గర్భిణికి ‘ఎయిడ్స్‌’ ఉంటే.. పుట్టబోయే బిడ్డకూ వస్తుందా?

ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 01 Dec 2023 17:31 IST

ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజల్లో ఎంత అవగాహన పెరిగినా గత సంవత్సరం 17 లక్షల మంది కొత్తగా హెచ్‌ఐవీ బారిన పడినట్లు పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అసురక్షిత శృంగారం, రక్తమార్పిడి.. వంటి పలు కారణాల వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి పట్ల కొంతమందిలో ఉన్న కొన్ని అపోహలు, సందేహాలు శారీరకంగానే కాదు.. మానసికంగానూ వారిని కుంగదీస్తున్నాయి. అందుకే వాటిని తొలగిస్తూ వ్యాధిపై అందరిలో అవగాహన పెంచేందుకు ఏటా డిసెంబర్ 1న ‘ప్రపంచ ఎయిడ్స్ డే’గా జరుపుకొంటున్నాం. ‘ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు మనమంతా ఒక్కటవుదాం (Let Communities Lead)’ అనే నినాదంతో ఈసారి ఎయిడ్స్‌ డేని జరుపుకొంటోన్న నేపథ్యంలో.. ఈ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు వాస్తవాల గురించి తెలుసుకుందాం..

అపోహ: కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు..

వాస్తవం : హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్ ధరిస్తే చాలు.. ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తపడచ్చనుకుంటారు కొందరు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారం సమయంలో కండోమ్ చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం వంటివి జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అవతలి వారికి హెచ్ఐవీ లేదు అనుకొని కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలనుకోవడం కూడా పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమందికి హెచ్‌ఐవీ సోకినా తాము ఆ వ్యాధితో బాధపడుతున్నామన్న విషయం తెలియకపోవచ్చు. ఇలాంటివారితో అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొంటే హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది వెజైనల్ సెక్స్‌కి మాత్రమే కాదు.. యానల్, ఓరల్ సెక్స్‌కి కూడా వర్తిస్తుంది. ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ వచ్చే అవకాశాలు తక్కువే అయినా పూర్తిగా రాదని చెప్పలేం. అందుకే తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.

అపోహ: హెచ్ఐవీ సోకితే ఎయిడ్స్ వచ్చినట్లే..

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను నాశనం చేస్తుంది. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తూ అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. ఈ కణాలు నాశనం కావడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి.. పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా హెచ్ఐవీ సోకిన తర్వాత ప్రారంభంలో గుర్తించకుండా అలాగే దీర్ఘకాలం పాటు వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో సీడీ4 కణాల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోతుంటుంది. ఫలితంగా వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.

అపోహ: తాకినా హెచ్ఐవీ వ్యాపిస్తుంది..

హెచ్ఐవీ చాలా సున్నితమైన వైరస్. ఇది మన రక్తంలో కాకుండా బాహ్య వాతావరణంలో కొన్ని సెకన్లకు మించి జీవించలేదు. అందుకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తిన్నా, వారిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందదు. అంతేకాదు.. చెమట, విసర్జితాలు.. వంటి వాటి ద్వారా కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కాబట్టి ఎయిడ్స్ బాధితులు ఉపయోగించిన వస్తువులను ఎవరైనా నిరభ్యంతరంగా వినియోగించచ్చు. అయితే ఈ వ్యాధి ఉన్న వారు ఉపయోగించే సూదులు మాత్రం వాడకూడదు. అలాగే శృంగారంలో పాల్గొనే సమయంలో తప్పకుండా కండోమ్ ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు. ఒకవేళ గర్భం ధరించిన తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే వైద్యుల సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా ఆ వైరస్ బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ వ్యాధి తల్లిపాల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు పాలు పట్టకుండా తల్లి జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.

అపోహ: హెచ్ఐవీ సోకితే వెంటనే మరణిస్తారు..

గతంలో హెచ్ఐవీ వ్యాధి సోకిందంటే చాలు.. మరణం తప్ప మరో మార్గం లేదని భావించేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. హెచ్ఐవీని సమూలంగా, శాశ్వతంగా తగ్గించలేకపోయినప్పటికీ ఆ వ్యాధితో పోరాడేందుకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ‘ఏఆర్‌టీ - యాంటీ రెట్రోవైరల్ థెరపీ’ తీసుకోవడం ద్వారా హెచ్ఐవీ బాధితులు ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వైరల్ లోడ్, సీడీ4 కౌంట్ పరీక్షలు చేయించుకుంటూ; ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ తదనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గుముఖం పట్టిన తర్వాత మందులు ఉపయోగించడం ఆపేయడం వల్ల ఈ వ్యాధి తిరిగి మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిలో కొందరికి హెచ్‌సీవీ (హెపటైటిస్ సి వైరస్) వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాని కోసం కూడా తరచూ పరీక్షలు చేయించుకుంటూ; తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

అపోహ: భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉంటే కండోమ్ వాడాల్సిన అవసరం లేదు..

భార్యాభర్తలిద్దరికీ హెచ్ఐవీ ఉన్నప్పటికీ కండోమ్ ఉపయోగించకుండా అసురక్షితమైన లైంగిక చర్యలో పాల్గొనడం ఏమాత్రం సరికాదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్న హెచ్ఐవీ వైరస్ ఒకే రకమైనది కాకపోవచ్చు. హెచ్ఐవీలో కూడా రకాలున్నాయి కాబట్టి భాగస్వామి నుంచి మరో రకం వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఫలితంగా హెచ్ఐవీ చికిత్స నిమిత్తం ఉపయోగిస్తున్న మందు ఆ వైరస్‌కు తగినది కాకపోతే శరీరంలో వైరల్ లోడ్ పెరిగిపోతుంది. తద్వారా వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఐవీ సోకిన తర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా కండోమ్ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.

అపోహ: హెచ్ఐవీ సోకితే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు..

హెచ్ఐవీ సోకిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి ఒక్కొక్కరికి ఒక్కోలా సమయం పడుతుంది. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ఈ వ్యాధి లక్షణాలు అంత ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఒకవేళ హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ సోకిందన్న అనుమానం ఉంటే కనుక ప్రతి మూడు నెలలకోసారి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి వచ్చిందా? రాలేదా?? అన్నది నిర్ధరించుకోవచ్చు.

అపోహ: ఒకసారి నెగెటివ్ వస్తే ఇక హెచ్ఐవీ లేనట్లే..

హెచ్ఐవీ వచ్చిన వారితో అసురక్షిత శృంగారంలో పాల్గొన్న తర్వాత లేదా హెచ్ఐవీ బాధితులు ఉపయోగించిన సూదులు వాడడం, వారి రక్తం మరొకరికి ఎక్కించడం వంటివి జరిగిన తర్వాత శరీరంలో హెచ్ఐవీ యాంటీబాడీలు ఏర్పడేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. హెచ్ఐవీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నీ.. హెచ్ఐవీ వచ్చిన తర్వాత శరీరం విడుదల చేసే యాంటీబాడీలనే పరీక్షిస్తున్నాయి. వీటిని విడుదల చేయడం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. అందుకే ఒక్కసారి పరీక్షలో నెగెటివ్ వస్తే మూడు నెలల పాటు వేచి చూసి మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

అపోహ: వైరల్ లోడ్ తగ్గిపోతే ఇక వ్యాధి వ్యాపించదు..

ఏఆర్‌టీ చికిత్స తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో వైరల్ లోడ్ రోజురోజుకీ తగ్గిపోయి.. చివరకు పరీక్షల్లో గుర్తించలేని స్థాయికి చేరుతుంది. ఇలాంటప్పుడు చాలామంది వ్యాధి తగ్గిపోయిందనే ఉద్దేశంతో మందులు వేసుకోవడం ఆపేస్తుంటారు. అసురక్షిత శృంగారంలోనూ పాల్గొంటుంటారు. కానీ ఇది సరైంది కాదు. ఎందుకంటే శరీరంలో వైరల్ లోడ్ తగ్గితే వ్యాధి విస్తరించే/సోకే అవకాశాలు చాలా వరకు తగ్గినా.. వ్యాధి సోకే అవకాశం పూర్తిగా లేదని చెప్పలేం. కాబట్టి వైరల్ లోడ్ పూర్తిగా తగ్గినా బాధితులు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తపడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్