ఇంటర్‌తో ఆపి... పీహెచ్‌డీ చేసి..!

‘చదివించేవాళ్లు లేరు’, ‘డబ్బుల్లేవు’... చదువుకోకపోవడానికి ఇలా ఎన్నో కారణాలు చెబుతుంటాం!  వాటిని కారణాలుగా చూపించాలనుకోలేదామె. పరిష్కారం కోసం వెతికారు. మధ్యలో ఆపేసిన చదువుని పీహెచ్‌డీ వరకూ తీసుకొచ్చారు.

Published : 06 Jun 2024 13:57 IST

‘చదివించేవాళ్లు లేరు’, ‘డబ్బుల్లేవు’... చదువుకోకపోవడానికి ఇలా ఎన్నో కారణాలు చెబుతుంటాం!  వాటిని కారణాలుగా చూపించాలనుకోలేదామె. పరిష్కారం కోసం వెతికారు. మధ్యలో ఆపేసిన చదువుని పీహెచ్‌డీ వరకూ తీసుకొచ్చారు. తోటివారికి సాయం చేస్తూ ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నారు కొల్లిపర వెంకటలక్ష్మి...  

మాది గుంటూరు జిల్లాలోని పొన్నూరు. నలుగురు పిల్లలం. ఒక అక్క.. నా తరవాత ఇద్దరు తమ్ముళ్లు. నాన్న టైలర్‌. అంతంత మాత్రపు ఆదాయం. దాంతో అక్కకి ఇంటర్‌ పూర్తవ్వకుండానే పెళ్లిచేశారు. నాన్న నన్ను చదివించలేనంటే ఇంటర్‌తోనే ఆపేశాను. ఇంట్లోనే ఉండి నాన్నకి కుట్టుపనిలో సాయం చేసేదాన్ని. ఆ తరవాత పెళ్లి. మావారిది చిన్న వ్యాపారం. నన్ను చదివిస్తానంటేనే పెళ్లికి ఒప్పుకొంటానని ఆయన దగ్గర మాట తీసుకున్నా. ఆయనా సరే అన్నారు. అలా ఆపేసిన చదువుని ఏడేళ్ల తరవాత తిరిగి మొదలుపెట్టా. డిగ్రీలో బీఏ లిటరేచర్‌ స్పెషల్‌ ఇంగ్లిష్‌ చదివాను. టౌన్‌ ఫస్ట్‌ వచ్చా. మా అత్తమామలు సహకరించడంతో చదువయ్యేంతవరకూ పిల్లలు కూడా వద్దనుకుని రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లేదాన్ని. డిగ్రీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో... ఎంట్రన్స్‌ రాసి పద్మావతి కాలేజీలో ఎంఏ ఇంగ్లిష్‌ చేశాను. ఇంటికి దూరంగా, ఇంగ్లిష్‌ చదువు మొదట్లో కష్టమైనా కుటుంబ ప్రోత్సాహంతో కొనసాగించా. పీజీ అయిపోగానే ఐటీ ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో... బెంగళూరులో టెక్‌ రైటర్‌ కోర్సు చేశాను. ఎనిమిదేళ్ల తరవాత మా బాబు కడుపునపడ్డాడు. బెడ్‌రెస్ట్‌ తప్పనిసరి అన్నారు వైద్యులు. దాంతో ఐటీలో ఉద్యోగావకాశాలు వచ్చినా వద్దనుకున్నా. ఖాళీగా ఉండటం ఇష్టం లేక పద్మావతీలోనే ఎంఫిల్‌ మొదలుపెట్టా. అప్పటికి బాబు నెలల పిల్లాడు. దాంతో అమ్మ సాయం తీసుకుని, పిల్లాడినీ, అమ్మనీ బయట కూర్చోబెట్టి పరీక్షలు రాసేదాన్ని. ఇష్టమైన చదువు కాబట్టి, కష్టంగా అనిపించినా మొండిగా చదివా. ఆపై చేబ్రోలులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అదే సంస్థలో ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తూనే... చదువుని ఆపేయకూడదని ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ అనే అంశంపై పీహెచ్‌డీ కూడా చేశా. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్‌లోనూ నా వ్యాసాలు వెలువడ్డాయి. నాలానే చాలామంది చదువుకోవడం కోసం కష్టపడతారనిపించి, అటువంటి వారికోసం నావంతు సాయం చేస్తున్నా. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్‌లో టాపర్‌గా నిలిచిన వారికి ఏటా ఉపకారవేతనం అందిస్తుంటా. అలాగే సామర్థ్యం ఉండీ ఫీజు కట్టలేక ఇంజినీరింగ్‌ చేయడానికి వెనకాడేవారికోసం ఆర్థిక సాయం చేసి నలుగురిని చదివిస్తున్నా. భవిష్యత్తులో ఇంకా సేవ చేయాలన్నదే నా లక్ష్యం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్