పాపాయికి ఎక్కిళ్లు వస్తుంటే..!

పసిపిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా, వారు ఏ విషయంలో ఇబ్బంది పడినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అసలు వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కొత్తగా తల్త్లెన మహిళలది!

Published : 08 Jan 2024 12:25 IST

పసిపిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా, వారు ఏ విషయంలో ఇబ్బంది పడినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అసలు వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కొత్తగా తల్త్లెన మహిళలది! అందుకే బుజ్జాయిల్ని అనుక్షణం ఎంతో జాగ్రత్తగా, కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లులు. ఈ క్రమంలో కొంతమంది అమ్మలు వారి చిన్నారులకు ఎక్కిళ్లు వచ్చినా తట్టుకోలేరు. ఇంత చిన్న పాపాయికి కూడా ఎక్కిళ్లు వస్తాయా? అంటూ సందేహిస్తారు. అయితే పుట్టినప్పటి నుంచి ఏడాది వయసొచ్చే వరకు చిన్నపిల్లల్లో ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పిల్లల వైద్య నిపుణులు.

బర్పింగ్ చేయాలి!

అది బాటిల్ ఫీడింగ్ అయినా, తల్లిపాలు తాగినా.. ఇలా పిల్లలు పాలు తాగే క్రమంలో పొట్టలోకి కాస్త గ్యాస్ వెళ్లడం కామనే. పొట్టలో గ్యాస్ ఎక్కువ కావడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని బయటికి పంపించడానికి చిన్నారులు పాలు తాగే క్రమంలో మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ బర్పింగ్ (పాపాయిని కూర్చోబెట్టి నెమ్మదిగా వెన్ను పైనుంచి కింది దాకా తట్టడం) చేయమని సూచిస్తున్నారు. తద్వారా ఎక్కిళ్లు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. బాటిల్ ఫీడింగ్ ఇస్తున్న పాపాయికి నాలుగు టేబుల్‌స్పూన్ల పాలు తాగాక గ్యాప్ ఇస్తూ.. ఆ మధ్యలో కాసేపు బర్పింగ్ చేయాలని, ఇక నేరుగా తల్లిపాలు తాగే చిన్నారులు ఒక రొమ్ములోని పాలు తాగడం పూర్తయ్యాక కాసేపు బర్పింగ్ చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇలా బర్పింగ్ చేసిన తర్వాత నెమ్మదిగా వెన్నులో పైనుంచి కింది దాకా రాయాలి. తద్వారా వారికి పొట్టలోని గ్యాస్ బయటికి వెళ్లిపోయి కాస్త ఉపశమనం కలుగుతుంది.

ప్యాసిఫయర్‌తో...

పాలు తాగే క్రమంలో పొట్టలోకి వెళ్లే గ్యాస్ కారణంగా చిన్నారులందరిలో ఎక్కిళ్లు రావని, కొంతమంది పిల్లల్లో ఎక్కువగా నవ్వడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. అయితే ఇలాంటప్పుడు వారి నోట్లో ప్యాసిఫయర్ (తేనెపీక) పెట్టడం వల్ల డయాఫ్రమ్ రిలాక్సయి తద్వారా నెమ్మదిగా ఎక్కిళ్లు తగ్గే అవకాశముందని వారంటున్నారు.

బాటిల్ చెక్ చేయండి!

చిన్నారుల్లో తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయంటే వారు పాలు తాగే బాటిల్‌ను కూడా ఓసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు తాగే బాటిల్ ద్వారా గాలి ఎక్కువగా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా ఈ సమస్య పదే పదే ఎదురవుతుంటుంది. కాబట్టి చిన్నారులకు నేరుగా తల్లిపాలు పట్టించడం.. అలా వీల్లేని పక్షంలో నాణ్యమైన బాటిల్‌ని ఉపయోగించడం మంచిది. తద్వారా ఎక్కిళ్ల సమస్య చిన్నారుల్ని వేధించకుండా జాగ్రత్తపడచ్చు.

ఎంతకీ తగ్గట్లేదా?

కొంతమంది చిన్నారుల్లో ఎక్కిళ్లు వచ్చిన కాసేపటికి వాటంతటవే తగ్గిపోవడం గమనిస్తుంటాం. అలాకాకుండా ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే గనుక వారిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే కొందరు పిల్లల్లో కొన్ని ఆరోగ్య సమస్యలుంటే కూడా ఎక్కిళ్లు వస్తాయంటున్నారు పిల్లల వైద్యులు. కాబట్టి వాటంతటవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయకుండా పదే పదే ఎక్కిళ్లు వచ్చినా, ఎక్కువసేపు తగ్గకుండా చిన్నారుల్ని ఇబ్బంది పెట్టినా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

ఈ చిట్కాలు సైతం..

చిన్నారుల్లో ఎక్కిళ్లు రాకుండా ఉండడమనేది జరగకపోవచ్చు.. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వచ్చే అవకాశం తక్కువగా ఉందంటున్నారు వైద్యులు.

⚛ చిన్నారికి బాగా ఆకలేసినప్పుడే పాలు పట్టడం లేదా పాలివ్వడం.

⚛ పాలు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు పట్టడం.

⚛ పాలు పట్టాక పాపాయిని కొద్దిసేపు నిటారుగా కూర్చోబెట్టడం.

⚛ బాటిల్ ఫీడింగ్ అయితే బాటిల్ నిపుల్ పూర్తిగా బేబీ నోట్లో ఉండేలా చూసుకోవడం.. అలాగే వారికి పాలు అందుతున్నాయా లేదా గమనించడం.

ఒకవేళ ఏం చేసినా ఎక్కిళ్లు తగ్గకపోతే మాత్రం వెంటనే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిదన్న విషయం గుర్తుంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్