అధరాలు అందంగా..

ముఖసౌందర్యాన్ని పెంపొందించడంలో పెదాలదీ కీలక పాత్రే! అయితే కొంతమంది అమ్మాయిల పెదవులు పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తాయి. తద్వారా అందం దెబ్బతింటుంది. మరి, పొడిబారి నిర్జీవంగా మారిన అధరాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే కొన్ని ఇంటి చిట్కాలతో సాధ్యమవుతుంది.

Published : 13 Feb 2024 14:23 IST

ముఖసౌందర్యాన్ని పెంపొందించడంలో పెదాలదీ కీలక పాత్రే! అయితే కొంతమంది అమ్మాయిల పెదవులు పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తాయి. తద్వారా అందం దెబ్బతింటుంది. మరి, పొడిబారి నిర్జీవంగా మారిన అధరాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే కొన్ని ఇంటి చిట్కాలతో సాధ్యమవుతుంది.

తేమ నిలిచేలా..

చెంచా తేనె, అరచెంచా దానిమ్మ రసం తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకొని వెంటనే లిప్ బామ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అధరాల్లోని తేమ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. అయితే ఈ చిట్కా కోసం తేనె మాత్రమే వినియోగించినా సరిపోతుంది. ఇది పెదాలకు తేమనందిస్తే.. దానిమ్మ రసం వల్ల పెదాలకు గులాబీ మెరుపు వస్తుంది.

రంగు మారడానికి..

కొంతమంది పెదవులు నల్లగా కనిపిస్తాయి. అలాంటప్పుడు నిమ్మరసం, తేనె చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత తడిగా ఉన్న వస్త్రంతో తుడిచేసుకోవాలి. అనంతరం పెదాలకు పెట్రోలియం జెల్లీ లేదా లిప్‌బామ్ రాసుకోవాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల అధరాల రంగులో మార్పు కనిపిస్తుంది. దీంతో ముదురు వర్ణంలో ఉన్న పెదాలు లేలేత గులాబీ రంగులోకి మారడం గమనించవచ్చు.

స్క్రబ్ చేయాలి..

పొడిబారిన పెదాల చర్మంపై మృతకణాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి స్క్రబ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం.. పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, పెట్రోలియం జెల్లీ.. వంటివి చెంచా చొప్పున తీసుకోవాలి. మొదట ఒక బౌల్‌లో తేనె, పంచదార బాగా కలుపుకొని అందులో ఆలివ్ నూనె కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పెట్రోలియం జెల్లీ కూడా జత చేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కావాలనుకుంటే వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

ఈ మిశ్రమం కొద్దిగా తీసుకొని దాంతో పెదవులపై మృదువుగా మర్దన చేసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని వెంటనే లిప్‌బామ్ రాసుకోవాలి. ఫలితంగా నిర్జీవమైన పెదాలు మృదువుగా మారతాయి. అలాగే ఈ ప్రక్రియను వారానికి రెండుసార్లు చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది.

ఇలా కూడా..

⚛ విటమిన్ 'ఇ' నూనెతో పెదవులకు మృదువుగా మర్దన చేసుకోవాలి.

⚛ టూత్‌బ్రష్‌ని ఉపయోగించి పెదవుల చర్మంపై పేరుకొన్న మృతకణాలను ఎప్పటికప్పుడు నెమ్మదిగా రుద్దుతూ తొలగించుకోవాలి.

⚛ అధరాలకు పోషణ అందించే సహజసిద్ధమైన లిప్ మాస్క్‌లు, లిప్ బామ్‌లు ఉపయోగించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్