వేపతో అందంగా, ఆరోగ్యంగా..!

మొటిమలు, మచ్చలు.. ఎప్పుడో అప్పుడు ఈ సమస్యలు తప్పవు. అయితే వీటిని తగ్గించడంలో వేప ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందులోని యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కేశ సంరక్షణలోనూ.....

Published : 20 Nov 2022 14:17 IST

మొటిమలు, మచ్చలు.. ఎప్పుడో అప్పుడు ఈ సమస్యలు తప్పవు. అయితే వీటిని తగ్గించడంలో వేప ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందులోని యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కేశ సంరక్షణలోనూ ఉపయోగపడతాయి.

స్కిన్ టోనర్

గుప్పెడు వేపాకులను తీసుకొని రెండు లీటర్ల నీటిలో మరిగించండి. ఆ నీళ్లు ఆకుపచ్చగా మారే వరకు వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కొంచెం ఈ మిశ్రమాన్ని కలపడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.. దీన్ని స్కిన్ టోనర్‌గానూ వాడచ్చు.. వేప నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి ప్రతి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి. దీని వల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి.

వేప ప్యాక్..

ఓ పది వేపాకులు, దానికి కొన్ని నారింజ తొక్కలను కలిపి కొద్దిపాటి నీటిలో గుజ్జులా మారే వరకు మరిగించండి. దాన్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు వంటివి కలపండి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.. ఫలితంగా మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

హెయిర్ కండిషనర్

కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. దీన్లో తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయండి. ఇది జుట్టుకు కండిషనర్‌గా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా మెత్తగా మారుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది.

బెరడుతోనూ..

వేప బెరడు, వేర్లను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తలకు పట్టించడం వల్ల పేల బాధ తొలగిపోతుంది. దీని వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.

వేప నూనె..

వేప నూనెను కొన్ని రకాల సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసే గుణం ఉంటుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది.

పొడి చర్మానికి..

చర్మం పొడిబారిపోతోందా? వేప ప్యాక్‌ని ప్రయత్నించండి. వెంటనే ఫలితం కనిపిస్తుంది. వేప పొడిలో కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్‌ని కలపండి. దీన్ని మిశ్రమంలా చేసి ముఖానికి పట్టించండి. రెండు, మూడు నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

పొడవాటి జుట్టుకు..

వేపాకుల పొడిని తరచూ ఉపయోగిస్తూ ఉంటే కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లన్నీ దూరమవుతాయి. వేప నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. దీంతో పాటు జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్