ఉన్ని దుస్తులు శుభ్రం చేయండిలా
close
Updated : 29/11/2021 16:59 IST

ఉన్ని దుస్తులు శుభ్రం చేయండిలా!

అసలే శీతాకాలం.. చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు బీరువాలకే పరిమితమైన స్వెట్టర్లు, శాలువాలు.. ఇక బయటకు తీయాల్సిందే! అలా ఉన్ని దుస్తులు ఉపయోగించే క్రమంలో వాటికి ఏమాత్రం మరకలైనా లేదా మాసినట్లు కనిపించినా వెంటనే వాటిని ఉతికేస్తూ ఉంటారు. అయితే వాటిని అన్ని దుస్తులతో కలిపి కాకుండా విడిగా శుభ్రపరచాల్సి ఉంటుంది. అలాగే ఉతికే విధానం కూడా వేరేగా ఉంటుంది. మరి, అదెలాగో మనం కూడా ఓసారి తెలుసుకుందాం రండి..

ఎండలో వేయాలి...

మిగిలిన దుస్తులతో పోలిస్తే.. ఉన్ని దుస్తులను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎక్కువ రోజులు దాచి ఉంచడం వల్ల వాటి నుంచి అదో రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఉన్ని దుస్తులను భద్రపరిచే ముందే ఉతుకుతాం కాబట్టి.. వాటిని ఒకసారి ఎండలో వేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన పోతుంది. అలాగే వాటిలో ఏమైనా క్రిములు చేరితే అవి కూడా నశించే అవకాశం ఉంటుంది.

విడిగా ఉతకాలి...

ఉన్ని దుస్తులను మిగిలిన వాటితో కలిపి ఉతకడం మంచిది కాదు. ఎందుకంటే అవి ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని విడిగా శుభ్రం చేయాలి. దీనికోసం ఉన్ని దుస్తులను చన్నీళ్లలో పూర్తిగా మునిగేలా ఉంచాలి. కొంతమంది బాగా శుభ్రపడతాయనే ఉద్దేశంతో ఉన్ని దుస్తులను గంటల తరబడి డిటర్జెంట్‌ పౌడర్‌లో నానబెడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఉన్ని త్వరగా పాడైపోతుంది. డిటర్జెంట్‌ పౌడర్‌ కలపని నీటిలో మాత్రమే వాటిని కొద్దిసేపు నాననివ్వాలి.

ఎక్కువ రుద్దకూడదు..

ఉన్ని దుస్తులపై ఏవైనా మరకలు ఉన్నట్లైతే కొంతమంది వాటిని బాగా రుద్దేస్తూ ఉంటారు. దీనివల్ల మరక పోవడం సంగతి పక్కన పెడితే దుస్తులు పాడైపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఉన్ని దుస్తులు పూర్తిగా నానిన తర్వాత ఉప్పు, డిష్‌వాష్‌ లిక్విడ్‌, వెనిగర్‌.. మొదలైనవి ఉపయోగించి రుద్దితే సరిపోతుంది. ఇలా రుద్దిన తర్వాత ఒకసారి నీటిలో ముంచి తీస్తే సరి.

ఆ డిటర్జెంట్‌ వద్దు..

చాలామంది సాధారణ వస్త్రాలను ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్‌నే ఉన్ని దుస్తులను ఉతకడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ వాటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతాయి. అవి ఉపయోగిస్తే.. ఉన్ని నాణ్యత తగ్గకుండా ఉంటుంది. ఒకవేళ అవి అందుబాటులో లేనట్లయితే బేబీషాంపూని సైతం ఉపయోగించవచ్చు. చల్లటి నీటిలో బేబీషాంపూ కలిపి వాటితో ఉన్ని దుస్తులు ఉతికితే అవి శుభ్రపడడంతో పాటు.. వాటి నాణ్యత కూడా దెబ్బతినకుండా ఉంటుంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని