మాసికా మహోత్సవ్‌... ఓ అరుదైన వేడుక!

ఇది అన్ని పండుగల్లాంటిది కాదు. మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనది. ప్రతి నెలా వచ్చే ఆ పండుగ పేరే నెలసరి... కానీ ఆ పేరు పలకడానికే ఎందరో మహిళలు సిగ్గుపడుతుంటారు.

Published : 21 May 2024 01:12 IST

ఇది అన్ని పండుగల్లాంటిది కాదు. మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనది. ప్రతి నెలా వచ్చే ఆ పండుగ పేరే నెలసరి... కానీ ఆ పేరు పలకడానికే ఎందరో మహిళలు సిగ్గుపడుతుంటారు. అందుకే ప్రకృతి సహజమైన ఆ రుతుక్రమం గురించిన అపోహల్ని దూరం చేస్తూ దానిపట్ల అవగాహన కలిగించే అరుదైన వేడుకే ‘మాసికా మహోత్సవ్‌’... ఈ రోజు నుంచి వారంపాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.

రుతుక్రమం, పీరియడ్స్, నెలసరి... పేరేదైనా మహిళల పాలిట అది పెద్ద సమస్యే. ఆధునిక మహిళలు అది అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ నేటికీ ఆర్థికంగా వెనకబడిన వర్గాల్లోనూ మారుమూల పల్లెల్లోనూ దీనిపట్ల సరైన అవగాహన లేక ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైతం దీని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటారు. అందుకే నెలసరి సమస్యల గురించి ధైర్యంగా చర్చించేలా అందరినీ ప్రోత్సహించడానికే ఈ వేడుక ప్రారంభమైంది. దీనివెనుక సామాజిక సేవకుడు నిశాంత్‌ బంగేరా కృషి ఉంది.

ముంబయి, థానె, పుణె... వంటి ప్రాంతాల్లోని నిరుపేద మహిళలకు రుతుక్రమంపై అవగాహన కలిగించాలని 2014లో నిశాంత్‌ ‘మ్యూస్‌’ అనే ఎన్జీవోను ప్రారంభించారు. కేవలం సాంకేతిక సమాచారాన్ని మాత్రమే కాకుండా, నెలసరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన పెంచాలనుకున్నారు నిశాంత్‌. ఫలితమే 2017లో మొదలైన ‘మాసికా మహోత్సవ్‌ (రుతుస్రావం పండుగ). అప్పటినుంచి గత ఏడేళ్లుగా ‘ఏ పీరియడ్‌ ఆఫ్‌ షేరింగ్‌ క్యాంపెయిన్‌’ పేరుతో మే 21న ప్రారంభించి వరసగా వారం రోజులపాటు వేడుకలా నిర్వస్తున్నారు. రుతుక్రమ నిషేధాలను సవాలు చేయడం, దానిపై ఉండే అపోహలను తొలగించడమే దీని లక్ష్యం. అందులోభాగంగా నృత్యం, సంగీతం, కవి సమ్మేళనాలు, క్రీడలు, కళలు సహా పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మహిళలకు నెలసరిపై అవగాహన కలిగిస్తారు. మహిళలందరూ దీనికి ఆహ్వానితులే. ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యులను చేస్తారు. నెలసరి రోజుల్లో శరీరంలో వచ్చే మార్పులు, పాటించాల్సిన పరిశుభ్రత గురించి వర్క్‌షాపులు నిర్వహిస్తారు. మొదట మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ మాసికా మహోత్సవ్‌... నేడు బిహార్, దిల్లీ, గుజరాత్, జమ్ము, కశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు... ఇలా దాదాపు పదిహేను రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. సుమారు 33 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఖండాల్లోని 11 దేశాలకూ ఇది విస్తరించింది. ఆడపిల్లలకే కాకుండా మగపిల్లలకూ దీనిపై అవగాహన కలిగించేలా మహిళలంతా మారాలన్న లక్ష్యంతో చేస్తోన్న ఈ వేడుక నిజంగానే అరుదైనదే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్