Published : 18/11/2022 12:45 IST

లవ్‌ చేస్తోంది.. బ్రేకప్‌ అంటోంది..!

మా అమ్మాయి ఎంటెక్‌ చదివింది. ఉద్యోగం చేస్తోంది. బీటెక్‌ చదువుతున్న సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించింది. కొన్ని రోజుల తర్వాత బ్రేకప్‌ అయ్యిందని చెప్పింది. ఇలాంటి ప్రేమలు వద్దు.. మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోమని గట్టిగా చెప్పాం. కానీ, తను మా మాట వినడం లేదు. ‘మీరు చూసిన సంబంధం చేసుకోను.. ప్రేమ వివాహమే చేసుకుంటాను’ అంటోంది. ఆ తర్వాత కూడా ఒక అబ్బాయిని ప్రేమించి అతడితోనూ విడిపోయింది. తన భవిష్యత్తు గరించి చాలా ఆందోళనగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటోంది. కానీ, ఏ ప్రేమనూ పెళ్లి వరకు తీసుకురావడం లేదు. బంధువుల్లో మా అమ్మాయి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. తనకి ఎలా చెబితే మా మాట వింటుంది. అసలు తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? దయచేసి మా అమ్మాయిని పెళ్లికి ఒప్పించే మార్గం చెప్పండి. - ఓ సోదరి

జ. మీ అమ్మాయి మీరు చూసిన సంబంధానికి ఒప్పుకోవడం లేదు. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. అంతేకాదు.. తను ఎప్పుడు ఎవరితో ప్రేమలో ఉంటుందో కూడా తెలియడం లేదని రాసుకొచ్చారు. కాబట్టి, మొదట మీ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకోసం ఒక సైక్రియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వారు ఇన్‌సైడ్‌ డెవ లప్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ థెరపీ చేసి.. అసలు మీ అమ్మాయి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎటువంటి వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటోంది? తను ప్రేమించిన అబ్బాయితో ఎక్కువ కాలం ఎందుకు ఉండలేకపోతోంది? తనకు వ్యక్తిత్వపరమైన సమస్యలు ఏవైనా ఉన్నాయా? వంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా అసలు సమస్యను కనుగొని పరిష్కార మార్గాలను వెతికే అవకాశం ఉంటుంది.  మీ అమ్మాయి అసలు సమస్య ఏమిటో తెలుసుకుని దానిని పరిష్కరించకపోతే రేపు ఒకవేళ పెళ్లయినా ఇలాంటి సమస్యలే వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడే మానసిక నిపుణుల సహకారంతో తన వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, సమస్య ఏమిటో తెలుసుకుని, దానికి పరిష్కార మార్గాలు వెతకడం అన్ని విధాలుగానూ మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని