ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!

కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తాం. ఆ తర్వాత వీటిని ప్రసాదంగా పంచిపెడతాం. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

Published : 17 Apr 2024 14:57 IST

కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తాం. ఆ తర్వాత వీటిని ప్రసాదంగా పంచిపెడతాం. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

బెల్లం పానకం..

కావాల్సిన పదార్థాలు

⚛ బెల్లం - ఒక కప్పు

⚛ నీరు - నాలుగు కప్పులు

⚛ మిరియాల పొడి - చెంచా

⚛ యాలకుల పొడి - అర చెంచా

⚛ అల్లం పొడి - పావు చెంచా

తయారీ విధానం

ముందుగా నీటిలో బెల్లాన్ని వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం పొడి.. మొదలైన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అంతే.. రుచికరమైన తియ్యతియ్యటి బెల్లం పానకం రడీ..!

ఆరోగ్యానికి మేలు!

నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకపోయినా, అవి వండడానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలంటారు పెద్దలు. బెల్లంతో చేసిన వంటకాలతో దేవతలు సైతం తృప్తి చెందుతారట. అంతటి విశిష్ట స్థానం ఉంది మరి దీనికి. అందుకే దాదాపు ప్రతి పండక్కీ తయారు చేసే నైవేద్యంలో బెల్లాన్ని ఉపయోగిస్తాం. దీనివల్ల కేవలం నోటికి రుచే కాకుండా.. అనేక రకాల పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

⚛ బెల్లంలో ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, శరీర ఎదుగుదలకు కావలసిన ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

⚛ శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి.. వెంటనే అలసట మాయమవుతుంది.

⚛ బెల్లంలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.

⚛ ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ వల్ల కణజాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడతాయి.

⚛ బెల్లం సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేసి శ్వాసకోస గ్రంథులు, ఊపిరితిత్తులు, పొట్ట.. వంటి శరీర భాగాలను శుభ్రపరుస్తుంది.


వడపప్పు

కావాల్సిన పదార్థాలు

⚛ పెసరపప్పు - ఒక కప్పు

⚛ తురిమిన కొబ్బరి - మూడు చెంచాలు

⚛ చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిమిర్చి - కొన్ని

⚛ నిమ్మరసం - చెంచా

⚛ ఉప్పు - రుచికి తగినంత

⚛ కొత్తిమీర – గార్నిష్‌ కోసం

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును అరగంట పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులో పైన చెప్పిన ఇతర పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. వడపప్పు రడీ!

ప్రయోజనాలు

⚛ పెసరపప్పులో శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే విటమిన్ ఎ, బి, సి, ఇ; క్యాల్షియం, పొటాషియం, ఐరన్.. వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

⚛ బరువు తగ్గాలనుకునే వారికి పెసరపప్పు మంచి ఆహారం. ఇందుకు కారణం దీనిలో తక్కువ మోతాదులో ఉండే కొవ్వు పదార్థాలే. అలాగే పెసరపప్పులో అధికంగా ఉండే ప్రొటీన్, ఫైబర్.. వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.

⚛ ఈ పప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.

⚛ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి పెసరపప్పు బాగా తోడ్పడుతుంది.

అలాగే బియ్యప్పిండి, బెల్లం కలిపి చలిమిడిని తయారు చేస్తారు. ఇవన్నీ వేడిని తగ్గించేవే.. అందుకే వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్