సంపూర్ణ సూర్య గ్రహణాలు చూడాలని.. ఖండాలు, మహా సముద్రాలు దాటుతోంది!

ఆకాశంలో ఏర్పడే గ్రహణాల్ని చూడాలని మనమెంతో ఆరాటపడుతుంటాం. అయితే వాటిని చూడడం అన్ని సందర్భాల్లోనూ వీలు పడకపోవచ్చు. ఎందుకంటే ఇవి అన్ని చోట్లా సంపూర్ణంగా కనిపించవు. అలాగని సంపూర్ణ గ్రహణాల్ని తిలకించాలని ఆయా దేశాలకూ వెళ్లలేం. కానీ లెటీసియా ఫెర్రర్‌ అలా కాదు.

Published : 08 Apr 2024 12:21 IST

ఆకాశంలో ఏర్పడే గ్రహణాల్ని చూడాలని మనమెంతో ఆరాటపడుతుంటాం. అయితే వాటిని చూడడం అన్ని సందర్భాల్లోనూ వీలు పడకపోవచ్చు. ఎందుకంటే ఇవి అన్ని చోట్లా సంపూర్ణంగా కనిపించవు. అలాగని సంపూర్ణ గ్రహణాల్ని తిలకించాలని ఆయా దేశాలకూ వెళ్లలేం. కానీ లెటీసియా ఫెర్రర్‌ అలా కాదు. సంపూర్ణ సూర్యగ్రహణం ఏ ఖండంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఏర్పడినా సరే.. అక్కడ వాలిపోతుంటుంది. ఆఖరికి సముద్రంలో నుంచి గ్రహణం పూర్తిగా కనిపిస్తుందంటే అక్కడికీ వెళ్లిపోతుంటుంది. ఇలా గ్రహణాన్ని కళ్లారా తిలకించడంతో పాటు.. ఎన్నో మధురానుభూతుల్నీ మూటగట్టుకుంటుంది. అక్కడితో ఆగకుండా.. సూర్య గ్రహణాలు, వాటి రహస్యాలపై అందరిలో అవగాహన కల్పించడానికి పాడ్‌కాస్ట్‌లు కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 8న ఏర్పడబోయే సూర్య గ్రహణాన్నీ తిలకించడానికి సిద్ధమైపోయిన ఈ సోలార్‌ ఎక్లిప్స్‌ లవర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

ఆ పాటే స్ఫూర్తి!

లెటీసియా అమెరికా నార్త్‌ టెక్సాస్‌లోని డాలస్‌లో నివసిస్తుంటుంది. మనలో చాలామందిలాగే ఆమెకూ సూర్యగ్రహణాల్ని చూడడమంటే మక్కువ. అయితే తన 12 ఏళ్ల వయసులో అమెరికన్‌ గాయని కార్లీ సిమన్‌ రాసి పాడిన ఓ పాట విన్నది లెటీసియా. ఆత్మాభిమానం, స్వీయ ప్రేమను స్పృశిస్తూ సాగే ఈ గీతం విని స్ఫూర్తి పొందింది. ఈ క్రమంలోనే మన ఇష్టాయిష్టాలకు, అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంత ముఖ్యమో గ్రహించిన ఆమె.. తన అభిరుచుల్నే తన కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సూర్య గ్రహణాల్ని చూడాలన్న కోరిక, వాటి రహస్యాల్ని తెలుసుకోవాలన్న ఆకాంక్షతో.. భవిష్యత్తులో ‘ఎక్లిప్స్‌ ఛేజర్‌’గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రోగ్రామ్‌ మేనేజర్‌ టు పాడ్‌కాస్ట్‌ హోస్ట్!

‘బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌-మేనేజ్‌మెంట్‌’లో డిగ్రీ పూర్తిచేసిన లెటీసియా.. పలు సంస్థల్లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా, ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేసింది. సూర్య గ్రహణాల్ని చూడాలన్న మక్కువ, ఖగోళ శాస్త్రంపై ఇష్టంతో గత కొన్నేళ్లుగా.. సూర్య గ్రహణాలపై అవగాహన పెంచే ‘టెక్సాస్‌ ఎక్లిప్సెస్‌’ సంస్థలో ఫ్రీలాన్సర్‌గా, సోలార్‌ ఎక్లిప్స్‌ కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోందామె. మరోవైపు ‘టోటాలిటీ టాక్స్‌’ పేరుతో సూర్య గ్రహణాలపై అవగాహన కల్పించే పాడ్‌కాస్ట్‌ షోను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఖగోళ శాస్త్రవేత్తలు, నిపుణులను ఇంటర్వ్యూ చేస్తూ.. విశ్వ రహస్యాల్ని, ఆసక్తికర అంశాల్ని అందరి ముందుంచుతోందీ ఎక్లిప్స్‌ లవర్.

ఏడు ఖండాలు దాటా..!

ప్రస్తుతం 63 ఏళ్లున్న లెటీసియా.. సంపూర్ణ సూర్య గ్రహణం ప్రపంచంలో ఏ మూలన ఏర్పడినా అక్కడ వాలిపోతుంటుంది. 1998 నుంచి నేటి వరకు మొత్తంగా 20 సంపూర్ణ సూర్య గ్రహణాల్ని తిలకించానంటోందామె.

‘చాలావరకు సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడేది కొన్ని నిమిషాలే! కానీ ఆ కొద్ది సమయం గ్రహణాన్ని చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోతా.. విశ్వంలో స్వేచ్ఛగా సంచరించిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. ఈ గ్రహణాల్ని చూసేందుకు ఏడు ఖండాల్ని, ఐదు మహా సముద్రాల్ని దాటాను. ఈ క్రమంలో ఒకసారి యూరప్‌, రెండుసార్లు ఆఫ్రికా, మూడుసార్లు ఆస్ట్రేలియా, రెండుసార్లు అంటార్కిటికా, మూడుసార్లు ఆసియా, కొన్నిసార్లు ఇండోనేషియాకూ వెళ్లాను. అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాల్లో నుంచి గ్రహణాల్ని తిలకించిన సందర్భాలూ నా జీవితంలో ఉన్నాయి. ఇక ఏప్రిల్‌ 8న ఏర్పడే సూర్య గ్రహణం ఉత్తర అమెరికాలో సంపూర్ణంగా కనిపించనుంది. దాన్నీ మిస్‌ కాను..’ అంటోన్న లెటీసియా.. ఇది తన 21 వ సూర్య గ్రహణంగా చెబుతోంది.

గ్రహణాలతో వయసును లెక్కిస్తూ..!

లెటీసియాకు సూర్య గ్రహణాలంటే ఎంత మక్కువో ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలే స్పష్టం చేస్తాయి. 2010లో తన మొదటి భర్త మరణించిన నెల రోజులకే దక్షిణ అమెరికా వెళ్లి అక్కడ ఏర్పడిన సూర్య గ్రహణాన్ని తిలకించిందామె. ‘నా భర్త తాను కన్న కలల్ని నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ నేను నా కలల్ని నెరవేర్చుకునే దాకా నిద్రపోను..’ అనే ఈ ఎక్లిప్స్‌ లవర్‌.. 2017లో గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడింది. అదే సమయంలో మరో చోట ఏర్పడిన సూర్య గ్రహణాన్ని తిలకించడానికి తన క్యాన్సర్‌ చికిత్సను కూడా వాయిదా వేసుకుంది. ప్రత్యేకమైన అద్దాలు, టెలిస్కోప్‌ సహాయంతో గ్రహణాల్ని ఆస్వాదిస్తానంటోన్న లెటీసియా.. గ్రహణాలతోనే తన వయసును లెక్కిస్తోంది. ఈ క్రమంలోనే గత 26 ఏళ్లలో 21 సూర్య గ్రహణాలు చూసిన లెటీసియా.. తన జీవితంలో 50వ సూర్య గ్రహణం చూడాలంటే మరో 40 ఏళ్లు అంటే.. 103 ఏళ్లు జీవించాలని చెబుతోంది. ప్రస్తుతం తన రెండో భర్తతో జీవిస్తోందీ ఎక్లిప్స్‌ లవర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్