Summer Tips : చెమట పడితేనే మంచిదట!

వేసవిలో వేడికి తట్టుకోలేక శరీరం చెమటలు పట్టడం సహజమే! అయితే ఇలా చెమటలు రావడం వల్ల చిరాగ్గా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దీంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తుంటాం. నిజానికి శరీరం నుంచి చెమట బయటికి రాకుండా ఎప్పుడూ ఇలా చల్లటి వాతావరణంలో గడపడం కంటే.. కాస్త చెమట పట్టనివ్వడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.

Published : 13 Apr 2024 19:23 IST

వేసవిలో వేడికి తట్టుకోలేక శరీరం చెమటలు పట్టడం సహజమే! అయితే ఇలా చెమటలు రావడం వల్ల చిరాగ్గా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. దీంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తుంటాం. నిజానికి శరీరం నుంచి చెమట బయటికి రాకుండా ఎప్పుడూ ఇలా చల్లటి వాతావరణంలో గడపడం కంటే.. కాస్త చెమట పట్టనివ్వడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

వడదెబ్బ తగలకుండా..!

ఎండాకాలంలో కాసేపు బయట గడిపినా, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బ తగులుతుంటుంది. అయితే చెమటలు పట్టడం వల్ల వడదెబ్బ నుంచి కొంత వరకు రక్షణ పొందచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. చెమట మన శరీరానికి సహజసిద్ధమైన కూలింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఎండ వేడి శరీరంలోకి వెళ్లకుండా చెమట అడ్డుపడుతుంది. తద్వారా శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. ఇక ఈ కాలంలో వడదెబ్బ నుంచి రక్షణ పొందాలంటే.. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి చలువ చేసే పదార్థాల్ని తీసుకోవడమూ ముఖ్యమే!

మలినాలు తొలగిపోతాయ్‌!

ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో డీటాక్సిఫికేషన్‌ ప్రక్రియ జరగాల్సిందే! అంటే శరీరంలోని మలినాల్ని బయటికి పంపించడమన్న మాట! రోజువారీ జీవనక్రియల వల్ల శరీరంలో చెడు కొవ్వులు, ఇతర మలినాలు వేరవుతాయి. స్వేద గ్రంథులు విడుదల చేసే చెమట వల్ల కూడా ఇవి బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండచ్చు. అందుకే చెమటను సహజసిద్ధమైన డీటాక్సిఫికేషన్‌ ప్రక్రియగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇలా శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోవడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా చర్మ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తికి!

స్వేద గ్రంథులు విడుదల చేసే చెమట రోగనిరోధక శక్తినీ పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు స్వేద గ్రంథుల్లో ఉండే యాంటీమైక్రోబియల్‌ పెప్టైడ్లే కారణమట! ఇవి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌లతో పోరాడి.. వీటి ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై పడకుండా చేస్తాయి. తద్వారా పలు రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

‘సానా’తో మేలు!

వేసవిలో వేడి కారణంగా శరీరం సహజంగానే చెమట పడుతుంటుంది. అయితే బయటి వేడితో సంబంధం లేకుండా శరీరాన్ని చెమట పట్టించే పద్ధతి ఒకటుంది. అదే ‘సానా బాత్‌’. 150-195 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత కలిగిన గదిలో ఓ అరగంట పాటు గడపడమే దీని ముఖ్యోద్దేశం! స్టీమ్‌ బాత్‌గానూ పిలిచే ఈ చెమట కక్కే ప్రక్రియ వల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వారానికి మూడుసార్లైనా.. ఓ అరగంట పాటు ఈ ఆవిరి స్నానం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండచ్చని, రక్తపోటునూ అదుపు చేసుకోవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. అలాగే శరీరంలోని కొవ్వులు, మలినాలు చెమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల తక్కువ సమయంలోనే బరువూ తగ్గచ్చంటున్నారు నిపుణులు.

ఇవి కూడా!

⚛ వ్యాయామం చేసే క్రమంలో చెమట పడుతుంది. తద్వారా శరీరం చల్లబడడంతో పాటు ఈ క్రమంలో ఎండార్ఫిన్లూ విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి హ్యాపీగా ఉండచ్చు.

⚛ చెమట వల్ల శరీరంలోని అధిక ఉప్పు బయటికి వెళ్లిపోతుంది. అలాగే ఎముకలకు సరిపడునంత క్యాల్షియం అందుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ శరీరం చెమట పట్టినప్పుడు చర్మ గ్రంథులు తెరుచుకుంటాయి. తద్వారా చర్మ రంధ్రాల్లో గాలి బాగా ఆడుతుంది. అలాగే శరీరంలోని మలినాలూ చెమట రూపంలో బయటికి వచ్చేస్తాయి. వీటివల్ల చర్మం ఎప్పటికప్పుడు శుభ్రపడి నవయవ్వనంగా కనిపిస్తుంది. అలాగే ఇతర చర్మ సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

గమనిక : అయితే ఇలా చెమట పట్టడం మంచిదే అయినా.. ఎక్కువ సేపు ఇలాగే ఉండడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. వాతావరణంలోని దుమ్ము-ధూళి చెమటతో కలిసి చర్మ రంధ్రాల్లోకి చేరడం వల్ల మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి చెమట పట్టిన వెంటనే స్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలన్నీ చేకూరడంతో పాటు అందాన్నీ కాపాడుకోవచ్చంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్