ఎవరీ పశు సఖి..!

భుజాన బరువైన నీలి రంగు బాక్సుతో, నీలివర్ణ దుస్తుల్లో... ఆమె పొలిమేరల్లోకి అడుగుపెడుతోందని తెలిస్తే చాలు. ఆ గ్రామప్రజలంతా సంతోషంలో మునిగిపోతారు.

Published : 20 May 2024 01:43 IST

భుజాన బరువైన నీలి రంగు బాక్సుతో, నీలివర్ణ దుస్తుల్లో... ఆమె పొలిమేరల్లోకి అడుగుపెడుతోందని తెలిస్తే చాలు. ఆ గ్రామప్రజలంతా సంతోషంలో మునిగిపోతారు. తమ మేకలు, పశువుల ఆరోగ్యం మెరుగుపడి.. తమ కష్టాలన్నీ తీరిపోతాయని భావిస్తారు. అంతలా అందరి అభిమానాన్ని పొందుతూ... ‘వన్‌ ఉమెన్‌ మిషన్‌’గా ప్రశంసలు అందుకుంటున్న ఈ ‘పశు సఖి’ గురించి తెలుసుకుందాం... 

గ్రామస్తులంతా ఇష్టంగా పశుసఖి అని పిలుచుకొనే సరోజదేవిది రాయపుర్‌ గ్రామం. తన పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాలని మొదట్లో వాళ్లని ప్రైవేటు పాఠశాలలో చేర్చింది సరోజ. భర్త కూలిపనులకు వెళ్లేవాడు. ఆ సంపాదన సరిపోక వేడుకల్లో సౌండ్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌గానూ పనిచేసేవాడు. ఇంత చేసినా అతని సంపాదన పిల్లలకు స్కూల్‌ ఫీజు, పుస్తకాలు కొనడానికి కూడా వచ్చేది కాదు. తిరిగి అప్పు చేయాల్సి వచ్చేది. రుణభారం పెరుగుతుండటంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోకి మార్చారు. ‘మా ఆయనతోపాటు నేను కూడా ఏదైనా పనికెళ్లాలనుకున్నా. అప్పుడే అగాఖాన్‌ ఫౌండేషన్‌(ఏకేఎఫ్‌) కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ ద్వారా వాళ్లు చేపట్టిన ఒక ప్రాజెక్టు గురించి తెలిసింది. మహిళలకు ‘పశు సఖి’గా ఉద్యోగమిచ్చి గ్రామాల్లోని మేకలు, పశువుల సంరక్షణపై శిక్షణనిస్తారని తెలిసింది. వెంటనే దరఖాస్తు చేసుకున్నా. ఎంపికవడంతో శిక్షణ కూడా తీసుకొని విధుల్లో చేరా’నంటుంది సరోజదేవి.  

తక్షణ చికిత్సతో...

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లా గ్రామాలన్నింటిలో జీవనాధారం మేకలు, ఇతర పశువుల పెంపకమే. గతంలో వాటికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం మైళ్లదూరంలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. ‘పశు సఖి’గా సరోజదేవి అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచీ ఈ సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ‘ పశువుల్లో నులిపురుగుల నిర్మూలన, వాటికి టీకాలు, మేకలకు వచ్చే వ్యాధులకు చికిత్స వంటి సేవలు అందిస్తున్నా. గ్రామాల నుంచి నాకు నిరంతరం ఫోన్‌లు వస్తూనే ఉంటాయి. తమ పశువుకు అనారోగ్యంగా ఉందని, ఆహారం తీసుకోవడం లేదని, పాలివ్వడం లేదంటూ ఎన్నో సమస్యలు చెబుతుంటారు. మరికొందరు మేక ఈనలేకపోతోందని కబురు పెడతారు. అప్పటికప్పుడు పశువుల అనారోగ్య లక్షణాలు విని, తాత్కాలిక ఉపశమనం చెబుతా. అలాగే అత్యవసరమైన సమస్యల్ని ముందు పరిష్కరించి, ఆ తరవాతే మిగతావాటి వద్దకు వెళతా. మేకలు సాధారణంగా ఈనడానికి ముందు అనారోగ్యానికి గురవుతుంటాయి. మరికొన్ని డెలివరీ తర్వాత తీవ్రంగా జబ్బు పడతాయి. ఆయా వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్సనందించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు టీకాలు వేయాలి. దీనిపై అందరికీ అవగాహన కలిగించడానికి వారానికొకసారి గ్రామీణ మహిళలందరినీ సమావేశపరుస్తా. ముఖ్యంగా పశువులకు టీకాల సమయాన్ని పాటించడం ఎంత ముఖ్యమో చెబుతుంటా. అలాగే  మేక ఆరోగ్యానికి సంజీవనిలాంటి అజొల్లా మొక్క పెంపకంపై అందరిలో అవగాహన కలిగిస్తున్నా’నని చెబుతున్న 31 ఏళ్ల సరోజదేవి ఇప్పటివరకు వందల మేకలకు సమయానికి చికిత్సనందించి ప్రాణాపాయం నుంచి తప్పించింది. అందుకే అందరూ ఆమెని ఆత్మీయంగా పశుసఖీ అనిపిలుచుకుంటారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్