ఆమె ఆవాజ్‌ని నొక్కేయాలని చూశారు!

మొదటిసారి జరిగిన దాడిలో... దంతాలు విరిగాయి. చేతికి పక్షవాతం వచ్చింది. ఇక కనిపించని గాయాలు చాలానే! రెండోసారి కారుని వెనక నుంచి వేగంగా ఢీ కొట్టి తుక్కు చేశారు.

Published : 09 May 2024 03:27 IST

మొదటిసారి జరిగిన దాడిలో... దంతాలు విరిగాయి. చేతికి పక్షవాతం వచ్చింది. ఇక కనిపించని గాయాలు చాలానే! రెండోసారి కారుని వెనక నుంచి వేగంగా ఢీ కొట్టి తుక్కు చేశారు. ప్రాణం పోవాల్సిందే...  కాస్తలో తప్పింది. అలాగని ఆమె వెనక్కి తగ్గారా అంటే... లేదు. ధైర్యంగా ముందడుగే వేశారు. ఫలితమే... నేడు మన దేశంలో శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచుతున్న చట్టాలు.  ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పడుతున్న అడుగులు. ఆ ధైర్యం పేరు సుమైరా అబ్దుల్లా అలీ...

పెళ్లిళ్ల సీజన్‌లో... బ్యాండ్‌మేళాలు, ఎన్నికల సమయంలో... లౌడ్‌స్పీకర్లు, పండగలప్పుడు... టపాకాయల మోత, రోడ్డుమీద... ట్రాఫిక్‌ ఎంతగా వేధిస్తాయో ప్రత్యేకించి చెప్పాలా? గాలి, నీటి కాలుష్యాల ప్రభావం గురించి మనకి కొంత అవగాహన ఉంది. కానీ ఈ శబ్ద కాలుష్యం గురించి చాలామందికి తెలియదు. ప్రజలు అవగాహన పెంచుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదంటారు సుమైరా. దేశంలో పదిమంది పర్యావరణవేత్తల పేర్లు తీస్తే అందులో సుమైరా ఉంటారు. పుట్టి, పెరిగింది ముంబయిలో. మామగారు హుమాయూన్‌ అబ్దుల్లా పర్యావరణవేత్త. ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ సోదరుడే ఈయన. మరోవైపు మేనమామ సాద్‌అలీ బాంబే ఎన్విరాన్‌మెంట్‌ యాక్షన్‌ గ్రూప్‌ని నడిపేవారు. ఇలాంటి కుటుంబ వాతావరణం ఉన్నా... పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకూ సాధారణ గృహిణిగానే ఉన్నారు సుమైరా. హైకోర్ట్‌ సూచనల మేరకు శబ్దకాలుష్యానికి సంబంధించి మామగారు ఒక నియమావళిని తయారుచేస్తున్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్లని టైప్‌ చేస్తూ సహకరించేవారు. అలా ఈ సమస్యపై అవగాహన పెంచుకుని నగరాల్లో సైలెంట్‌ జోన్స్‌ కావాలంటూ హైకోర్ట్‌లో ఓ పిల్‌ వేశారు.

‘ఆ విషయం తెలిసి కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి నాకు. కల్యాణ మండపాలు, లౌడ్‌స్పీకర్ల కారణంగా ప్రశాంతత కరవవుతోందని మొరపెట్టుకున్నారు. అప్పుడే నాకీ సమస్య ఎంత పెద్దదో అర్థమై ‘ఆవాజ్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించా’ననే సుమైరా, 2007లో ట్రాఫిక్‌ రణగొణ ధ్వనులపై మరో పిల్‌ దాఖలు చేశారు. ఫలితంగా ముంబయిలో ఏడాదికోసారి ‘నో హాంకింగ్‌ డే’ అమలవుతోంది. ఆడియో మీటర్‌ సాయంతో పెళ్లి మేళాలు, టపాకాయల మోతలు, లౌడ్‌స్పీకర్ల శబ్దాన్ని నమోదు చేసి ఆ డేటాని ప్రభుత్వానికి అందించారు. ఆడియో మీటర్‌ని పట్టుకుని లాక్మేవేదికపై నడిచి శబ్దకాలుష్యంపై అందరి దృష్టి పడేట్టు చేశారు. దాంతో మహారాష్ట్రలో డీజే శబ్దాలపై నిషేధం మొదలయ్యింది. అలాగే హెలికాప్టర్లు చేసే అధిక శబ్దాన్ని కట్టడి చేసేందుకు ప్రైవేట్‌ హెలీప్యాడ్లనీ నియంత్రించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో... దేశవ్యాప్తంగా శబ్దాన్ని కొలిచే నాయిస్‌ మానిటరింగ్‌ నెట్‌వర్క్‌ ఏర్పడింది. ‘చట్టాలున్నా ప్రజల్లో అవగాహన ఉంటేనే... మార్పు సాధించడం తేలిక అవుతుంది’ అంటారీమె. అందుకే స్థానిక పత్రికలు ఆమెని ‘మినిస్టర్‌ ఆఫ్‌ నాయిస్‌’ అని అభిమానంగా పిలుస్తాయి.

ఇసుక మాఫియాపై పోరాటం.. 

‘నా బాల్యమంతా ముంబయిలోని అలీబాగ్‌ బీచ్‌లో గడిచింది. చూస్తుండగా అక్కడ ఇసుకని ట్రక్కులతో పట్టుకుపోతుంటే పోలీసులకు ఫిర్యాదు చేశా. చుట్టుపక్కలవాళ్లు ‘ఇసుకేగా అదేమన్నా బంగారమా’ అన్నారు. పోలీసులూ అదే మాట. నేనూ వదిలేద్దామనే అనుకున్నా, కానీ ఆ ఇసుక దొంగలు నాపై బలంగా దాడిచేశారు. చేతికి పక్షవాతం వచ్చింది. పళ్లు విరిగాయి. మరోసారి నా కారుని గుద్దించారు. దాంతో నేనూ అంతే పట్టుదలగా ఇసుకను తవ్వుతున్న ప్రాంతాల్లో ఫొటోలు తీసి హైకోర్ట్‌లో పిల్‌ వేశా. ఆ తరవాత నుంచీ ప్రభుత్వాలూ ఈ సమస్యపై సీరియస్‌గా దృష్టిపెట్టాయి. 20 ఏళ్ల క్రితం మాట ఇది. ఇప్పటికీ ఇసుక మాఫియా హింస ఏమాత్రం తగ్గలేదు. నిజమే ఇసుక లేకపోతే మహానగరాల్లేవు. కానీ ఇది మనం అనుకున్నట్టుగా అపరిమితం కాదు. నదీ పరివాహక ప్రాంతంలో దీన్ని తవ్వేస్తూ పోతే భూగర్భజలాలు పడిపోతాయి. వరదలు ముంచెత్తుతాయి. అందుకే దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి’ అనే సుమైరా అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో ఇందుకు సంబంధించిన కీలకమైన డేటాని అందించారు. ఫలితంగా ఐరాస ఇసుక తవ్వకాలపై కొన్ని హెచ్చరికలు జారీచేసింది. అలాగే పర్యావరణవేత్తలపై దాడులు జరగడాన్ని నిరసిస్తూ, తోటి కార్యకర్తలతో కలిసి ‘యాక్టివిస్ట్‌ ప్రొటెక్షన్‌ నెట్‌వర్క్‌’ని స్థాపించారీమె. క్యాంపైన్లు, డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా పర్యావరణ సమస్యలపై అవగాహన తీసుకొస్తూ పోరాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్