పురాణగాథలు... ఆటలుగా!

అనగనగా అని బామ్మ చెప్పిన కథలంటే చరణ్య కుమార్‌కి ఇప్పటికీ ఇష్టమే! ఆమె దృష్టిలో అవి నిద్రపుచ్చే సాధనాలు కాదు... పరిస్థితేదైనా ధైర్యంగా ముందుకు నడిపే మార్గాలు. అందుకే వాటిని రాబోయే తరాలకు అందించాలనుకున్నారామె. ఫలితమే ఆమె సంస్థ ‘చిత్తం’!

Published : 27 May 2024 14:19 IST

అనగనగా అని బామ్మ చెప్పిన కథలంటే చరణ్య కుమార్‌కి ఇప్పటికీ ఇష్టమే! ఆమె దృష్టిలో అవి నిద్రపుచ్చే సాధనాలు కాదు... పరిస్థితేదైనా ధైర్యంగా ముందుకు నడిపే మార్గాలు. అందుకే వాటిని రాబోయే తరాలకు అందించాలనుకున్నారామె. ఫలితమే ఆమె సంస్థ ‘చిత్తం’!

ఉదయాన్నే కళ్లు తెరవడం ఆలస్యం... చరణ్య కళ్లు బామ్మ కోసమే వెదికేవి. ఆరోజు ఏమేం కథలు చెబుతుందా అన్న ఆతృత. అంతేనా... పనిచేయకుండా విసిగిస్తోంటే ‘నక్షత్రకుడిలా వెంటపడకు’ అనేవారట. మాట వినకుండా గాయం తగిలించుకుంటే ‘నీలాగే... బాల హనుమాన్‌ కూడా మాట వినలేదు కాబట్టే, మూతి కాలింది’ అని, మరోసారి ‘న్యాయం వారివైపు ఉంది కాబట్టే కృష్ణుడు పాండవుల వైపు నిలిచాడు’... అంటూ ప్రతి సందర్భాన్నీ ఓ కథతో ఉదహరించేవారట. అంటే అంతర్లీనంగా ఓ నీతినీ జోడించేవారు. చిన్నతనంలో అలా విన్న కథల ప్రభావం చరణ్యకు కెరియర్, వైవాహిక జీవితాల్లో సానుకూలంగా ఆలోచించడానికి సాయపడిందట. ఈవిడది చెన్నై. అమెరికాలో కంప్యూటర్‌సైన్స్‌లో మాస్టర్స్, సింగపూర్‌లో ఎంబీఏ చేశారు. 14ఏళ్లు ప్రముఖ విదేశీ సంస్థల్లో పనిచేసి, భారత్‌కు తిరిగొచ్చారు. ఓసారి అనుకోకుండా ఓ టీనేజర్‌ స్నేహితులతో ‘ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా’ అనడం విన్నారట. అంత చిన్నపిల్లల నోట ఆ మాట వినడం తట్టుకోలేకపోయారామె.

కెరియర్‌ పరంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పుడూ, వరుసగా అబార్షన్‌లు అయినప్పుడూ సానుకూలంగా ఆలోచించడంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆవిడకి ఈ పురాణగాథలే సాయపడ్డాయట. వాటిని ఈ తరానికి అందించాలనే 2023లో ‘చిత్తం’ ప్రారంభించారు. ఇదో ఎడ్యుటైన్‌మెంట్‌ సంస్థ. అంటే ఆటలకు మన సంస్కృతీసంప్రదాయాలు, చరిత్ర, పురాణాలను జోడిస్తారు. పజిల్స్‌ దగ్గర్నుంచి కార్డ్‌ గేమ్‌ల వరకూ వివిధ రూపాల్లో... ఏడాది వయసు నుంచి పెద్దపిల్లల వరకూ సాయపడేలా ఉంటాయివి. భిన్నరకాల సంస్కృతులు, సామెతలు, స్వాతంత్య్ర సమరయోధులు, ఆహారం, నృత్యాలు... ఇలా ప్రతిదానికీ చోటిచ్చారు. సొంత వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్‌ వేదికల్లోనూ వీటి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ‘ఈ ఆటలు ఆడటం ద్వారా నేర్చుకునే వీలుంటుంది. పెద్దవాళ్ల సాయం తప్పనిసరి. కాబట్టి, వాళ్లతోనూ సత్సంబంధాలు ఉంటాయి. వీటి రూపకల్పనకు చాలా పరిశోధనలే చేశా. ఒక్కోటీ ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతిదీ మన సంస్కృతి గొప్పతనాన్ని చాటేదే. ఇప్పటి తరాలకు ఇవి నచ్చుతాయా అని చాలామంది అన్నారు. కానీ విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తోంటే ఆనందంగా ఉంది’ అంటారు చరణ్య. తాజాగా ఇన్వెస్టర్ల నుంచి రూ.30 లక్షల పెట్టుబడినీ అందుకున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్