Published : 30/11/2022 21:27 IST

బరువు తగ్గించే తామర గింజలు!

తామర గింజలనే ‘మఖానా’ అంటారు. వీటిని ఫాక్స్ నట్స్‌ అని కూడా పిలుస్తారు. గ్లూటెన్‌ ఫ్రీతో పాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతారు. వీటిని కొందరు పచ్చిగానే ఉపయోగిస్తే... మరికొందరు వేయించుకుని, ఉడకబెట్టుకుని కూరల్లో, స్వీట్లలో వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటితో మిఠాయిలు చేసి దేవునికి నైవేద్యం పెడతారు.

బరువు తగ్గించుకునేందుకు..

అధిక క్యాలరీలున్న జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం వల్లనే ప్రపంచంలో 70 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ క్యాలరీలున్న మఖానాను డైట్‌లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. వీటిలోని ప్రొటీన్‌ బరువు తగ్గించడంలో సహాయపడితే...ఫైబర్‌ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో పాటు మఖానాతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

ప్రయోజనాలెన్నో!

⚜ మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్‌తో పాటు క్యాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి.

⚜ ఇందులోని మెగ్నీషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

⚜ తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలను నిరోధిస్తాయి.

⚜ గ్లైసెమిక్‌ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహ బాధితులకు ఇది మంచి ఆహారం.

⚜ కీళ్ల సమస్యలతో పాటు దంత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి.

⚜ వీటిలోని క్యాల్షియం, ఐరన్ గర్భిణులకు ఎంతో సహకరిస్తాయి. వారిలో రక్తహీనత సమస్య రాకుండా చేస్తాయి.

⚜ మఖానాలో సోడియం తక్కువ, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. బీపీ ఉన్నవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

⚜ మఖానాలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

⚜ కేవలం ఆరోగ్యాన్నే కాదు...మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి.

ఎలా తీసుకోవాలి?

తామర గింజలను పచ్చిగానే ఉపయోగించవచ్చు. అదేవిధంగా వేయించి లేదా ఉడకబెట్టి సూప్స్‌, సలాడ్లు, వివిధ కూరల్లో వినియోగించుకోవచ్చు. చాలామంది వీటిని కాల్చుకుని స్నాక్స్‌గా తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. అయితే వీటిని వేయించే బదులు పచ్చిగా లేదా ఉడకబెట్టి తీసుకోవడం ద్వారా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే అలర్జీలు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండడం మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని