Akli Tudu: చెరువులు తవ్వితే చంపేస్తామన్నారు!

గ్రామీణ ప్రాంతాల్లో తనలాంటి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించాలనుకున్నారామె. ఆ ప్రయత్నంలో మావోయిస్టుల నుంచి వచ్చిన బెదిరింపులనూ లెక్కచేయలేదు.

Updated : 15 Mar 2023 09:53 IST

గ్రామీణ ప్రాంతాల్లో తనలాంటి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించాలనుకున్నారామె. ఆ ప్రయత్నంలో మావోయిస్టుల నుంచి వచ్చిన బెదిరింపులనూ లెక్కచేయలేదు. ఈమె అందించిన చేయూతతో వేలమంది మహిళలు ఆర్థిక స్వావలంబన పొందారు. పల్లె గొంతుక అక్లీ టుడు స్ఫూర్తి కథనమిది..

చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా అక్లీని చదివించే ఆర్థిక స్తోమత ఆమె తల్లిదండ్రులకు లేదు. ఝార్ఖండ్‌లోని ఈస్ట్‌ సింగభమ్‌ జిల్లాలో మావోయిస్టుల ప్రాంతంగా పేరుపొందిన గుడబంధా గ్రామానికి చెందిన కుటుంబంలో పుట్టారీమె. ఆరో తరగతి వరకు చదివాక ముసాబానితో వివాహమైంది. తీరా అత్తింటిలో ఆమెకు ఆదరణ దొరకలేదు. నిత్యం భర్త నుంచి వేధింపులను తట్టుకోలేకపోయారామె. ఆ వేదన భరించలేక, పుట్టింటికి చేరుకున్నారు.  

బెదిరింపులు..

2012లో గుడబంధా గ్రామానికి ఠాగూరు సొసైటీ వచ్చింది. మహిళాసాధికారత కోసం కృషి చేసే దిశగా ఈ సొసైటీ స్థానిక మహిళలందరితో స్వయం సహాయక బృందాలను రూపొందించింది. ఆ సమయంలో మహిళలకు తన వంతు సేవలందించాలనుకున్నారు అక్లీ. ‘ఆ సొసైటీ ద్వారా మహిళలకు చేయూతనివ్వాలనుకున్నా. వీరికందరికీ వ్యవసాయాన్ని ఉపాధిగా మార్చాలనిపించింది. అయితే స్థానికంగా నీటి ఎద్దడి అడ్డంకిగా ఉండటంతో ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించే ప్రయత్నాలు చేశా. అప్పుడే టాటాస్టీల్‌ ఫౌండేషన్‌, సీఐఎన్‌ఐ వంటి సంస్థలు ముందుకొచ్చి నిధులు అందించాయి. చెరువులు తవ్వించడానికి నిధులు సమకూరడంతో 2014లో ‘ఏక్తా మహిళా సమితి’ ట్రస్టు ప్రారంభించాం. మహిళలందరినీ ఇందులో భాగస్వాములను చేసి, చెరువుల తవ్వకాన్ని మొదలుపెట్టాం. అప్పుడే మావోయిస్టుల నుంచి బెదిరింపులొచ్చాయి. మహిళలతో వ్యవసాయం చేయించొద్దని, ఆ పనులు ఆపకపోతే చంపేస్తామని ఊరంతా పోస్టర్లు అంటించారు. అంతేకాదు, స్థానికులు మహిళలు వ్యవసాయం చేయడంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొన్నా. మహిళల్లో అవగాహన కలిగించా. చెరువుల తవ్వకం నుంచి వ్యవసాయం వరకు ప్రతి మహిళ ముందుకొచ్చేలా ప్రోత్సాహాన్ని అందించా. అందరం కలిసి 100 చెరువులు తవ్వాం. మట్టి, చెత్తతో పూడిపోయిన 1,159 చెరువులను పునరుద్ధరించాం. దాంతో వ్యవసాయానికి మార్గం సుగమమైంది. ఆ తర్వాత రెండువేలమందికిపైగా స్థానిక గ్రామీణ మహిళలు రైతులుగా మారారు. వ్యవసాయాన్ని జీవనోపాధిగా మార్చుకొని నెలకు తలా రూ.25వేలు ఆదాయాన్ని అందుకుంటున్నారు’  అంటున్నారీమె. 

పురస్కారాలెన్నో..

వ్యవసాయంతోపాటు చేపలు, బాతుల పెంపకంపై మహిళలకు శిక్షణ అందేలా చేశారు  అక్లీ. 1,152మంది వీటిద్వారా ఉపాధిని పొందుతున్నారు. మావోయిస్టుల బెదిరింపులకు లొంగకుండా మహిళాసాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశానంటారీమె. ఈమె అందించిన చేయూతతో ఇప్పుడిక్కడ 120 గ్రామాల మహిళలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. వీరంతా  వ్యవసాయంలో భాగంగా పండ్లు, కూరగాయలూ పండిస్తున్నారు. అక్లీ సేవలకుగాను సోషల్‌, విమెన్‌ ఆంత్రప్రెన్యూరల్‌ ఫార్మర్‌ అవార్డులు, వాటర్‌ ఛాంపియన్‌ అవార్డు సహా నాబార్డు నుంచీ పురస్కారాలెన్నో వరించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్