చెమట ఎక్కువగా పడుతోందా?

కాలమేదైనా.. ఏ సీజన్‌లో ఉండే సమస్యలు ఆ సీజన్‌లో ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండాకాలంలో తలెత్తే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు భానుడి భగభగలు, మరోవైపు వడగాలులు. వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే భయమేస్తుంది.

Published : 19 Apr 2024 13:22 IST

కాలమేదైనా.. ఏ సీజన్‌లో ఉండే సమస్యలు ఆ సీజన్‌లో ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండాకాలంలో తలెత్తే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు భానుడి భగభగలు, మరోవైపు వడగాలులు. వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే భయమేస్తుంది. దీనికి తోడు చెమట చికాకు. అయితే కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫ్యాన్లు, కూలర్ల ముందు కూర్చున్నా కొంతమందిని చెమట సమస్య వదలదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

చెమట ఎక్కువగా పట్టడానికి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, అధిక బరువు, మధుమేహం, ఆందోళన, కోపం, శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు, మెనోపాజ్.. ఇలా వివిధ కారణాల వల్ల చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుందట! అయితే చెమట వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోవడం మాట వాస్తవమే అయినప్పటికీ ఇది మరీ అధికంగా ఉంటే మాత్రం ఈ సహజసిద్ధమైన చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఈ మిశ్రమంతో..

కొంతమందికి చంకల్లో ఎక్కువగా చెమట పడుతుంటుంది. అలాంటి వారు ఈ చిన్న చిట్కా ప్రయత్నించడం మంచిది. కొద్దిగా కార్న్‌స్టార్చ్‌లో కాస్త బేకింగ్ సోడా, సరిపడినంత ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే కొద్ది రోజుల్లో అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

జ్యూసులు ఇలా!

ఎండాకాలంలో ఏ పండ్ల రసమైనా లొట్టలేసుకుంటూ మరీ తాగేస్తుంటాం. కానీ ఏదైనా ఔషధ గుణాలున్న పానీయాలు తాగమంటే మాత్రం మొహం తిప్పేసుకుంటాం. అయితే అధిక చెమట సమస్యతో బాధపడేవారికి ఇలాంటి ఔషధ గుణాలున్న జ్యూసులు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గోధుమగడ్డి జ్యూసు, టొమాటో రసం.. వంటి వాటిలో సి, బి6, బి12 విటమిన్లు, ఫోలికామ్లం, ఇతర ఖనిజాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇవన్నీ శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే చెమటను తగ్గిస్తాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తపడచ్చు.

నీటి మోతాదు తగ్గకుండా..

వేసవిలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగడం తప్పనిసరి. దీంతో పాటు పాలకూర, క్యాలీఫ్లవర్, పుచ్చకాయ, ద్రాక్ష, తర్బూజా.. వంటి కూరగాయలు, పండ్లు తీసుకోవడం తప్పనిసరి. ఇవన్నీ శరీరం నుంచి విడుదలయ్యే చెమటను తగ్గించడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తాయి.. డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడతాయి.

వేడి తగ్గడానికి ఇలా...

⚛ పచ్చిమిర్చి, మసాలాలు.. వంటి కొన్ని ఘాటైన పదార్థాలు కూడా శరీరంలో అధిక వేడి పుట్టించి ఎక్కువ చెమట విడుదలయ్యేలా చేస్తాయి. కాబట్టి ఈ కాలంలో వీటిని తీసుకోవడం తగ్గించాలి.

⚛ కెఫీన్ నాడీ వ్యవస్థను ప్రేరేపించి శరీరంలో అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి కాఫీని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం.

⚛ ఒత్తిడి, ఆందోళనలు వంటివి తగ్గించుకోవడం కూడా ముఖ్యమే.

⚛ అలాగే ఈ కాలంలో శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే దుస్తులు, అది కూడా కాటన్ దుస్తుల్ని ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ చిట్కాలన్నీ పాటించినా అధిక చెమట సమస్య తగ్గట్లేదనుకుంటే ఓసారి డాక్టర్‌ని సంప్రదించి.. ఇందుకు గల కారణాలేంటో తెలుసుకొని, సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్