ఆవిష్కరణలతో అదరగొట్టారు!

మంచి కెరియర్‌లో కుదురుకున్నాం... హమ్మయ్య అనుకొనేలోపే ముచ్చటగా మూడుపదులు వచ్చేస్తాయ్‌. వీళ్లు మాత్రం ఆ వయసుకే దేశం మెచ్చిన ఆవిష్కరణలు చేశారు.

Updated : 17 May 2024 13:31 IST

మంచి కెరియర్‌లో కుదురుకున్నాం... హమ్మయ్య అనుకొనేలోపే ముచ్చటగా మూడుపదులు వచ్చేస్తాయ్‌. వీళ్లు మాత్రం ఆ వయసుకే దేశం మెచ్చిన ఆవిష్కరణలు చేశారు. వ్యాపారాల్లో, పరిశోధనల్లో  తమదైన ముద్రవేశారు. ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా- 2024 జాబితాలో మెరిశారిలా!


యాప్‌తో కాలుష్యానికి చెక్‌!

ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్‌... పెరుగుతున్న భూతాపానికి చెక్‌ పెట్టడం, కర్బన ఉద్గారాలని అదుపు చేయడం. ఈ పనిని ప్రభుత్వాలూ, పెద్దపెద్ద శాస్త్రవేత్తలే చేయాలా? మనలాంటి సామాన్యులు ఎందుకు చేయకూడదు? ప్రాచీ శెవ్‌గాంకర్‌ ఆలోచన కూడా ఇదే. సామాన్యులకూ కర్బన ఉద్గారాలపై అవగాహన తీసుకురావాలన్న లక్ష్యంతో ‘కూల్‌ ది గ్లోబ్‌’ యాప్‌కి శ్రీకారం చుట్టిందామె. దీనిలో చిన్నచిన్న టాస్క్‌లు ఉంటాయి. వాటిని పూర్తిచేసి... ప్రాక్టికల్‌గా అమలు చేయడం ద్వారా మనమూ తేలిగ్గా భూతాపాన్ని తగ్గించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన పర్యావరణ ప్రేమికులు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారంతాకలిసి ఇంతవరకూ ఐదు టన్నుల కర్బన ఉద్గారాలని అదుపు చేయగలిగారు. కేంద్రప్రభుత్వం ప్రశంసలు పొందిన ఈ యాప్‌ ఆలోచన ప్రాచీకి చాలా విచిత్రంగా వచ్చింది. ఏ కెరియర్‌ ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు... అనుకోకుండా స్కూల్‌ అసైన్‌మెంట్‌లో భాగంగా రాసిన ఉత్తరం ఒకటి కంటపడింది. ‘పదేళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది....’ అన్న ప్రశ్నకు తను రాసిన సమాధానం ఈ యాప్‌ రూపకల్పనలో స్ఫూర్తినిచ్చాయి. ‘నా ఆలోచనకి అమ్మానాన్నలు కూడా తోడుగా నిలిచారు. సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జర్నలిజం చేసేటప్పుడు స్వచ్ఛంద సంస్థలతో కలిసి, రెండు నెలలు కష్టపడి ఈ యాప్‌ని రూపొందించా’ అనే ప్రాచీని జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అవార్డులూ వరించాయి. కార్పొరేట్‌ సంస్థలూ, స్కూళ్లూ, విశ్వవిద్యాలయాలకు పర్యావరణ పాఠాలు చెబుతూ రాబోయే తరాలకు స్ఫూర్తిని నింపుతోంది ప్రాచీ. 


కాంతితో మెదడుకు చికిత్స!

నిషికి అంతుచిక్కని విషయాల్లో మెదడు పనితీరు కూడా ఒకటి. సప్నాసిన్హా పరిశోధనలు ప్రహేళికలాంటి ఆ మెదడుపైనే. మానవాళిని వేధిస్తున్న మానసిక సమస్యలు, అంతుచిక్కని ఆల్జీమర్స్‌, పక్షవాతం... ఇవన్నీ బ్రెయిన్‌కు సంబంధించిన ఇబ్బందులే. వీటికి పరిష్కారం కనుక్కొనేందుకు కాగ్నిటివ్‌సైన్స్‌లో ఆమె పరిశోధనలు చేస్తోంది. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోగా ఉన్న సప్న మెదడు సమస్యలకు ఆప్టోజెనిటిక్స్‌ సులభంగా పరిష్కారం చూపిస్తుందని నమ్ముతోంది. కాంతికి స్పందించే కణాల ద్వారా మెదడులో చైతన్యం తీసుకొచ్చి వెన్నెముక గాయాలని నయం చేయొచ్చంటుందీమె. న్యూరోసైన్స్‌లోకి రావడానికి ముందు నానోసైన్స్‌లోనూ ఆమె పరిశోధనలు సాగాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో అతిసన్నని గ్రాఫీన్‌పై పరిశోధించి దీన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోనే కాకుండా.. న్యూరోసైన్స్‌లోనూ వాడితే మెదడుకు జరిగే సర్జరీల్లో వైఫల్యాలు తగ్గించి, లక్షలమంది ప్రాణాలు నిలబెట్టొచ్చంటోంది. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రంగంలో అడుగుపెట్టింది సప్నా. జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ... ప్రతిష్టాత్మక స్మేట్‌ సైన్స్‌ ఫెలోషిప్‌ని అందుకుంది. భవిష్యత్తులో వచ్చే మహమ్మారి వ్యాధులని ముందేే ఊహించి దానికి పరిష్కారం ఇచ్చే అతికొద్దిమందికి మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌ ఇది.


పీసీఓఎస్‌కు... వీరా హెల్త్‌!

శోభితా నారాయణ్‌ది ముంబయి. టఫ్ట్స్‌ యూనివర్సిటీలో బయాలజీ అండ్‌ సైకాలజీ చదివింది. యాక్సెంచర్‌ లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ యునైటెడ్‌ హెల్త్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌... లాంటి ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీల్లో పనిచేసింది. అయితే, తనకు 22ఏళ్లప్పుడు పీసీఓఎస్‌ సమస్య వచ్చింది. మొదట్లో దాన్ని గుర్తించడం, సరైన వైద్య సలహా పొందడం ఓ పెద్ద సవాలుగా మారిందామెకు. ఆ లక్షణాలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏం చేయాలో పాలుపోయేదికాదు. అదే విషయాన్ని తన అక్క శాశ్వతా నారాయణ్‌తో చర్చించేది. అప్పుడే దీని బారినపడి అనేకమంది మహిళలు సంతానలేమి, డయాబెటిస్‌, డిప్రెషన్‌ లాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. దాని గురించి ఏమైనా చేయాలనుకుంది. అలా 2020లో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి ముంబయిలో ‘వీరా హెల్‌’్త అనే వెల్‌నెస్‌ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇందులో పీసీఓఎస్‌ చికిత్స చేయడానికీ, జీవనశైలిపై శిక్షణ ఇవ్వడానికీ అనేకమంది గైనకాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు, థెరపిస్టులూ అందుబాటులో ఉంటారు. 2021లో ఈ సంస్థ ‘సకోయా ఇండియా క్యాపిటల్స్‌ సర్జ్‌’, ‘గ్లోబల్‌ ఫౌండర్స్‌ క్యాపిటల్‌’ నుంచి రూ.25కోట్లకు పైగా ఫండింగ్‌నూ సాధించింది. ఇప్పటివరకూ మనదేశంలో సుమారు 10కోట్లమంది మహిళలకు పీసీఓఎస్‌ చికిత్సను అందించింది. అలా తన సమస్యతో ఇంతమందికి పరిష్కారం చూపింది శోభిత.


పూజా బాక్సులతో...

యూకేలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అమ్మాయి... పూజా సామాన్లు అమ్ముతానంటే అందరూ ఆశ్చర్యపోయారు. ‘చిన్నపిల్ల ఇంకా ఏం తెలియదు’ అన్నవారూ ఉన్నారు. అప్పటికి కావేరి సచ్‌దేవ్‌కి 21ఏళ్లే మరి. కానీ తను చేసే పనిపై తనకు పూర్తి నమ్మకం. కాబట్టే... ‘మై పూజా బాక్స్‌’ రూ.కోట్ల వ్యాపారమైంది. ఈమెది దిల్లీ. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఏం చేయాలి అని ఆలోచిస్తున్న కావేరి చూపు ఆన్‌లైన్‌ వ్యాపారంపై పడింది. కానీ వేటిని అమ్మాలి అన్నదానికే త్వరగా సమాధానం దొరకలేదు. ఇంట్లో పూజ, గృహప్రవేశం, వేడుకలు... ఏవైనా పూజాసామగ్రి సమకూర్చుకోవడం పెద్ద సమస్య. ‘దాన్ని సులభతరం చేస్తే’ అన్న ఆలోచన వచ్చి 2017లో ‘మై పూజా బాక్స్‌’ సంస్థను ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే ‘రాఖీ’ వచ్చింది. రాజస్థాన్‌ నుంచి రాఖీలు తెప్పించి, కుంకుమ దగ్గర్నుంచీ స్వీట్ల వరకూ ఓ కిట్‌లా చేసి ఆన్‌లైన్‌లో ఉంచింది. మొత్తం అమ్ముడుపోయాయి. తరవాత ఏ పండగకైనా ఇదే స్పందన. మూడేళ్లలోనే వ్యాపారం   రూ.10కోట్లకు చేరింది. కొవిడ్‌లో అమ్మకాలు మరింత పుంజుకున్నాయి. పూజాసామగ్రే కాదు ఇల్లు, పూజాగది అలంకరణ, దేవుడి విగ్రహాలు వంటివెన్నో అమ్ముతోంది. అయితే పర్యావరణహితమైనవీ, మహిళా హస్తకళల వారికే తన ప్రాధాన్యం. అలా ఎంతోమందికి ఉపాధినివ్వడమే కాదు... సంస్థను లాభాల్లో నడిపిస్తోంది. పెట్టుబడులూ వచ్చాయి. ముఖ్యంగా చిన్నపిల్ల అన్నవారితోనే విజయవంతమైన వ్యాపారవేత్త అనిపించుకుంది కావేరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్