బరువును అదుపులో ఉంచే జొన్నలు!

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని తగ్గించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తే, మరికొందరు ఆహారపుటలవాట్లు మార్చుకుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గాలని తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకొని బరువు తగ్గించుకునే బదులు కొన్ని రకాల చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం మేలంటున్నారు పోషకాహార నిపుణులు....

Published : 24 Feb 2024 12:35 IST

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని తగ్గించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తే, మరికొందరు ఆహారపుటలవాట్లు మార్చుకుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గాలని తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకొని బరువు తగ్గించుకునే బదులు కొన్ని రకాల చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం మేలంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రత్యేకించి జొన్నలతో చేసిన వంటకాలను తరచుగా తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.

 జొన్నల్లో గ్లూటెన్‌ ఉండదు. కాబట్టి ఇది మంచి ఆహారం.
 ఫైబర్‌ పుష్కలంగా ఉండే జొన్నలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
 రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో ఇవి తోడ్పడతాయి.
 

 ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే జొన్నల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చూసుకోవచ్చు. బరువు అదుపు చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే!
 ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, విటమిన్‌ బి-3 లాంటి పోషకాలు పుష్కలంగా ఉండే జొన్నలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
 జొన్నల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
 రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచడంలో జొన్నలు సహకరిస్తాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
 శరీరంలో శక్తి స్థాయుల్ని పెంచడానికి, రక్తప్రసరణను మెరుగుపరచడానికి జొన్నలు తోడ్పడతాయి.


జొన్న రొట్టెలు ఇలా!

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలతో వివిధ రకాల వంటకాలు తయారుచేస్తుంటాం. అయితే అన్నింటికంటే సులభంగా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. ఇందుకోసం..
కావాల్సినవి
 జొన్న పిండి- రెండు కప్పులు
 వేడి నీళ్లు- సరిపడా
తయారీ
ఒక గిన్నెలోకి జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులోకి కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి. ఆపై పిండిని మరోసారి కలుపుకొని రొట్టెల్లా ఒత్తుకోవాలి.. లేదంటే చపాతీ కర్రతోనైనా చేసుకోవచ్చు. ఆపై మీడియం సైజు మంట మీద ఇనుప పెనంపై వేసి, నీళ్లు అద్దుతూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా సిద్ధమైన జొన్న రొట్టెల్ని ఏ కూరతో, చట్నీతో తిన్నా అమృతంలా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్