క్విల్ట్‌పై ఊరి కథలు అల్లేసింది!

బాల్యం ప్రతి ఒక్కరికీ మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. పుట్టిన ఊరు అందమైన జీవితాన్ని గుర్తుకుతెస్తుంది. ఈ రెండింటినీ అందమైన కథా చిత్రంగా మార్చి ఎంబ్రాయిడరీలో ఒదిగిపోయేలా చేశారు గోవాకు చెందిన డాక్టర్‌ సవియా విగాస్‌. అదెలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Published : 30 May 2024 01:28 IST

బాల్యం ప్రతి ఒక్కరికీ మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. పుట్టిన ఊరు అందమైన జీవితాన్ని గుర్తుకుతెస్తుంది. ఈ రెండింటినీ అందమైన కథా చిత్రంగా మార్చి ఎంబ్రాయిడరీలో ఒదిగిపోయేలా చేశారు గోవాకు చెందిన డాక్టర్‌ సవియా విగాస్‌. అదెలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అమ్మ, అమ్మమ్మల జ్ఞాపకంగా చీరలు, నగలు, గిన్నెలు...ఇలా వారు వాడిన వస్తువులు చాలానే దాచుకుంటాం. సవియా కూడా అంతే!  వాళ్లమ్మ ఎంతో ఇష్టంగా తయారు చేసిన బొంతల్ని... తరవాత ఆమె అందమైన కాన్వాస్‌గా మార్చేశారు. డాక్టర్‌ సవియా విగాస్‌ది గోవాలోని కార్మోనా అనే కుగ్రామం. ఆర్ట్‌ హిస్టరీలో పీహెచ్‌డీ చేశారామె. ఆపై ముంబయి విశ్వవిద్యాలయంలో పాఠాలూ బోధించారు. రచయిత్రిగానూ, మ్యూజియం క్యూరేటర్‌గానూ వ్యవహరిస్తున్నారు. చదువుకోసం కొన్నాళ్లు ఊరికి దూరంగా ఉన్న సవియా సీనియర్‌ ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ పూర్తయ్యాక కర్మోనాకు తిరిగొచ్చేశారు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలూ వాడని డెనిమ్‌ ప్యాంట్లలో కొన్నింటిని పక్కన పాడేశారట. వాళ్లమ్మ బెర్తా ఎలిజా విగాస్‌... వాటిని పారేయకుండా ఎంబ్రాయిడరీ హంగులను చేర్చి అందమైన క్విల్ట్‌ తయారు చేశారట. 2005లో తల్లి మరణించాక... బీరువాలు సర్దుతుంటే ఆ బొంత సవియా కళ్లబడింది. దాన్ని చూస్తే అమ్మ ప్రేమతో పాటు ఎన్నో స్మృతులు ఆమెను తట్టిలేపాయి.

పోర్చుగీసువారి నుంచి అందిపుచ్చుకున్న క్రోషెట్‌ ఎంబ్రాయిడరీని అమ్మ ఎంతగా ఇష్టపడేదో కూడా గుర్తొచ్చింది. దాంతో ఎలాగైనా క్విల్ట్‌కి కొత్తరూపు తేవాలనుకున్నారామె. ఇందుకోసం తన గతాన్నీ, కుటుంబాన్నీ, దక్షిణ గోవాలో ఉన్న అందమైన ఊరు కార్మోనా గురించి కథ రాయాలనుకున్నారు. వాటిని చిత్రాలుగా మలిచి, ఎంబ్రాయిడరీ చేయడం ఆరంభించారు. ‘చిన్ననాటి సంఘటనలు, అమ్మ చెప్పిన కథల్ని... క్విల్ట్‌పై చిత్రించి ఆమెకు నివాళి ఇవ్వాలనుకున్నా’ అంటారు సవియా. అప్‌సైక్లింగ్‌ చేసిన డెనిమ్‌పై పూలు, పాత్రలు, ప్రదేశాలను అందంగా ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌లతో తీర్చిదిద్దారు. కొన్నింటిని మోంటేజ్డ్‌ ఫొటోగ్రాఫ్‌లుగా, కొలాజ్‌లుగా మార్చి డిజిటలైజేషన్‌ చేశారు. వాటన్నింటినీ గోవా మ్యూజియంలో ప్రదర్శనకూ ఉంచారు. వాటిని చూసినవాళ్లంతా అమ్మ జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడం కొసమెరుపు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్