ప్రత్యేకమైన పిల్లల కోసం హిగాషి!

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అందరిలా లేడని ఆ అమ్మ మనసు తల్లడిల్లింది.  పరిష్కారం కోసం దేశవిదేశాలు తిరిగింది డాక్టర్‌ రష్మీ దాస్‌. అక్కడితో ఆగిపోలేదు.

Published : 06 Jun 2024 02:04 IST

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అందరిలా లేడని ఆ అమ్మ మనసు తల్లడిల్లింది.  పరిష్కారం కోసం దేశవిదేశాలు తిరిగింది డాక్టర్‌ రష్మీ దాస్‌. అక్కడితో ఆగిపోలేదు. తన కొడుకు లాంటి వాళ్లకోసం ‘హిగాషి’ అనే పాఠశాలను ప్రారంభించి వేల మంది తల్లులకు సాయపడుతోన్న ఆమె తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చిందిలా...

మ్మా అనే పిలుపుకోసం అందరిలానే నేనూ చాలా ఆతృతగా ఎదురుచూశాను. బాబుకి మూడేళ్లు వచ్చినా ఆ భాగ్యానికి నోచుకోలేదు. నేను ఏడవని రోజు లేదు. వాడెందుకలా ఉన్నాడు, సమస్యేంటో తెలుసుకోవాలని వైద్యుల్ని కలిశాను. ఆటిజం అన్నారు. వాడు జీవితాంతం ఈ వైకల్యంతో ఎవరో ఒకరి మీద ఆధారపడతాడని తెలిసి దుఃఖం ఆగలేదు. నేనో జర్నలిస్టుని. ఏ విషయాన్నైనా సునిశితంగా పరిశీలించి, లోతుపాతుల్ని తెలుసుకున్నాకే వార్తగా రాయడం నా వృత్తిలో భాగం. కొద్దోగొప్పో లోకజ్ఞానం తెలిసిన నేనే ఇలా కుంగిపోతే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అనిపించింది. ఆరేళ్లకు మా అబ్బాయిని దిల్లీలోని ప్రముఖ పాఠశాలలో చేర్పించాను. చిన్నచిన్న విషయాలకే గట్టిగట్టిగా అరవడం, వాడిని వాడే కొట్టుకోవడం చూసి మీ అబ్బాయికి మానసిక రుగ్మత ఉంది. ఇలాంటి వాళ్లకి వేరే పాఠశాలలున్నాయి. అక్కడికి తీసుకుపోండి అన్నారు. అప్పుడే వాడిని వసంత విద్యాలయంలో చేర్పించాను. వాడి వైకల్యాన్ని గుర్తించి, వాడంతట వాడు తినేలా, పనులు చేసుకునేలా శిక్షణ ఇచ్చారు వాళ్లు. అంతేకాకుండా పెయింటింగ్‌పై వాడికున్న మక్కువను గమనించి అందులో మెలకువలూ నేర్పారు. ఇప్పుడు వాడికి 18ఏళ్లు. వాడి పనులు వాడు చేసుకుంటూ, చిత్రలేఖనంలో రాణిస్తున్నాడు. అక్కడ ఖర్చు కాస్త ఎక్కువే. సాధారణ, మధ్యతరగతి వాళ్లకి ఇక్కడ చేర్చడం సాధ్యం కాదు. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఒక పాఠశాలను తేవాలనుకున్నా.

అప్పుడే తెలిసింది..

వైకల్యం ఉన్న పిల్లలకి కళలు, పెయింటింగ్, ఆటల మీద ఆసక్తి ఉంటుంది.. దాన్ని గుర్తించి శిక్షణ ఇస్తే వారికంటూ ఒక ఉపాధిని కల్పించొచ్చు అనుకున్నా. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లో ఇందుకోసం ప్రత్యేక స్కూళ్లను నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లాను. సాధారణ పిల్లల్లానే ఆటిజం వాళ్లనీ చూస్తున్నారక్కడ. ముఖ్యంగా జపాన్‌లో అనుసరించే ‘హిగాషి’ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ పేరుతోనే దిల్లీలో ఒక పాఠశాలను ప్రారంభించా. స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న పిల్లల్ని పారాలింపిక్స్‌లో పాల్గొనేలా చొరవ తీసుకున్నా. పిల్లలు గీసిన చిత్రాల్ని ‘‘ఏయూటైపికల్స్‌’’ అనే వేదిక ద్వారా ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తాం. దీనివల్ల నాలాంటి అమ్మలు కొంతమందికైనా సాంత్వన కలిగితే నా ప్రయత్నం సఫలమైనట్లే అనుకుంటున్నా.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్