చేప ముల్లుతో... నేత చీర!

అందమైన ఆ వస్త్రం తయారీకి ఎనిమిది పద్ధతుల్లో శుద్ధి అయిన పత్తి కావాలి. చేపముల్లూ తప్పనిసరి. వీటికి అతివల చేతి నైపుణ్యం కూడా తోడయ్యింది కాబట్టే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ మూటకట్టుకున్నాయి. అవే పొందూరు నేత చీరలు. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్‌ చీర మళ్లీ ట్రెండ్‌ అవుతోంది.

Updated : 06 May 2024 07:08 IST

అందమైన ఆ వస్త్రం తయారీకి ఎనిమిది పద్ధతుల్లో శుద్ధి అయిన పత్తి కావాలి. చేపముల్లూ తప్పనిసరి. వీటికి అతివల చేతి నైపుణ్యం కూడా తోడయ్యింది కాబట్టే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ మూటకట్టుకున్నాయి. అవే పొందూరు నేత చీరలు. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్‌ చీర మళ్లీ ట్రెండ్‌ అవుతోంది...

మండుటెండల్లో పొందూరు చీర ఏసీలా చల్లగా పలకరిస్తుంది. ఎముకలు కొరికే గడ్డు శీతకాలంలో... నులివెచ్చగా, హాయిగా చుట్టుకుంటుంది. ఇదొక్కటేనా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పొందూరు నేత రచ్చ గెలిచిన తరవాతే ఇంట గెలిచింది. అదెలా అంటారా? స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్‌ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్‌ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. అది చదివిన అనేకమంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు వైభవం. ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. ‘పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. చాలా మంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజమే. వాలుగ చేప దవడని ఇందుకోసం ఉపయోగిస్తాం. ఇదే మా ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు మాకోసం ప్రేమగా ఇస్తారు. వీటిని మేం స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటాం. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుంద’ని అంటారు పొందూరు గ్రామానికి చెందిన కోరుకొండ సరోజిని.

అక్కినేని మనసు దోచి...

తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. అది మా గొప్పతనం కాదు, చేనేతది అంటారు ఇక్కడి మహిళలు. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్‌ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్‌ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్‌ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ  ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా మేం నేసిన చీరలకు డిమాండ్‌ ఉంటుంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారు మా పొందూరు చీరల్ని ఎంతగానో ఇష్టపడ్డార’ని చెప్పుకొచ్చారు నేత కార్మికురాలు అనకాపల్లి శ్రీదేవి.

మోదీకి వివరించి...  

75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. అయితే ఇంత పేరున్నా ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో తరవాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదు అని బాధపడుతున్నారు నేత కార్మికులు.

మహేష్‌ వెల్లంకి, ఈటీవి, శ్రీకాకుళం


పెదవి కొరుకుతున్నారా..!

మీకు తెలుసా?

సాధారణంగా పెదవి కరచుకోవడం అంటే ఏదైనా తినేటప్పుడు అనుకోకుండా జరుగుతుంది. కానీ కొందరు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పెదవి కొరుకుతారు. దీనికి కారణం కొందరమ్మాయిలు ఒత్తిడి, ఆందోళన, భయం వంటి ఉద్వేగాలకు గురైనప్పుడు ఇలా తమకు తెలియకుండానే పెదవులు కొరుకుతారట. ఇలా చేయడం వల్ల బాధాకరమైన భావోద్వేగాల నుంచి ఉపశమనం కలుగుతుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్