పోషకాల.. స్వాగతమిదీ!

మనకు కొత్త సంవత్సరాది ఉగాది. వేరే రాష్ట్రాల్లో వేరే పేర్లతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారని తెలుసా? పోషకాలనిచ్చే ప్రత్యేక వంటలనీ సిద్ధం చేస్తారు. అవేంటో చూద్దాం రండి.

Published : 22 Mar 2023 00:13 IST

మనకు కొత్త సంవత్సరాది ఉగాది. వేరే రాష్ట్రాల్లో వేరే పేర్లతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారని తెలుసా? పోషకాలనిచ్చే ప్రత్యేక వంటలనీ సిద్ధం చేస్తారు. అవేంటో చూద్దాం రండి.

* తెలుగు నాట... తెలుగు లోగిళ్లలో.. ఉగాది నాడు ఉదయాన్నే స్నానం చేసి నూతనవస్త్రాలను ధరించి పాలు పొంగిస్తారు. ఆ తర్వాత బెల్లం, వేపపువ్వు, కొత్త చింతపండు, పచ్చిమిర్చి/ కారం, మామిడి, ఉప్పుతో ఉగాది పచ్చడి చేస్తారు. ఈ షడ్రుచుల సమ్మేళనంతో బోలెడు పోషకాలూ అందుతాయి. చింతపండు పులిహోర, మినప గారెలు, పూర్ణాలు చేస్తారు. భోజనంలో పులగమన్నం, వంకాయ పచ్చి పులుసు తప్పనిసరి. తెలంగాణలో భక్ష్యాలు/ పోలెలు, కట్టుచారు ప్రత్యేకంగా చేస్తారు.

* కర్ణాటకలో.. యుగాదిగా నిర్వహించుకునే ఈ పండగనాడు వేయించిన శనగపప్పు, బెల్లం, వేపపువ్వు, వేపాకులతో ‘బెవూ బెల్లా’ చేస్తారు. ఇంకా బొబ్బట్లు, చింతపండు, బెల్లం, కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి చేసే ఒబ్బట్టు సారు, మామిడన్నం ఇక్కడి ప్రత్యేకం!

* గోవాలో.. చైత్రమాసం మొదటి రోజును గుడీపడవాగా నిర్వహించుకుంటారు ఇక్కడి ప్రజలు. ఉదయాన్నే స్నానం చేసి మహిళలు ఇంటిముందు రంగవల్లికలు దిద్దుతారు. వాకిట్లో కుడివైపున ఒక వెదురుకర్ర చివర బంగారపు జరీ పసుపు వర్ణం వస్త్రాన్ని కడతారు. వేప, మామిడాకులు, పటికబెల్లం, పూలతో దీన్ని అలంకరించి పైన రాగిచెంబు తగిలిస్తారు. ఈ గుడీని శాలివాహన రాజు విజయానికి ప్రతీకగా కొలుస్తారు. వేపాకులు, బెల్లంతో చేసిన మిఠాయిలు తింటారు. పాయసం, పూరీ, కొబ్బరిపాలతో స్వీట్లు, శనగపప్పు, బెల్లంతో బొబ్బట్లు, పెరుగుతో శ్రీఖండ్‌ తయారుచేస్తారు. చిలగడదుంపలను ఈరోజు ప్రత్యేకంగా తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు, నూతన గృహప్రవేశం, వ్యాపారం ప్రారంభించడానికి ఈ రోజును శుభప్రదంగా భావిస్తారు.

* మహారాష్ట్రలో.. ఇక్కడా నూతన సంవత్సరాన్ని గుడీపడవా పేరుతో ఆహ్వానిస్తారు. ఇంటిముందు పూలు, రంగులతో రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. నదీస్నానానికి ఈరోజున ప్రాధాన్యమిస్తారు. వాకిట్లో గుడీ తయారుచేసి పూజిస్తారు. నూతన వస్త్రాలను ధరించి ఆలయాలను సందర్శిస్తారు. వేపాకులు, బెల్లంతో స్వీటు, బొబ్బట్లు, శ్రీఖండ్‌, సగ్గుబియ్యం పాయసం, వడలు, కిచిడీ చేస్తారు. ఒకరికొకరు కానుకలిచ్చి పుచ్చుకోవడం ఈ పండగ ప్రత్యేకత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్