ఈ అలవాట్లు మార్చుకుంటే.. కాలేయం పదిలం!

కాలేయం.. మన శరీరంలోని అతిముఖ్యమైన అవయవాల్లో ఒకటి. రక్తం శుద్ధి చేయడం దగ్గర్నుంచి జీర్ణక్రియ సాఫీగా సాగడం వరకు.. ఇలా వివిధ జీవ క్రియల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Published : 19 Apr 2024 20:58 IST

కాలేయం.. మన శరీరంలోని అతిముఖ్యమైన అవయవాల్లో ఒకటి. రక్తం శుద్ధి చేయడం దగ్గర్నుంచి జీర్ణక్రియ సాఫీగా సాగడం వరకు.. ఇలా వివిధ జీవ క్రియల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ అలవాట్లు చిన్నవే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాలేయం పనితీరుపై ప్రభావం చూపిస్తాయని, తద్వారా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ‘ప్రపంచ కాలేయ దినోత్సవం’ సందర్భంగా కాలేయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ అలవాట్లేంటో తెలుసుకొని జాగ్రత్తపడదాం!

నిద్రలేమి..

ఆరోగ్యానికి సుఖ నిద్ర ఎంతో ముఖ్యం. అయితే ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది సుఖనిద్రకు దూరమవుతున్నారు. ఫలితంగా కాలేయంపై ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా దాని పనితీరూ దెబ్బతింటుంది. అందుకే రోజూ రాత్రిళ్లు ప్రశాంతంగా ఏడెనిమిది గంటలు నిద్రకు సమయం కేటాయించడం మంచిదంటున్నారు.

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?

మన శరీరంలోని మలినాలు, విషపదార్థాల్ని బయటకు పంపించడంలో కాలేయం పాత్ర కీలకం! ఈ క్రమంలోనే కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి! అయితే కొంతమంది సమయం లేదనో.. ఇతర కారణాల వల్లో బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తుంటారు. కానీ ఇది సరికాదు. పోషకాలతో నిండిన ఓట్స్‌, పండ్లు, ఇడ్లీ, దోసె.. తదితర పదార్థాల్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.

ప్రతి చిన్నదానికీ మాత్రలా?

తలనొప్పి వచ్చినా సరే.. జలుబు చేసినా ట్యాబ్లెట్ వేసుకోవడం కొంతమందికి అలవాటు. కానీ ఇలా ప్రతి చిన్న సమస్యకీ వేసుకునే మందులు కూడా కాలేయం పనితీరుని ప్రభావితం చేస్తాయట! కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు సూచించిన మందులు తగిన మోతాదులో వేసుకోవడమే ఉత్తమం.

ఈ విటమిన్లు అందుతున్నాయా?

బి- కాంప్లెక్స్ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే అవి తగినంత మోతాదులో శరీరానికి అందుతున్నాయో? లేదో? సరిచూసుకొని అవసరమైతే ఆ పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ క్రమంలో గుడ్లు, చేపలు, చీజ్, రొయ్యలు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి బి-విటమిన్స్ చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వీళ్లు అవసరమైతే ఆహారంతో పాటు నిపుణుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు.

ప్రొటీన్లు ఎక్కువైతే..

మనం తీసుకునే ఆహారపదార్థాల్లో ప్రొటీన్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే ప్రొటీన్లు మితంగానే తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ కూడా మోతాదుకు మించకుండా తీసుకోవడం ముఖ్యం.

ఇవి గుర్తుంచుకోండి..

⚛ మూత్రం వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఆపుకోకుండా వీలైనంత త్వరగా మూత్రవిసర్జన చేయాలి. ఫలితంగా శరీరంలోని మలినాలు త్వరగా బయటకు వెళ్లిపోయి కాలేయ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ అతిగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం.. వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే దీనివల్ల కూడా కాలేయం పనితీరు దెబ్బతింటుందట! కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తపడడం మంచిది.

⚛ మనం తీసుకునే ఆహారపదార్థాల్లో చక్కెర అధిక మోతాదులో ఉన్నా కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి చక్కెర ఉన్న ఆహార పదార్థాల్ని మితంగా తీసుకోవడం మేలు!

⚛ శరీరానికి సరిపడినంత వ్యాయామం అందకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం.. వంటి కారణాలు కూడా కాలేయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే! కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్