బరువునీ అదుపులో ఉంచే సొరకాయ!

తేలిగ్గా అరగడమే కాకుండా, వివిధ పోషకాలను అందిస్తూ... శరీర తాపాన్ని తగ్గించడంలో సొరకాయని మించింది లేదంటారు పోషకాహార నిపుణులు. మరి ఆ ప్రయోజనాలేంటో...

Published : 25 Sep 2022 13:17 IST

తేలిగ్గా అరగడమే కాకుండా, వివిధ పోషకాలను అందిస్తూ... శరీర తాపాన్ని తగ్గించడంలో సొరకాయని మించింది లేదంటారు పోషకాహార నిపుణులు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా?

❀ సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువ. వంద గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి 15 క్యాలరీలే. నీరు మాత్రం ౯౬ శాతం ఉంటుంది. వీటిల్లో జీర్ణశక్తికి సహకరించే పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఇది అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది.

❀ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతే, నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే... సొరకాయని తరచూ తింటే మేలు. ఇది అతి దాహం తగ్గిస్తుంది.

❀ శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

❀ ఇనుముతో పాటు ఆనపకాయలో ఉండే విటమిన్ బి, సిలు వ్యాధి నిరోధక శక్తిని పెంచితే దీనిలోని పొటాషియం బీపీ పెరగకుండా కాపాడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మేలు. కొద్ది మొత్తంలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.


నోరూరించే సొరకాయ రైతా!

సొరకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూశారుగా..ఈ క్రమంలో - శరీరానికి చలువ చేసే రైతా తయారీ చూద్దాం రండి..

కావాల్సినవి

❀ సొరకాయ తురుము - కప్పు

❀ ఉప్పు - చిటికెడు

❀ పెరుగు - కప్పు

❀ నీళ్లు - కప్పు

❀ కారం - పావు టీస్పూన్

❀ జీలకర్ర పొడి - అర టీస్పూన్

❀ గరం మసాలా - చిటికెడు

❀ నల్ల ఉప్పు - తగినంత

తయారీ

సొరకాయ తురుమును ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి, చేతులతో నీటిని పిండేయాలి. ఇప్పుడు కప్పు పెరుగు తీసుకొని కాస్త గిలక్కొట్టాలి. ఆ తర్వాత దానికి సొరకాయ తురుము, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నల్ల ఉప్పు కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత సర్వ్ చేస్తే సరి.. కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు. దీన్ని గరం మసాలాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్