మెరిసే జుట్టు కోసం.. షాంపూలో..!

ప్రస్తుతం ఎవరిని చూసినా కేశాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారే.. కొంతమందికి చుండ్రు సమస్య అయితే మరికొందరికి బిరుసుగా ఉండే వెంట్రుకల సమస్య.. ఇక వీటన్నింటి కంటే ఎక్కువగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకోవడానికి ఎన్నో రకాల రసాయన....

Published : 31 Dec 2022 18:52 IST

ప్రస్తుతం ఎవరిని చూసినా కేశాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారే.. కొంతమందికి చుండ్రు సమస్య అయితే మరికొందరికి బిరుసుగా ఉండే వెంట్రుకల సమస్య.. ఇక వీటన్నింటి కంటే ఎక్కువగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకోవడానికి ఎన్నో రకాల రసాయన సంబంధిత, సహజసిద్ధమైన పద్ధతులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించని వారు ఎందరో..! ఇలాంటి వారంతా తాము ఉపయోగించే షాంపూలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకుంటే చాలు.. జుట్టు సమస్యలు తగ్గడమే కాదు.. అందమైన కేశాలూ మీ సొంతమవుతాయి. కేశ సంరక్షణలో ముఖ్యమైన భాగం తలస్నానం చేయడం.. ఈ సమయంలోనే వీటిని చేర్చుకోవడం వల్ల జుట్టు వాటిని పీల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా కురులు దృఢంగా మారడమే కాదు.. అందంగా మెరిసిపోతాయి కూడా..! మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

రోజ్ వాటర్

జుట్టుకు మృదుత్వాన్ని అందించడంతో పాటు మనసుకు ప్రశాంతతను కూడా చేకూరుస్తుంది రోజ్ వాటర్. ఇందులోని సహజసిద్ధమైన గుణాలు కురులకు తేమను అందించి చిక్కులు పడకుండా కాపాడతాయి. తద్వారా జుట్టు తెగిపోవడం, రాలిపోవడం కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనికోసం రెండు టీస్పూన్ల రోజ్‌వాటర్‌ను మనం తలకు పెట్టుకోవడానికి ఉపయోగించే షాంపూలో కలిపి ఓ మిశ్రమంగా చేయాలి. దీన్ని తలకు పట్టించుకొని తలస్నానం చేయాలి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు.. పరిమళభరితంగానూ మారుస్తుంది. తద్వారా మీ మూడ్‌ని కూడా మెరుగుపరుస్తుంది.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె మన ఆరోగ్యానికి, చర్మానికి ఎంత మంచిదో తెలిసిందే.. అయితే దానివల్ల జుట్టు కూడా బలంగా తయారవుతుందని మీకు తెలుసా? ఆలివ్ నూనె జుట్టు కుదుళ్లలోకి వెళ్లి వాటికి పోషణను అందిస్తుంది. అంతేకాదు.. చివర్లు చిట్లడం, వెంట్రుకలు పొడిబారిపోవడం వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. పొడి జుట్టు ఉన్నవారు ఈ చిట్కాను ఎక్కువగా పాటించడం వల్ల జుట్టు తెగి రాలిపోవడాన్ని నియంత్రించవచ్చు. దీనికోసం తలస్నానం చేయడానికి కొంత షాంపూని తీసుకొని అందులో ఐదారు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆపై దీన్ని మామూలు షాంపూలాగే ఉపయోగించాలి. ఇలా కొన్ని వారాలు చేస్తే జుట్టులో మార్పును ఇట్టే గమనించవచ్చు.

ఉసిరి రసం

ఉసిరి రసాన్ని తాగడం వల్ల శరీరంలో విటమిన్ 'సి' లోపం తగ్గుతుంది. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కాపాడడంలో కూడా ముందుంటుంది. జుట్టు తెగిపోయి రాలిపోవడం.. ఒకే ప్రదేశంలో ఎక్కువగా జుట్టు రాలడం.. వంటి సమస్యలను కూడా ఉసిరి తగ్గిస్తుంది. అంతేకాదు.. జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేసి బలంగా మారుస్తుంది. దీనికోసం ఉసిరికాయ నుంచి రసాన్ని తీసి.. అందులో టీస్పూన్ రసాన్ని షాంపూతో పాటు కలిపి తలకు పట్టించాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే కొద్దిరోజుల్లోనే జుట్టు నల్లగా మారడం, బలంగా తయారవడం గమనించవచ్చు.

తేనె

తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడమే కాకుండా జుట్టుకు పోషణను అందిస్తాయి. అవి పొడిబారి తెగిపోకుండా కాపాడతాయి. కేశాలు రాలడాన్ని కూడా అరికడతాయి. తలస్నానం చేసేటప్పుడు తేనె, షాంపూ రెండు సమపాళ్లలో తీసుకొని ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల అది జుట్టు కుదుళ్లకు చేరుతుంది. లోపలికి ఇంకి వెంట్రుకలకు పోషణనందించి రాలకుండా కాపాడుతుంది.

కలబంద గుజ్జు

ప్రకృతి మనందరికీ ఇచ్చిన వరం కలబంద. ఈ గుజ్జును అందానికి, ఆరోగ్యానికి ఉపయోగించవచ్చు. శరీరంలోని మలినాలను తొలగించడానికి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడానికి కలబంద చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని షాంపూ చేసినప్పుడు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టులో సహజసిద్ధమైన తేమ నిలిచి ఉండడమే కాకుండా తగిన పోషణ కూడా అందుతుంది. ఇది చుండ్రును కూడా అదుపులో ఉంచుతుంది. దీనికోసం అప్పుడే కట్ చేసిన ఆకు నుంచి టీస్పూన్ కలబంద గుజ్జును తీసుకొని దాన్ని షాంపూలో కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని తలకు పెట్టుకొని తలస్నానం చేయడం వల్ల కేశాలకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

ఇవే కాదు.. నిమ్మరసం, వెనిగర్, చక్కెర, గ్లిజరిన్, ఎసెన్షియల్ నూనెలు కూడా షాంపూలో కలిపి జుట్టుకు పట్టించవచ్చు. దీనివల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్