నీలాల నింగిలోకి... మూడోసారి!

అంతరిక్షంలోకి వెళ్లాలని, విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలెన్నో శోధించాలని కలలుగనేవారు చాలామందే. కానీ, పశువైద్యురాలు కావాలనుకున్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మాత్రం అరుదైన ఈ అవకాశాన్ని మూడుసార్లు దక్కించుకున్నారు.

Updated : 18 May 2024 06:49 IST

నేడు అంతర్జాతీయ ఖగోళశాస్త్ర దినోత్సవం

అంతరిక్షంలోకి వెళ్లాలని, విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలెన్నో శోధించాలని కలలుగనేవారు చాలామందే. కానీ, పశువైద్యురాలు కావాలనుకున్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మాత్రం అరుదైన ఈ అవకాశాన్ని మూడుసార్లు దక్కించుకున్నారు. నాసా ‘కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో భాగంగా మరోసారి అంతరిక్షంలో అడుగపెట్టనున్న సందర్భంగా...

సునీతా విలియమ్స్‌... రెండుసార్లు అంతరిక్షయానం, 7 స్పేస్‌వాక్‌లు, దాదాపు 322 రోజులు అంతరిక్షంలో బస చేసిన అరుదైన రికార్డుల్ని నమోదు చేసిన వ్యోమగామి. సునీత మొదటిసారి అంతరిక్షానికి వెళ్లినప్పుడు- తన మూలాలను తెలియజేసేలా తండ్రి ఇచ్చిన భగవద్గీత, భారతీయులు ఇష్టపడే సమోసాలు, తల్లి జ్ఞాపకంగా స్లొవేకియా జెండా, కార్నియోలన్‌ సాసేజ్‌లను వెంట తీసుకెళ్లారట. అవును మరి, సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించినా తండ్రి దీపక్‌ పాండ్యాది గుజరాత్‌. తల్లి బోనీ జలోకర్‌ స్లొవేకియా దేశస్థురాలు. వీరి ముగ్గురు సంతానంలో సునీత చివరి అమ్మాయి.

నేవీ అధికారిణిగా...

సునీత... యూఎస్‌లోని నేవల్‌ అకాడమీలో ఫిజిక్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశారు. పశుపక్ష్యాదులపై ఇష్టంతో పశువైద్యురాలు కావాలనుకున్నారు. కానీ, తండ్రి సూచనతో నౌకాదళంలో అడుగుపెట్టారు. అక్కడ బేేసిక్‌ డైవింగ్‌ ఆఫీసర్‌గా కెరియర్‌ ప్రారంభించారు. నేవల్‌ ఏవియేటర్‌గా హెలీకాప్టర్‌ కంబాట్‌ సపోర్ట్‌ స్క్వాడ్రన్‌3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. వివిధ హోదాల్లో సేవలందించారు. సునీత తన కెరియర్‌లో 30 వేర్వేరు ఏర్‌క్రాఫ్ట్‌లపై 2770 ఫ్లైట్‌ అవర్స్‌ పూర్తి చేశారు. ఇదే నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేయడానికి దోహదపడింది. ఆపై అంతరిక్షయానంపై మక్కువతో 1998లో రోదసీ శిక్షణ తీసుకున్నారు. కల్పనా చావ్లా తరవాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత సంతతి మహిళ సునీత. ‘కలలా అనిపిస్తుంది కానీ, మొదటిసారి అంతరిక్షంలోంచి కిందకి చూసినప్పుడు భూమి ఎంతందంగా కనిపించిందో’ అంటూ సంబరపడుతూ చెబుతారు సునీత.

పోనీటైల్‌ కత్తిరించి...

మొదటి స్పేస్‌టూర్‌ కోసం సూట్‌లో రెడీ అవడానికే సునీతకు రెండు గంటలు పట్టిందట. అయితే, అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ పనులు చేసుకోవడం మాత్రం తనకు భలే సరదాగా ఉండేదంటారామె. సునీత సాహసి మాత్రమే కాదు... గొప్ప మనసున్న వ్యక్తి కూడా. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు తన జుట్టుని కత్తిరించి ‘లాక్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. అంతేకాదు, అక్కడి నుంచి బోస్టన్‌ మారథాన్‌లో పాల్గొన్న మొదటి వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. అంతేనా, ఆమె స్పేస్‌లో గడిపిన 322 రోజుల్లో ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదట. ‘అంతరిక్షంలో పగలూరాత్రీ ఒకేలా ఉంటాయి. అందుకే గ్రీన్‌విచ్‌ కాలమానాన్ని అనుసరిస్తూ మా పనుల్ని షెడ్యూల్‌ చేసుకునేవాళ్లం. ఇక వినోదం కోసం నేను వంటల ప్రోగ్రామ్స్‌ ఎక్కువగా చూసేదాన్ని. అలాగే డైరీ రాసుకోవడం, ఫొటోగ్రఫీ, వ్యాయామం చేయడం... ఇలా నా అభిరుచులపై ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని’ అని గతాన్ని గుర్తు చేసుకుంటారామె. సునీత తొలి పర్యటన 2006 డిసెంబర్‌ నుంచి 2007 జూన్‌ వరకూ సాగగా, 2012లో రెండోసారి నాలుగు నెలల పాటు ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’లో గడిపారు.

అంతరిక్షంలో ఏం చేస్తారు?

ఐఎస్‌ఎస్‌కి వెళ్లి రావడమంటే... చుట్టపు చూపుగా కాదండోయ్‌! అక్కడికి వెళ్లే వారికి నాసా బోలెడు పనులు అప్పజెబుతుంది. అక్కడ గడిపిన ఆరునెలల్లో సునీత కూడా సౌరఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివెన్నో చేశారు. రెండోసారి ఆర్బిటింగ్‌ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. అంతరిక్షంలో వాతావరణం భూమికి భిన్నంగా ఉంటుంది. జీరోగ్రావిటీలో ఉండే ఆహారం, నీళ్లు వంటివన్నీ పొదుపుగా వాడుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రాన్నీ శుద్ధి చేసి తాగాల్సి ఉంటుంది. ఇక, శారీరక, మానసిక ఉద్వేగాలనూ నియంత్రించుకోగలగాలి. ఇందుకు కఠోర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సునీత చేయగలిగారు కాబట్టే మూడోసారీ అవకాశం వచ్చింది. 2008లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రదానం చేసింది. మరెన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులూ వరించాయి.


సాగరంలో అన్వేషణ

సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టారన్న విషయం తక్కువమందికి తెలుసు. సముద్రం అడుగున మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే ‘నాసా ఎక్స్‌ట్రీమ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మిషన్‌ ఆపరేషన్స్‌’ బృందంతో కలిసి పనిచేశారు. ఫ్లోరిడాకు సమీపంలోని ‘కీలార్గో’ అనే ప్రాంతంలో 9 రోజుల పాటు ఈ అన్వేషణ సాగింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్