కష్టాల సముద్రం ఈదేస్తోంది..!

కుటుంబాన్ని నడిపించడంలో మహిళలది ప్రత్యేక పాత్రే..! కష్టనష్టాలను సమన్వయం చేసుకుంటూ నేర్పరితనంతో ఇంటికి వెన్నెముకలా నిలుస్తున్నారు... కేరళకి చెందిన రేఖా కార్తికేయన్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది.

Published : 08 May 2024 02:33 IST

కుటుంబాన్ని నడిపించడంలో మహిళలది ప్రత్యేక పాత్రే..! కష్టనష్టాలను సమన్వయం చేసుకుంటూ నేర్పరితనంతో ఇంటికి వెన్నెముకలా నిలుస్తున్నారు... కేరళకి చెందిన రేఖా కార్తికేయన్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది. కష్టాలను సైతం ఎదిరించి కుటుంబాన్ని పోషించడానికి నడుం బిగించి ఏకంగా అరేబియా సముద్రాన్నే ఈదేస్తోంది. ఇదే... ఆమెకు దేశంలోనే మొదటి మహిళా మత్స్యకారురాలిగా గుర్తింపు తెచ్చింది.

రేఖ, కార్తికేయన్‌లది కేరళలోని త్రిసూర్‌ జిల్లా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మత్స్యకారుడు. చేపలుపట్టడంలో భర్తకు సాయం చేయడానికి రేఖ వెళ్లేది. ఆ క్రమంలోనే చేపలు పట్టడం, చినిగిన వలను బాగుచేయడం వంటి వాటిలో మెలకువలు నేర్చుకుంది. సముద్రంలో అకాల తుపాను, పెనుగాలులు ఎదురైనా జీపీయస్‌ లేకుండా ఒడ్డు చేరుకోవడం తెలుసుకుంది. ‘దాదాపు పది సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. నా మొదటి ప్రయాణాన్ని నేను ఇంకా మరిచిపోలేను. అదొక పీడకల లాంటిది. అలవాటులేని సముద్ర వాతావరణానికి నాకు కొన్ని వారాలు విపరీతంగా వాంతులు అయ్యాయి. ఆ తరవాత నెమ్మదిగా వాతావరణానికి అలవాటు పడ్డాను. సముద్ర ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. ప్రమాదం ఎప్పుడు, ఏ వైపు నుంచి వస్తుందో తెలీదు. ఆ రోజు జరిగిన సంఘటన నాకు బాగా గుర్తుంది. అర్ధరాత్రి దూరం నుంచి ఒక వెలుగు మా వైపు వేగంగా రావడం నేను గమనించా. అది మరొక పడవ. ఆ పడవలో ఉన్న వారంతా ఆదమరిచి నిద్రిస్తున్నారు. గట్టిగా అరవడంతో అందులోని ఒక వ్యక్తి విని పడవను మళ్లించారు. దాంతో మేము ప్రాణాలతో తప్పించుకున్నాం కానీ మా ఇంజిన్‌లో కొంతభాగం విరిగిపోయింది. మరొక పడవ వచ్చి మమ్మల్ని రక్షించడానికి దాదాపు ఏడున్నర గంటల సమయం పట్టింది’ అంటోంది రేఖ.

ఇది నీ పని కాదన్నారు..

కొన్నాళ్లకి కార్తికేయ ఆరోగ్యం క్షీణించడంతో, వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. కుటుంబ భారమంతా రేఖపై పడటంతో తనే సముద్రంలో చేపలవేటకు వెళ్లేది. చుట్టుపక్కలవాళ్లు ‘నువ్వు ఏమైనా మగాడివా.. అసలు ఇది నువ్వు చేసే పనేనా.. అంటూ విమర్శలు గుప్పించేవారు. ‘వారి మాటల్ని నేను పట్టించుకుంటే నా కుటుంబాన్ని పోషించేదెవరు.. కన్నీటి బాధ ఉప్పునీరు ఉన్న ఆ సముద్రానికే తెలుసు. అందుకే కడలమ్మపై భారం వేసి ఒంటరి పోరాటం చేస్తున్నా లైసెన్సు కోసం అధికారుల వద్దకు వెళ్లినపుడు ‘చేపలు పట్టడం మహిళల వృత్తికాదని నిరాకరించారు’. అని చెప్పుకొచ్చారు రేఖ. అయినా సరే పట్టువిడువక మళ్లీ మళ్లీ ప్రయత్నించి సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) నుంచి లైసెన్సు పొందారు. దేశంలో మొట్టమొదటి మత్య్సకారురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కైరాలీ పీపుల్‌ టీవీ జ్వాల అవార్డుతో సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలనీ అందుకున్న రేఖ నిత్యం సముద్రాన్నీ ఈదుతూ జీవనాన్ని సాగిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్