రోటి పచ్చళ్లతో ఆరోగ్యం!

పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ, వివిధ రకాల కాయగూరలు-ఆకుకూరలతో చేసుకునే చట్నీలు.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. బయట హోటల్లో భోంచేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపుటలవాట్లలో చట్నీకి ఉండే ప్రత్యేకత అలాంటిది!

Published : 14 Feb 2024 19:02 IST

పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ, వివిధ రకాల కాయగూరలు-ఆకుకూరలతో చేసుకునే చట్నీలు.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. బయట హోటల్లో భోంచేసినప్పుడు కూడా ఏదో ఒక చట్నీ వడ్డించడం మనం చూస్తూనే ఉంటాం. మన ఆహారపుటలవాట్లలో చట్నీకి ఉండే ప్రత్యేకత అలాంటిది! మరి, అలాంటి చట్నీని తయారుచేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం..? మిక్సీ లేదంటే వెట్‌ గ్రైండర్‌ కదూ! సులభంగా, త్వరగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టే అందరూ వీటి పైనే ఆధారపడుతుంటారు. కానీ అదే సమయంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అందించే రుచిని ఇది అందించలేదని కూడా అంటుంటారు మన పెద్దవాళ్లు. మరి, మిక్సీలో రుబ్బుకున్న పచ్చడి కంటే రోట్లో చేసుకున్న పచ్చడికి ఎందుకంత రుచి వస్తుంది? దానివల్ల మన ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

ఇడ్లీ, దోసె, వడ.. వంటి టిఫిన్స్‌లోకే కాదు.. భోజనంలోకీ వివిధ రకాల పచ్చళ్లను తినడం మనలో చాలామందికి అలవాటు! అయితే మిక్సీ, వెట్‌ గ్రైండర్‌ వంటి గ్యాడ్జెట్స్‌ వచ్చాక మనకు ఆ పని మరింత తేలికైంది. కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో రుబ్బుకున్న పచ్చళ్లలో కంటే రోట్లో నూరుకున్న పచ్చడిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు.

వారానికి మూడుసార్లు!
మన భారతీయ పాకశాస్త్రంలో పచ్చళ్లది ప్రత్యేక స్థానం. మసాలాలు, ఫైబర్‌, ఫైటోన్యూట్రియంట్స్‌.. వంటి పోషకాలన్నీ వీటి ద్వారా మన శరీరానికి అందుతాయి. అందుకే వారానికి కనీసం మూడుసార్లు ఏదో ఒక పచ్చడిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. మీకు మరో విషయం తెలుసా? పచ్చళ్లను భోజనంలో.. అది కూడా లంచ్‌లో భాగంగా తీసుకోవడం వల్ల మధ్యాహ్నం భోంచేశాక వచ్చే ఒక రకమైన నిద్ర మత్తు, అలసటకు దూరంగా ఉండచ్చు. ఇక చట్నీ చేసే క్రమంలో వీటిలో వాడే పదార్థాలన్నీ రాయి లేదంటే పచ్చడి బండతో ముక్కలు ముక్కలు చేయడం వల్ల వాటిలోని సూక్ష్మ పోషకాలు, స్టెరోల్స్‌, ఫ్లేవనాయిడ్స్.. మొదలైనవన్నీ బయటికి విడుదలవుతాయి. ఆ చట్నీని తినడం వల్ల అవన్నీ మన శరీరానికి బాగా పడతాయంటున్నారు పోషకాహార నిపుణులు.

మిక్సీ/గ్రైండర్‌లో ఎందుకు వద్దు?!
చాలామంది చట్నీ అనగానే మిక్సీ/వెట్‌ గ్రైండర్‌లో చేసేస్తుంటారు. త్వరగా పని పూర్తవడంతో పాటు ఎలాంటి అసౌకర్యం లేకుండా సులభంగా చట్నీ చేసేయచ్చని వారు భావిస్తారు. నిజానికి ఇలా మిక్సీలో చట్నీ చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ నశించిపోతాయి. అదెలాగంటే.. మనం పచ్చడి కోసం వాడే పదార్థాల్లో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు వేడికి తట్టుకోలేవు. కాబట్టి మిక్సీ/గ్రైండర్‌లో పచ్చడి చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వేడి వల్ల ఇవన్నీ నశించిపోతాయి. అదే రోట్లో రుబ్బుకునే పచ్చళ్ల కోసం రాయి లేదంటే చిన్న చెక్క రోకలిని ఉపయోగిస్తుంటాం. అవి రెండూ ఉష్ణ నిరోధకాలే కాబట్టి పచ్చడి చేసే క్రమంలో వేడి పుట్టకుండా అందులోని పోషకాలన్నీ అలాగే నిక్షిప్తమై ఉంటాయి. ఇలా రోట్లో చేసే పచ్చడి వల్ల ఆయా పదార్థాల్లోని సుగుణాలన్నీ మన శరీరానికి అందుతాయి.. అలాగే చక్కటి రుచినీ ఆస్వాదించవచ్చు.


రోటి పచ్చళ్ల వల్ల ప్రయోజనాలెన్నో!

 ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. తద్వారా శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను మరింత సమర్థంగా ఉపయోగించుకుంటాయి.
 థైరాయిడ్‌ సమస్యతో బాధపడే వారు విపరీతమైన అలసటకు గురవుతుంటారు. అలాంటి వారు రోజూ తప్పనిసరిగా చట్నీ తీసుకోవడం మంచిది. తద్వారా ఆ అలసటను దూరం చేసుకోవచ్చు.
 అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి రోటి పచ్చళ్లు మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇవి పొట్టలో ఉండే బ్యాక్టీరియా సామర్థ్యాన్ని మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
 ‘డి’, ‘బి12’.. వంటి విటమిన్ల లోపం ఉన్న వారు రోజూ తీసుకునే ఆహారంలో చట్నీని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.

 ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్న వారు, సంతాన సమస్యలతో బాధపడే వారు కూడా రోటి పచ్చళ్లను రోజూ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
 గుండె ఆరోగ్యానికి కూడా రోటి పచ్చళ్లు చక్కగా ఉపయోగపడతాయి.
 కొలెస్ట్రాల్‌తో బాధపడే వారు కూడా రోటి పచ్చళ్లు నిరభ్యంతరంగా తినచ్చు. మనం సాధారణంగా చట్నీ కోసం ఉపయోగించే కొబ్బరి, పల్లీ, నువ్వులు, అల్లం, వెల్లుల్లి, ఆకుకూరలు, కాయగూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందులో మంచి కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి.
అయితే వీటిలో ఉప్పు కారాలు తగ్గించి వేస్తూ మితంగానే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్