Updated : 16/12/2022 20:31 IST

జామాకుతో ఆ చర్మ సమస్యలు దూరం!

జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే జామకాయలే కాదు.. జామాకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో కొన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టచ్చు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి...

జిడ్డు చర్మతత్వమా?

చర్మతత్త్వం జిడ్డుగా ఉన్నవారు ఈ సమస్యను దూరం చేసుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. దీనికోసం పెరట్లో ఉండే జామచెట్టు చక్కటి పరిష్కారం చూపుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. దీనికోసం గుప్పెడు జామాకులను తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో రెండు టేబుల్‌ స్పూన్ల పేస్ట్‌ని తీసుకొని అంతేమొత్తంలో నిమ్మరసాన్ని కలపాలి. కలపగా వచ్చిన మిశ్రమాన్ని శరీరంపై అప్లై చేసుకోవాలి. ఇలా 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కొన్ని రోజుల్లో మీరు ఆశించిన ఫలితాన్ని గమనిస్తారు.

మొటిమల నివారణకు..

ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి జామాకు చక్కటి పరిష్కారం చూపుతుంది. జామాకులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికంగా ఉంటాయి. అవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నశింపజేస్తాయి. దీనికోసం జామాకులతో చేసిన పేస్ట్‌ని మొటిమల దగ్గర అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

బ్లాక్‌హెడ్స్ పోవాలంటే...

అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరో సమస్య బ్లాక్‌హెడ్స్‌. ముఖంపై అక్కడక్కడ ఉండే నల్ల మచ్చలనే బ్లాక్‌హెడ్స్‌ అంటారు. వీటికి జామాకు, కలబందతో చెక్‌ పెట్టవచ్చు. దీనికోసం ఒక టేబుల్‌ స్పూన్‌ జామాకు పేస్ట్‌ని తీసుకోవాలి. దానికి అంతేమొత్తంలో కలబంద గుజ్జు, చిటికెడు పసుపుని కలపాలి. ఇలా కలపగా వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఆ సమస్యనూ తగ్గిస్తుంది..

చలికాలంలో చాలామంది దురద సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారికి కూడా జామాకు మంచి పరిష్కార మార్గం చూపుతుంది. దీనికోసం గుప్పెడు జామాకులకు కప్పు నీళ్లను జత చేసి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. అందులోని ఆకులను తీసేసి ఆ నీళ్లను ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దురదగా అనిపించిన ప్రాంతంలో అప్లై చేసుకుంటే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని