వైమానిక దళం నుంచి టెక్‌ లీడర్‌గా..

కొత్తగా వస్తోన్న ఏ టెక్నాలజీ అయినా అందరికీ ఉపయోగపడాలి. అంటే దాన్ని వాడటం తెలియాలి. దాని వినియోగం తెలిసినప్పుడే ఆ రంగంలో పూర్తిగా అభివృద్ధి జరిగినట్లు అంటున్నారు తేజ మనకామె.

Published : 07 May 2024 01:31 IST

 

కొత్తగా వస్తోన్న ఏ టెక్నాలజీ అయినా అందరికీ ఉపయోగపడాలి. అంటే దాన్ని వాడటం తెలియాలి. దాని వినియోగం తెలిసినప్పుడే ఆ రంగంలో పూర్తిగా అభివృద్ధి జరిగినట్లు అంటున్నారు తేజ మనకామె. అందుకు తనవంతు సాకారాన్నీ అందిస్తున్నారు. అసలు ఈమె ఎవరు? ఆ సహాయం ఏమిటో తెలియాలంటే ఇది చదవాల్సిందే...

తేజ కర్ణాటకలోని బెళగావి పట్టణంలో పుట్టి పెరిగారు. తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులు. ‘ఏ విషయాన్నైనా సునిశితంగా పరిశీలించడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అదే నన్నీ స్థానంలో నిలబెట్టింది’ అంటారు తేజ. ప్రస్తుతం డెల్‌ టెక్నాలజీస్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 30 ఏళ్లక్రితమే పురుషులు మాత్రమే రాణిస్తోన్న వైమానిక, టెక్‌ రంగాల్లో ప్రతిభ కనబరిచి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. తేజకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఖగోళశాస్త్రం చదవాలని కలట. కానీ వాళ్ల ఊరిలో సంబంధిత కాలేజీలేక ఇంజినీరింగ్‌లో చేరారట. తను అనుకున్నది జరగలేదని నిరాశ పడకుండా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో చేరారు. 30 మంది మగపిల్లలు ఉన్న తరగతిలో నలుగురు మాత్రమే ఆడపిల్లలు. అక్కడి నుంచే పురుషాధిపత్యం ప్రారంభమైంది అంటారామె. భయపడి మిగతా ఆడపిల్లలు చదువు మానేస్తే తేజ మాత్రం పట్టుదలతో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. చివరి ఏడాది చదువుతున్నప్పుడు భారత వైమానిక దళంలో నాన్‌ మెడికల్‌ ఏరియాల్లో చేరే అవకాశం వచ్చింది. ఖగోళశాస్త్రం చదవలేకపోతేనేం ఆకాశంలో విహరించే అవకాశం వచ్చినందుకు సంతోషించారామె. పురుషులు మాత్రమే రాణించగలిగే రంగంలో ఆమె చేరి వివిధ పదవుల్లో ఆరేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. ‘మౌంట్‌ అబు’లాంటి కీలకమైన క్లస్టర్స్‌లోనూ పనిచేశారు.

టెకీగా..

భారత్‌లో ఐటీ రంగం ఊపందుకుంటున్న రోజుల్లో అప్పటికే టెకీగా పనిచేస్తున్న తన తమ్ముడి సలహా మేరకు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టారామె. ఫ్రెషర్‌గా మళ్లీ కొత్త ఉద్యోగంలోకి వచ్చారు. ఉన్నది వదిలి మళ్లీ మొదటి నుంచి కెరియర్‌ని ప్రారంభించడం అవసరమా అని అన్నారంతా. తక్కువ వేతనానికి టీసీఎస్‌లో డెవలపర్‌గా చేరారు. ఇక అది మొదలు పురుషులందర్నీ దాటుకుని డెల్‌ టెక్నాలజీస్‌లో డైరెక్టర్‌ హోదాకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక మహిళగా నిలిచారు. ఆమె చదువు, అనుభవం కిందిస్థాయి మహిళలకు, టెక్‌ రంగంలో రాణించాలనుకునే యువతులకు సహాయపడాలనుకున్నారు.. కంపెనీ తరపున వెచ్చించే కార్పొరేట్‌ సోషల్‌ ఫండ్స్‌తో చిన్న, మధ్యతరగతి, చేతివృత్తులు చేస్తోన్న మహిళలకు టెక్నాలజీ ఉపయోగించుకుని వారి వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నాస్కామ్‌ సంస్థతో కలిసి కాలేజీలు, గ్రామాలు తిరిగి టెక్‌ రంగంలో ఉండే అవకాశాల్ని పాఠాలుగా చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం అభ్యర్థన మేరకు సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గేమిఫికేషన్‌ సొల్యూషన్‌ని కూడా రూపొందించి ఇచ్చారు. ‘కొన్నేళ్లుగా టెక్‌ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. మేం చేరేటప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అని అనుకునేటప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని లెక్కచేయకుండా లక్ష్య సాధన కోసం కృషిచేస్తే విజయం సొంతమవుతుందంటున్నారు’ తేజ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్