Winter Care : కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యంగా..!

చలికాలం రాగానే చాలామందికి దిల్లీ కాలుష్యమే గుర్తొస్తుంది. అక్కడ చలికాలంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అయితే కేవలం దిల్లీలోనే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా పట్టణీకరణ వల్ల వాయు కాలుష్య తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

Published : 24 Nov 2023 12:54 IST

చలికాలం రాగానే చాలామందికి దిల్లీ కాలుష్యమే గుర్తొస్తుంది. అక్కడ చలికాలంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అయితే కేవలం దిల్లీలోనే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా పట్టణీకరణ వల్ల వాయు కాలుష్య తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఒక్కసారిగా మనం వాయు కాలుష్యాన్ని నివారించలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీని తీవ్రతను తగ్గించుకోవడంతో పాటు కాలుష్యం వల్ల తలెత్తే సమస్యల నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా?

ఈ మొక్కలతో..

వాయు కాలుష్యం గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంటుంది. దీనికి కారణం ఎక్కువగా చెట్లు లేకపోవడమే. అందుకే ఇండోర్‌ ప్లాంట్స్ పెంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయటి నుంచి వచ్చే కాలుష్యానికి అడ్డుకట్ట వేయచ్చు. ఇండోర్‌ ప్లాంట్స్‌లో భాగంగా కలబంద, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ, మనీ ప్లాంట్.. వంటి మొక్కలను పెంచుకోవచ్చు.

ఆకుకూరలు.. నిమ్మజాతి పండ్లు..

వాయు కాలుష్యం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిని నిరోధించాలంటే మన వ్యాధినిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. అప్పుడే వ్యాధులతో పోరాడే శక్తి మన శరీరంలో జనిస్తుంది. ఇందుకోసం ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, బెర్రీస్‌, నట్స్.. వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోయి జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది.

తులసి, బెల్లం..

వాయు కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను నివారించేందుకు తులసి, బెల్లంతో చేసిన హెర్బల్‌ టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఐదారు తులసి ఆకులు, కొంచెం తురిమిన అల్లం, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. దీనిని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ తేనిటి పానీయం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.

ఆవిరితో..

వాయు కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇందుకోసం ఆవిరి పట్టుకోవడం చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. అయితే ఆవిరి పట్టే సమయంలో అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ నూనె లేదా ఏదైనా ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ వేసుకోవడం ద్వారా సత్వర ఉపశమనం కలుగుతుందంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్