలో వారాలు, రోజులు.. మైళ్లకు మైళ్లు నడిచారు. రైతుల్లో నమ్మకం కలిగించడానికి ఇల్లిల్లూ తిరిగారు. ‘మొదటి డ్యామ్‌ కట్టడానికి ఆర్నెల్లు పట్టింది. ఈలోపు నాకు ఈ పనిలో కష్టనష్టాలు తెలిశాయి. ఒక సమయంలో కూలీల కొరత వెంటాడింది. అక్కడి పెద్దలతో మాట్లాడి ఇంటికి ఒకరు వచ్చి పనిచేసేలా చేశా. ప్రజల్లో నమ్మకం వచ్చాక... ఒక్కో చెక్‌డ్యామ్‌నీ వేగంగా నిర్మించుకుంటూ వెళ్లాం. మొదట్లో ఏడాదికి రెండు కడితే గొప్ప. ఆ తరవాత సంవత్సరంలో ఆరు వరకూ కట్టాం. మేం మొదట మండావర్‌లో నిర్మించిన చెక్‌డ్యామ్‌ కోటి లీటర్ల నీటిని నిల్వ చేస్తోంది. ఒకప్పుడు అక్కడ్నుంచి వలస వెళ్లిపోయిన రైతులు తిరిగొచ్చి ఇప్పుడు ఏటా మూడు పంటలు వేస్తూ.. రూ.12 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సాగుని విస్తరించారు. ఆడవాళ్లు కడవలు నెత్తిన పెట్టుకుని మైళ్ల కొద్దీ దూరం నడవాల్సిన పని లేదు. ప్రజల్లో వచ్చిన చైతన్యంవల్లే ఇదంతా సాధ్యమైంది. ఆ చైతన్యం ఇంకా పెరగాలని చక్కని నీటియాజమాన్య పద్ధతులు అనుసరించిన గ్రామాలకి ‘ఆకార్‌ జల్‌ పురస్కార్‌’ పేరుతో అవార్డు అందించి రూ.లక్ష  అందించేవాళ్లం. మొదట్లో ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమనుకుని కొంతమంది బెదిరించారు కూడా. నాకేమైనా పర్వాలేదు అనుకొని మొండిగా ముందుకెళ్లా’ అనే అమల ఇంతవరకూ 664 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. 128 చెరువులు తవ్వించారు. ఫలితంగా 883 గ్రామాల్లోని 13 లక్షలమంది ప్రజలు కరవునుంచి బయటపడ్డారు. జలసిరులతో తమ జీవితాలని దిద్దుకున్నారు. అందుకే ఆమెని ‘వాటర్‌ మదర్‌ ఆఫ్‌ ఇండియా’ అని ప్రేమగా పిలుచుకుంటారు అక్కడి జనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్