కడలి పిలిచింది!

మీకు ఊపిరి తీసుకోవడం ఇష్టమేనా?  అయితే సాగరంతో ప్రేమలో పడండి... మనకి ఆక్సిజన్‌ ఇచ్చేది సముద్రాలే మరి. అవే చచ్చిపోతే మనం శ్వాస ఎలా తీసుకుంటాం? సముద్రాలు బతకాలంటే... వాటిపై పరిశోధనలు జరగాలి.

Published : 20 May 2024 18:44 IST

మీకు ఊపిరి తీసుకోవడం ఇష్టమేనా?  అయితే సాగరంతో ప్రేమలో పడండి... మనకి ఆక్సిజన్‌ ఇచ్చేది సముద్రాలే మరి. అవే చచ్చిపోతే మనం శ్వాస ఎలా తీసుకుంటాం? సముద్రాలు బతకాలంటే... వాటిపై పరిశోధనలు జరగాలి. ఇందుకోసం స్కూబా డైవింగ్, ఓషనోగ్రఫీ, మెరైన్‌సైన్స్‌... వంటి రంగాల్లోకి అమ్మాయిలు  వస్తే కడలి కాలుష్యాన్ని అదుపులో ఉంచడం తేలిక అనేది నిపుణుల మాట. ఎందుకు అమ్మాయిలే రావాలి? అనేదానికీ సమాధానం ఉంది...

భూగోళాన్ని మూడొంతులు ఆక్రమించిన సముద్రాల గురించి మనకు తెలిసింది ఆవగింజంతే! తక్కిన రహస్యాలు తెలుసుకోవాలంటే సముద్ర లోతులపై అవగాహన ఉండాలంటారు 88 ఏళ్ల సిల్వియా ఎర్లీ. తన జీవితం మొత్తాన్ని కడలి అన్వేషణలో గడిపిన ఈ శాస్త్రవేత్త, సముద్ర జీవితంపై అనేక రచనలు చేశారు. 1200 అడుగుల లోతుకు వెళ్లి.. ‘హెర్‌ డీప్‌నెస్‌’ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. మిషన్‌ బ్లూ సంస్థను స్థాపించి... తన కూతురు లిజ్‌టేలర్‌తో కలిసి సముద్ర యాత్రలు నిర్వహిస్తుంటారీమె. మొదటిసారి సముద్రంలోకి ఆల్‌విమెన్‌ టీంని తీసుకెళ్లి... సముద్ర జీవితంపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘స్కూబా డైవింగ్‌ చేయడానికి మగవాళ్లకంటే మన శరీరం అనువుగా ఉంటుంది. వాళ్లతో పోలిస్తే మనం ఆకృతిలో చిన్నగా ఉంటాం. ఊపిరితిత్తులూ చిన్నగా ఉంటాయి. కండబలం తక్కువ. నడుము, హిప్స్‌ దగ్గర కొవ్వు ఎక్కువ. ఫిట్‌నెస్‌ పరంగా మనకున్న ఈ లోపాలే సముద్రాలని అన్వేషించే క్రమంలో వరంగా మారుతున్నాయి. అవును... సముద్రంలో డైవింగ్‌ చేయాలంటే సిలిండర్ల నుంచి గాలి తక్కువ తీసుకోవాలి. అలా అయితేనే నీటిలో ఎక్కువ సేపు ఉండగలరు. ఇవన్నీ డీప్‌ స్కూబా డైవింగ్, ఓషనోగ్రఫీ, ఓషన్‌ ఫొటోగ్రఫీ, మెరైన్‌ బయాలజిస్టులుగా మారి ప్రకృతిని కాపాడే శక్తినిస్తున్నాయి. అన్నింటికీ మించి ప్రకృతిని ప్రేమించే గుణం కూడా మనల్ని సముద్రాల అన్వేషణకీ, ఆ రంగంలో కెరియర్‌ని నిర్మించుకొనేందుకు దోహదం చేస్తుంద’ంటారు సిల్వియా. అయితే ప్రపంచవ్యాప్తంగా డైవింగ్‌ రంగంలో 69 శాతం మగవాళ్లుంటే 30 శాతం మాత్రమే మహిళలున్నారు. ఇప్పుడిప్పుడే సముద్రాల అన్వేషణలో ఓషనోగ్రాఫర్లుగా, స్కూబా డైవర్లుగా మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

తొలిసారి...

ఫ్రెంచ్‌ నౌకాధికారి జాక్వెస్‌ నీటి అడుగున ప్రయాణించేందుకు వీలుగా ‘ఆక్వాలంగ్‌’ పరికరాన్ని మొదటిసారి ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణకి అసలు స్ఫూర్తి జాక్వెస్‌ భార్య సిమోన్‌. ఆ ఆక్వాలంగ్‌ సాయంతో సముద్ర గర్భంలోకి వెళ్లిన సిమోన్‌ మొదటి మహిళా స్కూబా డైవర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలా మొదలైన మహిళల ప్రస్థానం ఇప్పుడు మరింత వేగంగా ముందుకెళుతోంది. ఇక మనదేశం విషయానికొస్తే... చెన్నైకి చెందిన నీలాభాస్కర్‌ దేశపు తొలి సర్టిఫైడ్‌ కేవ్‌ డైవర్‌గా పేరు తెచ్చుకున్నారు. భూమిపై ఉన్నట్టుగానే సముద్రం అడుగునా నిగూఢమైన గుహలుంటాయి. వీటి నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు కూడా సముద్ర కాలుష్యానికి కారణమే. ఆ గుహలని అన్వేషించి పరిశోధనలకు తగిన సమాచారం ఇస్తారీమె. మాయా పిళ్లై, పాలక్‌ శర్మ, మధుమతి, అర్చనా సర్దానా వంటివారు స్కూబా డైవింగ్‌ని కెరియర్‌గా చేసుకుని రాణిస్తున్నారు. ఉమెన్‌ డైవర్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని డైవింగ్‌లో ప్రోత్సహిస్తూ స్కాలర్‌షిప్‌లు, నెట్‌వర్కింగ్‌ తోడ్పాటుని అందిస్తోంది. 

దేశీ డైవర్లు...

అది శ్రీలంకకీ, భారత్‌కీ మధ్య ఉన్న పంబన్‌ ప్రాంతం. మామూలుగా కంటే ఇక్కడ ఎండ ఎక్కువ. చుర్రుమనే ఆ ఎండలో చేతులకు గుడ్డపీలికలు చుట్టుకున్నారు. ఎందుకంటే సముద్రం అడుగున ఉండే పదునైన రాళ్లు ఆ అరచేతులని చీల్చేయకుండా. కాళ్లకు రబ్బరు చెప్పులు తొడుక్కున్నారు. విషపు చేపల బారి నుంచి రక్షించుకొనేందుకు నడుం చుట్టూ గోనెపట్టా కట్టుకున్నారు. అంతా యాభై నుంచి అరవైఏళ్ల వాళ్లు. వయసుని లెక్క చేయకుండా సముద్రంలోకి ధైర్యంగా దూకారు. కొన్ని నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి... కడలి బంగారం సముద్ర నాచుని ఏరి తెచ్చుకున్నారు. ఒడ్డుకొచ్చాక ఆ నాచుని కేజీల లెక్కన అమ్మారు. ఇప్పుడు మనం పైన చెప్పుకొన్న డైవర్లకున్నట్టుగా అండర్‌ వాటర్‌లోకి వెళ్లేందుకు అవసరం అయిన పరికరాలేమీ వీళ్లకు లేవు. అమ్మమ్మలకాలం నుంచీ ఈ సంప్రదాయ విద్యను నేర్చుకుని నాచు వేటతో పబ్బం గడుపుతున్న సంప్రదాయ దేశీ మహిళా డైవర్లు వీళ్లు. మగవాళ్లు ఈ పనిచేయరు. ఈ పనిచేయాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలి. ముందే అనుకున్నట్టుగా ఊపిరిని బిగపట్టే సామర్థ్యం ఉండాలి. ఇవే వీళ్లకి జీవనోపాధిని ఇస్తున్నాయి. సముద్రం సంపద ఇస్తుంది కదాని ఘడియకోసారి సముద్రంలోకి వెళ్లరు. నిర్ణీతకాలంలో అలల తాకిడి తక్కువగా ఉండే సమయంలో మాత్రమే నాచుని తీస్తారు. పైగా ఒకసారి తీస్తే విరామం ఇచ్చి ఆ నాచు పెరిగిన తరవాతే మళ్లీ వేటకు వెళ్తారు. ఇలా ప్రకృతిని గౌరవిస్తూ తమిళనాడులో 5000 వేలమంది ఉపాధి పొందుతున్నారు. 


మనదేశం చుట్టూ సముద్రమున్నా.. ఈత నేర్చుకునే ఆడవాళ్లు తక్కువగా ఉంటారు. కానీ మెరైన్‌ సైన్సులో అనేక అవకాశాలున్నాయి. వాటి గురించి తెలియాలంటే డైవింగ్‌పై అవగాహన పెంచుకోవాలి.

 రిచామాలిక్, స్కూబా ఇన్‌స్ట్రక్టర్‌


మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని అందించే సముద్రాలు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల కారణంగా కలుషితం అవుతున్నాయి. సముద్రజలాలు వేడెక్కడం వల్ల కడలి నాచు అంతరించిపోతుంది. డైవర్లుగా మాకా పరిస్థితి తెలుసు. సముద్ర వ్యర్థాల్ని తొలగించాలంటే డైవర్ల సంఖ్య పెరగాలి. తగిన శిక్షణ తీసుకుని డైవర్లుగా రాణిస్తే... పర్యావరణాన్ని రక్షించిన వాళ్లమవుతాం.

 నీలాభాస్కర్, కేవ్‌ డైవర్‌


అందుకే ఎడమవైపు...

మీకు తెలుసా!

మీరెప్పుడైనా పిల్లల్ని ఎత్తుకుంటే ఏ వైపు ఎత్తుకుంటారు? ఎడమవైపే కదా! అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా! చేతివాటం కుడి అయినా, ఎడమ అయినా సరే... ఎక్కువమంది తల్లులు తమ పిల్లల్ని ఎడమవైపే ఎత్తుకుంటారట. ప్రత్యేకించి తొలినెలల్లో. ఎందుకంటే... శరీర ఎడమ భాగానికి సంబంధించిన జ్ఞానేంద్రియాల సమాచారమైనా, భావోద్వేగాలను నియంత్రించే సమాచారమైనా మెదడులోని కుడిభాగంలో విశ్లేషణ జరుగుతుంది. అంతేకాదు శిశువులు కూడా తమ తల్లులు తమకు ఎడమ వైపే కనిపించాలనుకుంటారట. ఇలా మనుషుల్లోనే కాదు, గొరిల్లాలు, చింపాంజీలు, ఫ్లయింగ్‌ ఫాక్స్‌లాంటి వాటిలోనూ ఇలానే జరుగుతుందట.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్