రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత పిల్లలు పుడతారా?

రొమ్ము క్యాన్సర్‌.. ఒకప్పుడు ఇది కాస్త వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్న మహిళలూ ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేయడం ఆందోళన కలిగించే అంశం. అయితే దీని ప్రభావం ఆరోగ్యం పైనే కాదు.. సంతానోత్పత్తి పైనా పడుతుందని...

Published : 22 Oct 2022 16:07 IST

రొమ్ము క్యాన్సర్‌.. ఒకప్పుడు ఇది కాస్త వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్న మహిళలూ ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేయడం ఆందోళన కలిగించే అంశం. అయితే దీని ప్రభావం ఆరోగ్యం పైనే కాదు.. సంతానోత్పత్తి పైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో క్యాన్సర్‌ చికిత్స తర్వాత ఇక తాము గర్భం ధరించలేమేమో, అమ్మతనానికి దూరం కావాల్సిందేనేమోనన్న ఆందోళన చాలామంది మహిళల్లో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. అసలు క్యాన్సర్‌ చికిత్స తర్వాత సంతానం కలిగే అవకాశాలెంతవరకు ఉన్నాయి? గర్భం ధరించాలనుకునే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి అంశాలపై నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవిత కాలంలో ఏదో ఒక దశలో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే సాధారణ మహిళలతో పోల్చితే క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న మహిళల్లో సంతాన రేటు తక్కువేనని అంటున్నారు నిపుణులు. ఇందుకు ఆయా చికిత్సలు సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపడమే కారణమని చెబుతున్నారు.

చికిత్సల ప్రభావమెంత?

ఈ క్రమంలో కొన్ని రకాల చికిత్సలు సంతానోత్పత్తిపై తాత్కాలికంగా ప్రభావం చూపితే.. మరికొన్ని చికిత్సలు గర్భం దాల్చే పరిస్థితుల్ని క్లిష్టతరం చేస్తాయట!

⚛ రేడియేషన్‌ థెరపీలో భాగంగా.. గర్భాశయానికి రక్తాన్ని సరఫరా చేసే కణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల గర్భం దాల్చడం కష్టమవడంతో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా.. అబార్షన్‌ జరగడం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం.. వంటి ఇతరత్రా క్లిష్ట సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట!

⚛ ఇక కీమోథెరపీ వంటి చికిత్సలైతే ముందస్తు మెనోపాజ్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు.

⚛ ఎంత త్వరగా క్యాన్సర్‌ని గుర్తిస్తే అంత త్వరగా దీన్నుంచి కోలుకోవడమే కాదు.. భవిష్యత్తులో సంతానోత్పత్తి పైనా ప్రతికూల ప్రభావం అంతగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

⚛ సాధారణంగానే మహిళల వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గిపోతుంటుంది. 40 దాటిన మహిళలు క్రమంగా మెనోపాజ్‌కు చేరువవుతుంటారు. కాబట్టి క్యాన్సర్‌ చికిత్స, దాన్నుంచి కోలుకోవడానికి తీసుకునే సమయం, అప్పటి ఆరోగ్యం పైనే సంతానోత్పత్తి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.

ప్రత్యామ్నాయమూ లేకపోలేదు!

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకునే వారికి ‘అండ శీతలీకరణ పద్ధతి’ ఓ వరంగా పరిణమించిందని చెప్పచ్చు. అయితే రొమ్ము క్యాన్సర్‌ బాధితులూ ఈ పద్ధతి ద్వారా సంతానోత్పత్తి భాగ్యాన్ని పొందచ్చంటున్నారు నిపుణులు. అది కూడా క్యాన్సర్‌ చికిత్స తీసుకోవడానికి ముందే సాధ్యాసాధ్యాల గురించి డాక్టర్‌తో ఓసారి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇక చికిత్స ముగిశాక గర్భం ధరించడానికి కనీసం రెండేళ్ల గ్యాప్‌ ఇవ్వడం మంచిదంటున్నారు. ఎందుకంటే క్యాన్సర్‌ తిరిగి వచ్చే అవకాశం కాలక్రమేణా తగ్గుతుందని, ఈ మధ్యలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒకవేళ క్యాన్సర్‌ చికిత్స తర్వాత సుదీర్ఘ కాలం పాటు గర్భం దాల్చని పక్షంలో.. బిడ్డను దత్తత తీసుకోవడం వంటివి ఎంచుకోవచ్చు.
ఏదేమైనా సాధారణ మహిళలతో పోల్చితే.. రొమ్ము క్యాన్సర్‌ నుంచి బయటపడిన మహిళలు గర్భం దాల్చే క్రమంలో, గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు డాక్టర్‌ పర్యవేక్షణలో తగిన సలహాలు, సూచనలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. అప్పుడే ఇతర దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్