ఆ ఐపీఎల్‌ బామ్మ... ఎవరు?

క్రికెట్‌ స్టేడియాల్లో అభిమాన క్రీడాకారుల కోసం ఫ్లకార్డులు పట్టుకునేవారు చాలామందే. కానీ విజయా పాటి వయసు 82. ‘నేను ధోనీ కోసం వచ్చా’... అనే ఫ్లకార్డుతో స్టేడియానికి రావడమే కాదు, యువతకు ఏమాత్రం తగ్గకుండా హడావుడీ చేశారు. కాబట్టే... ఈ బామ్మ ఏ స్టేడియానికి వెళ్లినా కెమెరాలన్నీ ఆమె చుట్టూనే తిరిగేవి.

Published : 18 May 2024 01:22 IST

క్రికెట్‌ స్టేడియాల్లో అభిమాన క్రీడాకారుల కోసం ఫ్లకార్డులు పట్టుకునేవారు చాలామందే. కానీ విజయా పాటి వయసు 82. ‘నేను ధోనీ కోసం వచ్చా’... అనే ఫ్లకార్డుతో స్టేడియానికి రావడమే కాదు, యువతకు ఏమాత్రం తగ్గకుండా హడావుడీ చేశారు. కాబట్టే... ఈ బామ్మ ఏ స్టేడియానికి వెళ్లినా కెమెరాలన్నీ ఆమె చుట్టూనే తిరిగేవి. ఇన్‌స్టా రీల్స్‌లోనూ ఈమె సందడి ఎక్కువే. అందుకే ఈమెవరా అని వెతికారు నెటిజన్లు. ఆవిడ ఓ వ్యాపారానికి వెన్నెముక అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

మండు వేసవిలో చల్లగాలికి ఆరుబయట కూర్చొని కబుర్లు చెప్పుకొనేప్పుడూ... బయట జోరుగా వాన కురుస్తూ... వెచ్చగా ఏదైనా తినాలనిపించినప్పుడూ... గుర్తొచ్చేది  సంప్రదాయ రుచులే కదూ! ఉద్యోగాలు చేస్తూ పట్టణాలకు వెళ్లిపోయిన వారు ఆ రుచుల్ని మరీ మిస్‌ అవుతుంటారు. వాటిని అందరికీ అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు చెన్నైకి చెందిన నళిని, ఆనంద్‌ భరద్వాజ్‌ దంపతులు. లోన్‌ కోసం కూడా ప్రయత్నించారు. కానీ అన్నీ తిరస్కరణలే. అప్పుడే నళిని అమ్మమ్మ అయిన విజయ రంగంలోకి దిగి, వాళ్ల వెన్నుతట్టారు. కేవలం రూ.2000 పెట్టుబడితో ‘స్వీట్‌ కారం కాఫీ’ ప్రారంభం అవ్వడానికి కారణమయ్యారు. స్వయంగా పిండివంటలు వండి అందించారు. దక్షిణాది మురుకులు, చెక్కలు, స్వీట్లు అన్నీ చేసేవారీమె. ఈ దంపతులు వాటిని మొదట్లో చుట్టుపక్కల వాళ్లకి పరిచయం చేశారు. తరవాత పాంప్లెట్లు పంచి మరీ కస్టమర్లను పొందారు. తొలిరోజుల్లో పండగలకే ఆర్డర్లు తీసుకునేవారు. కానీ బామ్మగారి చేతిరుచి అందరికీ నచ్చడంతో వ్యాపారం బాగా పెరిగింది. దీంతో నళిని, ఆనంద్‌ ఉద్యోగం కూడా మానేశారు. ఇప్పుడది రూ.కోట్ల వ్యాపారం. బామ్మగారి స్నాక్స్‌ విదేశాలకీ వెళుతున్నాయి. తాజాగా రూ.15కోట్ల పెట్టుబడి కూడా వచ్చింది. దీంతో విజయా పాటి కొంతమంది మహిళలకు శిక్షణనిచ్చారు. వాటిని వాళ్లు చేస్తోంటే ఆవిడ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారట. ‘మా అమ్మ, అమ్మమ్మల రుచుల్ని నేను ఈ తరానికి అందిస్తున్నా. అందరికీ నచ్చాయి. ప్రిజర్వేటివ్స్, కల్తీ నూనెలకు దూరం. నా పిల్లలకు పెట్టనివేవీ ఇతరులకు పెట్టొద్దనుకుంటా. అదే నా విజయ రహస్య’మనే బామ్మగారే వీటికి ప్రచారకర్త కూడా. ఇల్లు, సంసారం తప్ప వేరే లోకం తెలియని విజయా పాటీకి తొలిరోజుల నుంచీ క్రికెట్‌ ఊరటనిచ్చేదట. ఇప్పటికీ మ్యాచ్‌లు ఉంటే ఉత్సాహంగా స్టేడియానికి వెళతారు. హాస్యంతో కూడిన వీడియోలే కాదు... ఐపీఎల్‌ని ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలనూ ఇన్‌స్టాలో ఉంచుతారు. వాటికీ ఇప్పుడు అభిమానులు ఎక్కువే. అన్నట్టూ ఈ బామ్మగారికి కొత్త టెక్నాలజీ, యాప్‌ల గురించి తెలుసుకోవడమూ ఆసక్తేనట. భలే మోడరన్‌ బామ్మ కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్