ఆ కోపంతో కట్టుకున్న భార్య, కన్న బిడ్డల పైన యాసిడ్ పోశాడు!

ప్రేమను తిరస్కరించినందుకు ప్రియురాలిపై ఆమ్లదాడి చేసిన ఘటనల్ని చూశాం.. మనసులో క్రూరత్వం, ఈర్ష్యాద్వేషాల్ని నింపుకొని ముక్కూ మొహం తెలియని అమ్మాయిలపై యాసిడ్‌ పోసిన సంఘటనల గురించీ చదివాం.. కానీ కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై యాసిడ్‌ పోశాడో కనికరం....

Published : 01 Apr 2023 17:44 IST

(Image for Representation)

ప్రేమను తిరస్కరించినందుకు ప్రియురాలిపై ఆమ్లదాడి చేసిన ఘటనల్ని చూశాం.. మనసులో క్రూరత్వం, ఈర్ష్యాద్వేషాల్ని నింపుకొని ముక్కూ మొహం తెలియని అమ్మాయిలపై యాసిడ్‌ పోసిన సంఘటనల గురించీ చదివాం.. కానీ కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై యాసిడ్‌ పోశాడో కనికరం లేని తండ్రి. అబ్బాయిని కనలేదని ఆలిపై, ఆడపిల్లలన్న అక్కసుతో కన్న కూతుళ్లపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. ఇలా అతడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఈ తల్లీకూతుళ్ల ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఎన్నో సర్జరీలు, ఎంతో మానసిక వేదనతో కుంగిపోయిన వీరు.. కొన్నేళ్ల తర్వాత తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు.. తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు. ఈ క్రమంలోనే యాసిడ్‌ దాడి బాధితులు నడుపుతోన్న ‘షీరోస్‌ హ్యాంగౌట్‌’ కేఫ్‌లో పనిలో చేరారు. వివిధ వేదికలపై తమ ఉపన్యాసాలు, పలు అవగాహన కార్యక్రమాలతో ఆమ్ల దాడి బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారీ తళ్లీకూతుళ్లు. తమ కన్నీటి కథ గురించి కూతురు నీతూ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే మీకోసం..!

మాది దిల్లీలోని ఆగ్రా. అమ్మ గీత, నాన్న ఇంద్రజిత్ మొహర్. నాన్న స్థానికంగా బ్యాండ్‌ ప్లేయర్‌గా పనిచేసేవాడు. నాన్నను వివాహం చేసుకున్నప్పట్నుంచే అమ్మ కష్టాలు మొదలయ్యాయి. అబ్బాయిని కనాలంటూ పదే పదే తనపై ఒత్తిడి తెచ్చేవాడు. కానీ వరుసగా ముగ్గురం అమ్మాయిలమే పుట్టాం. ఇది జీర్ణించుకోలేక నాన్న తాగుడుకు బానిసయ్యాడు.. పేకాటకు అలవాటు పడ్డాడు. రోజూ రాత్రి తాగి ఇంటికి రావడం, అమ్మను, మమ్మల్ని హింసించడంతో ఇల్లు ఒక నరకంలా తయారైంది.

నిద్రలోనే దాడి చేశాడు!

అప్పుడు నాకు మూడేళ్లుంటాయనుకుంటా. ఓరోజు నేను, అమ్మ, చెల్లి అమ్మమ్మ వాళ్లింటికొచ్చాం. రాత్రి మా గదిలో నిద్రపోతున్నాం. రోజూలాగే నాన్న తాగొచ్చాడు. ఈసారి కొట్టడం, తిట్టడం కాకుండా.. యాసిడ్‌ బాటిల్‌తో వచ్చాడు. గాఢనిద్రలో ఉన్న మా ముగ్గురిపై యాసిడ్‌ పోశాడు. అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. అమ్మ ముఖం చాలా వరకు కాలిపోయింది. తను ఒక కంటిని కోల్పోయింది. ఇక నా ముఖం దాదాపు 70 శాతం కాలిపోవడంతో పాటు.. రెండు కళ్లూ కోల్పోయాను. 18 నెలల నా చెల్లి బాధను తట్టుకోలేక కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. ఘటన జరిగిన వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నాన్న అరెస్టయ్యాడు. రెండు నెలల జైలు శిక్ష పడింది. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మా జీవితాలు మరింత భారంగా మారాయి. పొట్ట కూటి కోసం గాయాలతోనే అమ్మ రోజువారీ కూలీ పనులకు వెళ్లేది. మరోవైపు జైలు నుంచి నాన్న విడిపించమంటూ ఉత్తరాలు రాసేవాడు. ‘తప్పైపోయింది.. క్షమించమం’టూ వేడుకునేవాడు. ఉండబట్టలేక అమ్మ తనను కలవడానికి వెళ్తే కాళ్లపై పడి జైలు నుంచి విడిపించమంటూ ప్రాధేయపడ్డాడు.

జైలు కూడు తిన్నా.. మారలేదు!

దీంతో అక్కడున్న వాళ్లంతా కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసరికి.. అమ్మ అలాగే చేసింది. దాంతో నాన్న తిరిగి ఇంటికొచ్చాడు. అలాగని మారాడనుకుంటే పొరపాటే! ఇంత జరిగినా, కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడిపినా ఆయన తన పంథా మాత్రం మార్చుకోలేదు. మళ్లీ తాగి రావడం, వేధించడం షరా మామూలే! అలాగని నాన్న నుంచి విడిపోయి.. మమ్మల్ని తీసుకొని ఒంటరిగా జీవితం గడుపుదామంటే అమ్మ అంతరాత్మ అందుకు అంగీకరించలేదు. ‘భర్త నుంచి విడిపోయిన భార్యను ఈ సమాజం గౌరవించదు.. పైగా ఆడపిల్లల రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది..’ అనుకున్న అమ్మ అదే హింసను అలాగే భరించడానికి సిద్ధపడింది. మరోవైపు పలు సర్జరీలతో భరించలేనంత బాధను అనుభవించాం. ఇక దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లుగా.. కాలిన గాయాలతో అంద విహీనంగా మారిపోయిన మమ్మల్ని నలుగురూ తమ మాటలతో హింసించడంతో పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికీ ప్రయత్నించింది. కానీ నన్ను, అక్క రేఖను చూసి ఆగిపోయేది. ఇలా ఏళ్ల పాటు కష్టాల్ని, బాధల్ని భరించిన మమ్మల్ని ‘Chhanv Foundation’ అనే స్వచ్ఛంద సంస్థ చేరదీసింది.

అప్పుడు బతుకుపై ఆశ కలిగింది!

అయితే ఆమ్లదాడి బాధితులకు అండగా నిలుస్తోన్న ఆ సంస్థలోకి అడుగుపెడితే కానీ తెలియలేదు మాలాంటి పరిస్థితి మరెంతోమంది ఎదుర్కొంటున్నారని! అక్కడ ఇచ్చిన థెరపీలు, కౌన్సెలింగ్‌.. వంటివి మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. బాధలన్నీ మర్చిపోయి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆశను కలిగించాయి. ఈ క్రమంలోనే ఆమ్లదాడి బాధితులకు ఉపాధి కల్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోన్న అక్కడి ‘షీరోస్‌ హ్యాంగౌట్‌’లో నేను, అమ్మ పనికి చేరాం. ‘స్టాప్‌ యాసిడ్‌ అటాక్స్‌’ క్యాంపెయిన్‌లోనూ పాలుపంచుకున్నాం. తద్వారా దేశవిదేశాల్లో జరిగే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మాలాంటి ఎంతోమంది ఆమ్ల దాడి బాధితుల్లో చైతన్యం కలిగిస్తున్నాం. ఇందులో భాగంగానే ఓసారి మెల్‌బోర్న్‌లో అక్కడి చిత్ర దర్శక నిర్మాత ఎమ్మాను కలుసుకున్నాం. మా కథ విన్న తాను మాపై ‘గీత’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. అది ‘మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ చిత్రోత్సవం’తో పాటు పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. ‘ఆస్ట్రేలియన్‌ సినిమాటోగ్రాఫర్స్‌ సొసైటీ’ నుంచి ‘గోల్డ్‌ అవార్డ్‌’ అందుకోవడంతో పాటు పలు పురస్కారాలూ దక్కాయి.


పాజిటివిటీ ముఖ్యం!

గతాన్ని మార్చలేను.. అలాగని దాన్నే తలచుకుంటూ అక్కడే ఆగిపోలేను.. అందుకే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా. నా అనుభవాలను నలుగురితో పంచుకుంటూ వారిలో జీవితం పట్ల ఆశ కలిగిస్తున్నా. నా కథ కనీసం ఒక్కరిలో మార్పు తెచ్చినా అది నాకు సంతోషమే! మహిళలు, అమ్మాయిల పట్ల ఈ సమాజం ఆలోచన మారాలి.. ప్రతి మహిళా ఎన్ని అవరోధాలు ఎదురైనా తన అంతిమ లక్ష్యానికి చేరువయ్యేందుకు, తనను తాను నిరూపించుకునేందుకు కృషి చేయాలి. అప్పుడే మన అస్తిత్వమేంటో సమాజానికి అర్థమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్