‘వీగన్ డైట్’ పాటిస్తున్నారా?

వీగన్ డైట్.. ఇటీవలి కాలంలో చాలామంది ఈ డైట్ ఫాలో అవుతున్నారు. మాంసం, గుడ్లతో పాటు పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకోవడం వీగనిజం ముఖ్యోద్దేశం. ఇది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి.....

Updated : 22 Nov 2022 15:25 IST

వీగన్ డైట్.. ఇటీవలి కాలంలో చాలామంది ఈ డైట్ ఫాలో అవుతున్నారు. మాంసం, గుడ్లతో పాటు పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకోవడం వీగనిజం ముఖ్యోద్దేశం. ఇది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి అంటారు నిపుణులు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన లైఫ్‌స్త్టెల్ దిశగా అడుగులేస్తోన్న క్రమంలో వీగన్ డైట్‌పై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌ని ‘వీగన్ మాసం’గా జరుపుకొంటున్న నేపథ్యంలో వీగన్‌ డైట్ వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుంటూనే.. ఈ ఆహార పద్ధతిని పాటిస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం రండి..

పోషకాలు ఎక్కువ..

సాధారణంగా మాంసాహారం నుంచి వీగన్ డైట్‌లోకి మారిపోయిన తర్వాత జంతు మాంసంతో పాటు జంతువుల నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటారు. దీంతో పూర్తిగా శాకాహారం తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ముడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. వీటి ద్వారా రోజూ మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయట. కొన్ని అధ్యయనాల ప్రకారం వీగన్ డైట్ మన శరీరానికి అవసరమయ్యే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లనే కాదు.. పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలను కూడా మిగిలిన వాటి కంటే ఎక్కువగా అందిస్తుందట.

బరువు తగ్గేలా..

వీగన్ డైట్ బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ముడిపదార్థాలతో రూపొందించిన డైట్ కాబట్టి ఆహారం జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. అంతేకాదు.. వీగన్ డైట్స్ సాధారణంగా తక్కువ క్యాలరీలతో నిండి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, ముడిధాన్యాలు ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ క్యాలరీలకే కడుపు నిండిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడం సులభమవుతుంది.

చక్కటి ఆరోగ్యానికి..

వీగన్ డైట్‌ని అనుసరించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు దూరమవుతాయని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో నిరూపితమైందట. వీగన్ లైఫ్‌స్త్టెల్‌కి మారిన తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులు తగ్గడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు 50 నుంచి 70 శాతం వరకూ తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు.. మాంసాహారం నుంచి వీగన్ డైట్‌కి మారడం వల్ల కిడ్నీల పనితీరులోనూ మార్పొస్తుందట. ఫలితంగా కిడ్నీ సమస్యల నుంచి కూడా విముక్తి పొందచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఈ వ్యాధులూ దూరం..

వీగన్ డైట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకునే పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పండ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట. రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు అధిక మోతాదులో ఉంటే క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి, వీగన్ డైట్ మొత్తం వీటి పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ తరహా ఆహార పద్ధతి వల్ల రొమ్ము, ప్రొస్టేట్, పెద్దపేగు క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇక ఈ డైట్‌ని అనుసరించే వారిలో రక్తపోటు తక్కువగా ఉంటుందని, చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుందని ఫలితంగా గుండె జబ్బు వచ్చే ముప్పు చాలా తక్కువని కూడా నిపుణులు తేల్చారు. అంతేకాదు.. ఈ డైట్‌తో తీసుకునే ప్రొబయోటిక్ పదార్థాలు, మొక్కల నుంచి వచ్చే ఆహారం వల్ల ఆర్థరైటిస్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చట.


ఈ జాగ్రత్తలు అవసరం!

ఎంత మంచిదైనా వీగన్ డైట్‌లో కొన్ని లోపాలూ ఉన్నాయి. వాటిని సరిచేసుకొని ఆహారం తీసుకుంటేనే దాని ఫలితాలను పొందగలం.

⚛ వీగన్ డైట్‌లో మన శరీరానికి అవసరమయ్యే అత్యవసర అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. అందుకే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం బాదం పప్పులు, ఇతర పప్పుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే సోయా పాలు, టోఫూని కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.

⚛ వీగన్‌గా మారిపోయాం కదా అని అన్ని పదార్థాలను వదిలేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల కొన్నిరోజులకే డైట్ బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. వాటిని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు పనీర్‌కి బదులు టోఫూ, మామూలు పాలకు బదులు సోయా లేదా బాదం పాలు.. మాంసానికి బదులు సోయా చంక్స్ వంటివి ఉపయోగించవచ్చు.

⚛ వీగన్ ఆహారంలో విటమిన్ బి12, క్యాల్షియం, అయోడిన్, జింక్ వంటివి తక్కువగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇవి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను రోజువారీ మెనూలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

⚛ స్నాక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆరోగ్యకరమైన పొద్దుతిరుగుడు లేదా అవిసె గింజలు తినండి. లేదా వేరుశనగ గింజలు, డ్రైఫ్రూట్స్ వంటివి ప్రయత్నించవచ్చు.

⚛ ఈ డైట్ మాత్రమే కాదు.. ఏ డైట్ తీసుకున్నా నీళ్లు మాత్రం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నీరు ఉంటుంది కదా అని తాగే నీటిని మాత్రం తగ్గించకూడదు.

⚛ సాధారణ డైట్ నుంచి వీగన్ లైఫ్‌స్త్టెల్‌కి సడన్‌గా మారినప్పుడు అందులో అడ్జస్ట్ కావడం చాలా కష్టం. అందుకే కొద్దికొద్దిగా మార్పులు చేసుకుంటూ క్రమంగా పూర్తి జీవనశైలిని మార్చుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్