రొయ్య పొట్టుతో... అంతర్జాతీయ పురస్కారం!

సముద్ర ఆహారాన్ని ఇష్ట పడేవారి జాబితాలో రొయ్యలు తప్పక ఉండాల్సిందే. కానీ వాటి పైపొట్టుతో పర్యావరణానికి ఎంత హాని కలుగుతోందో తెలుసా? అందుకే దీనికి పరిష్కారం చూపాలి అనుకుంది రియా థామస్‌... ఆ ఆలోచనతో అంతర్జాతీయ పురస్కారాన్నీ అందుకుంది.

Published : 23 May 2024 13:21 IST

సముద్ర ఆహారాన్ని ఇష్ట పడేవారి జాబితాలో రొయ్యలు తప్పక ఉండాల్సిందే. కానీ వాటి పైపొట్టుతో పర్యావరణానికి ఎంత హాని కలుగుతోందో తెలుసా? అందుకే దీనికి పరిష్కారం చూపాలి అనుకుంది రియా థామస్‌... ఆ ఆలోచనతో అంతర్జాతీయ పురస్కారాన్నీ అందుకుంది.

రియా థామస్‌ స్వస్థలం కొచ్చి. పెరిగిందేమో మంగళూరులో. తనూ సముద్ర ఆహార అభిమానే. రొయ్య వ్యర్థాలను చూడటమూ కొత్తేమీ కాదు. యూకేలోని ‘రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఇంపీరియల్‌’ నుంచి గ్లోబల్‌ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్‌ చేసింది. ఓసారి స్టూడెంట్‌     ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా జపాన్‌ వెళ్లింది. అక్కడ సీఫుడ్‌ వ్యర్థాలు ఆమెను ఆకర్షించాయి. ‘నేను పెరిగిందీ సముద్ర తీరప్రాంతాల్లోనే. ఇలాంటివి చాలాసార్లు చూశా. కానీ ఇక్కడికొచ్చాకే తీవ్రత అర్థమైంది. జపాన్, చైనా ప్రజలు సముద్ర ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. ఫలితమే చాలాచోట్ల గుట్టలుగా కనిపించే వ్యర్థాలు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 1.5 కోట్ల టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని తెలిసి ఆశ్చర్యపోయా. పరిశోధిస్తే... ఖర్చు అని చెప్పి చాలామంది వీటిని పూడ్చకుండా కుప్పగా వేయడం, నీటిలో పడేయడం చేస్తున్నారని తెలిసింది. సహజమైనవేగా... భూమిలో కలిసిపోతాయని చాలామంది సర్దిచెప్పినా... వీటివల్లా కలిగే నష్టమెంతో. దీన్నుంచి విడుదలయ్యే మీథేన్‌తో పర్యావరణానికి హాని. రొయ్యపొట్టు నీటిలోని మంచి బ్యాక్టీరియాను చంపేసి, అక్కడి వాతావరణాన్నీ దెబ్బతీస్తుంది’ అనే రియా దీనికో పరిష్కారం కనుక్కోవాలనుకుంది.
రొయ్య పొట్టును సేకరించి, కుండీలను రూపొందించింది. దీనికోసం పొట్టును పొడిచేసి, ఆర్గానిక్‌ బైండింగ్‌ మెటీరియళ్లను ఉపయోగించింది. ‘హార్టీకల్చర్‌తోపాటు కొన్నిరకాల మొక్కలను ప్లాస్టిక్‌ కవర్లు లేదా చిన్న కుండీల్లో పెంచి, ఆపై నేలలో నాటుతారు. అదే ఈ కుండీలైతే నేరుగా వీటితోసహా నాటుకోవచ్చు. మొక్కలకు కావాల్సిన పోషకాలూ అందుతాయి, ప్లాస్టిక్‌నీ తగ్గించొచ్చు’అనే రియా తన ఆలోచనతో ‘ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ ఫ్యూచర్‌ అవార్డ్‌’తోపాటు పదివేల డాలర్లనీ గెలుచుకుంది. ‘రొయ్య గుల్లలను అలంకరణ వస్తువులు, ప్యాకేజింగ్‌ మొదలైన వాటికీ ఉపయోగించొచ్చు. అవి ఎంతకాలం మన్నుతాయన్న దానిపై పరిశోధన చేస్తున్నా’నంటోంది 27ఏళ్ల రియా. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్