పాదాలు మెరవాలంటే..!

సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు.. వీటి గురించి పట్టించుకున్నంతగా పాదాల గురించి పట్టించుకోం. అందుకే ట్యాన్ పేరుకుపోయి అవి నల్లగా కనిపిస్తుంటాయి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి మేనిఛాయతో మెరవాలంటే.. కొన్ని సహజసిద్ధమైన ప్యాక్‌లను ఉపయోగించాలంటున్నారు నిపుణులు.

Published : 01 Mar 2024 13:24 IST

సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు.. వీటి గురించి పట్టించుకున్నంతగా పాదాల గురించి పట్టించుకోం. అందుకే ట్యాన్ పేరుకుపోయి అవి నల్లగా కనిపిస్తుంటాయి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి మేనిఛాయతో మెరవాలంటే.. కొన్ని సహజసిద్ధమైన ప్యాక్‌లను ఉపయోగించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..

పెరుగు..

పెరుగు ఆరోగ్యాన్ని కాపాడటానికే కాదు.. అందాన్ని సంరక్షించడానికీ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా శిరోజ సంరక్షణలోనూ, ఫేస్‌ప్యాక్స్‌లోనూ ఉపయోగిస్తారు. కానీ దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి. కొద్దిగా పెరుగు తీసుకొని దాన్ని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ చిట్కాను రోజు విడిచి రోజు పాటించడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు కాళ్లపై ఏర్పడిన పగుళ్లు సైతం తగ్గిపోతాయి. పాదాల చర్మానికి చక్కటి పోషణ కూడా అందుతుంది.

నిమ్మరసం

పాదాలపై ఏర్పడిన ట్యాన్‌ను నిమ్మరసం బాగా వదలగొడుతుంది. దీనిలోని ఆమ్లతత్వం మెలనిన్ శాతాన్ని తగ్గిస్తుంది. ఈ ఫలితం పొందడానికి కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో సరిపడా పంచదారను కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఇది స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీంతో పాదాలను కాసేపు మర్దన చేసుకొంటే సరిపోతుంది. ట్యాన్‌తో పాటు మృతకణాలు సైతం ఈ ప్యాక్ ద్వారా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగానూ తయారవుతుంది. ఈ ప్యాక్‌ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటే.. పాదాలపై ట్యాన్ పేరుకోకుండా కూడా జాగ్రత్తపడచ్చు. నిమ్మరసం, పంచదార మిశ్రమమే కాకుండా కొద్దిగా నిమ్మరసాన్ని పాదాలకు రాసి అరగంట సమయం ఆరనిచ్చిన తర్వాత కడిగేసినా ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకొంటే పాదాలు అందంగా కనిపిస్తాయి.

టొమాటో..

టొమాటోలో సహజసిద్ధమైన బ్లీచ్ గుణాలున్నాయి. ఇవి ట్యాన్ కారణంగా నల్లగా మారిన చర్మానికి పూర్వపు రంగుని తిరిగి అందిస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి టొమాటో రసాన్ని పాదాలకు రాసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే సరిపోతుంది. టొమాటోను ఉపయోగించి మరో చిట్కాను సైతం పాటించవచ్చు. టొమాటో ముక్కను తీసుకొని దానితో పాదాలపై కాసేపు రుద్దుకొని.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల త్వరలోనే ట్యాన్ వదిలిపోతుంది. అలాగే టొమాటో రసంలో కొద్దిగా చక్కెరను కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీంతో కాసేపు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సమయం ఆరనిచ్చి చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే.. పాదాలు అందంగా తయారవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్