Published : 30/06/2022 19:47 IST

తలనొప్పి వేధిస్తోందా?

తలనొప్పి.. ఉరుకులు పరుగుల జీవన విధానంలో ఉండే ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి... తదితర కారణాలతో చాలామందిని ఈ సమస్య వెంటాడుతుంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తలనొప్పి నుంచి అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం పొందడానికి ఓ ట్యాబ్లెట్‌ వేసుకుని, కాసేపు కునుకు తీసేవారు మనలో చాలామందే ఉంటారు. అయితే ఇలా ప్రతిసారీ మాత్రలు వేసుకుంటే సైడ్‌ఎఫెక్ట్స్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఇంట్లో ఉండే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో పాటు కొన్ని తేలికైన చిట్కాలను పాటించడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి తలనొప్పిని తగ్గించే ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి.

తలనొప్పి రావడానికి తగినన్ని మంచినీళ్లు తాగకపోవడం కూడా కారణం కావచ్చు. శరీరంలోని నీటిస్థాయిలు తగ్గడం వల్లనే మైగ్రెయిన్‌ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డీహైడ్రేషన్‌ కారణంగా ఏకాగ్రత దెబ్బతిని ఏ పనీ చేయాలనిపించదు. చిరాకు కలిగిస్తుంది. కాబట్టి తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే సరిపడా మంచినీటిని తాగడమో, నీటి స్థాయులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమో చేస్తుండాలి.

ఇతరులతో పోల్చుకుంటే మెగ్నీషియం లోపం ఉన్న వారిలో తరచూ మెగ్రెయిన్‌ లాంటి తలనొప్పి సమస్యలు అధికంగా వస్తున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్‌, తృణధాన్యాలు, డార్క్‌ చాక్లెట్‌ ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే మెగ్నీషియం సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో డయేరియా లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం.

ఛీజ్‌, బర్గర్లు, బీర్లు, వైన్‌, స్మోక్డ్‌ ఫిష్, మాంసం... వంటి పదార్థాల్లో హిస్టమైన్‌ అధికంగా ఉంటుంది. ఇవి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందిలో మైగ్రెయిన్ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు తరచూ తలనొప్పి బారిన పడుతుంటే ఈ పదార్థాలను దూరం పెట్టడం మేలు. అయితే కొన్ని చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తలనొప్పిని తగ్గించడంలో బాగా సహకరిస్తాయి.

నిద్రలేమి ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రుళ్లు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రకు కేటాయించాలని నిపుణులు చెబుతుంటారు. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే తలనొప్పి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదేవిధంగా నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోయినా ఈ సమస్య వెంటాడుతుంది. కాబట్టి సరిపడా నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

 

మార్కెట్లో దొరికే కొన్ని రకాల నూనెలతో తలనొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. ప్రత్యేకించి పెప్పర్‌మింట్‌ ఆయిల్‌, లావెండర్‌ నూనెల్లో తలనొప్పిని నివారించే గుణాలు అధికంగా ఉంటాయి. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా తలనొప్పి వచ్చినప్పుడు కొద్దిగా పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ను తీసుకుని నుదుటిపై, కణతలకు సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీంతో ఆందోళనతో పాటు తలనొప్పి కూడా మాయమవుతుంది. ఇక మైగ్రెయిన్‌ తీవ్రతను తగ్గించడంలో లావెండర్‌ నూనె చాలా ఉపయోగపడుతుంది.

ఆల్కహాల్‌, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నవారికి తలనొప్పి తరచూ వేధిస్తుంటుంది. కాబట్టి ఈ అలవాట్లకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి.

మైగ్రెయిన్‌లాంటి సమస్యల నుంచి సత్వర ఉపశమనం కోసం చాలామంది పాటించే చిట్కా ఐస్‌ ప్యాక్స్‌. ఐస్‌ప్యాక్‌ని నుదురుపై ఉంచి కాసేపు అద్దుతూ ఉంటే తలనొప్పి నుంచి కాస్త రిలీఫ్‌ పొందవచ్చు. ఒకవేళ ఐస్‌ప్యాక్‌ అందుబాటులో లేకపోయినా ఫ్రోజెన్‌ జెల్‌ రాసుకోవడమో లేదంటే చల్లటి నీళ్లలో ముంచిన గుడ్డతో తలపై అద్దడం వంటివి చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.

కాఫీ, టీలలో ఉండే కెఫీన్‌కి తలనొప్పిని తగ్గించే శక్తి ఉంది. కాబట్టి తలనొప్పి ఉన్న సమయంలో చాలామంది వీటి మీద ఆధారపడుతుంటారు. అయితే త్వరగా తగ్గాలని వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఇతర అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగకూడదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని