ఆమె ఉద్యమించింది

ఒక బిడ్డను కనాలా?... వద్దా? అది ఆమె చేతుల్లో లేదు..! ముసుగు వేసుకోవాలా, వద్దా ? నిర్ణయించేది వేరొకరు! ఇవే కాదు.. చాలా విషయాల్లో మానవ హక్కులు వేరుగా... మహిళల హక్కులు వేరుగా ఉంటున్నాయి.

Published : 28 Dec 2022 01:13 IST

ఒక బిడ్డను కనాలా?... వద్దా? అది ఆమె చేతుల్లో లేదు..! ముసుగు వేసుకోవాలా, వద్దా ? నిర్ణయించేది వేరొకరు! ఇవే కాదు.. చాలా విషయాల్లో మానవ హక్కులు వేరుగా... మహిళల హక్కులు వేరుగా ఉంటున్నాయి. ఆ అణచివేతకు.. వివక్షకు వ్యతిరేకంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక స్త్రీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇంకా సాగుతున్నవి కొన్ని..

ణచివేత ఎంత బలంగా ఉంటే... ప్రతిఘటనా అంతే బలంగా ఉంటుంది. ఇరాన్‌లో ఈ ఏడాది ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాలు దీన్నే తేటతెల్లం చేశాయి. 22 ఏళ్ల మహ్సాఅమినీ మరణం ఈ ఉద్యమానికి ఊపిరులూదింది. హిజాబ్‌ సరిగా వేసుకోలేదన్న కారణంతో నైతిక పోలీసుల చేతిలో మరణించిన మహ్సా ఓ సాధారణ అమ్మాయి. కానీ ఆమె స్ఫూర్తి.. ప్రపంచ దేశాలనే కదిలించింది. కోట్లాది అమ్మాయిలు ఆమెకు మద్దతుగా.. ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా రోడ్లపై హిజాబ్‌లని తగులబెట్టారు. జుట్టు కత్తిరించుకున్నారు. నృత్యాలు చేసి.. వ్యతిరేకతని తెలిపారు. 8 కోట్ల మంది మహిళలు హ్యాష్‌ అమినీ టాగ్‌తో ‘విమెన్‌ లైఫ్‌ ఫ్రీడమ్‌’ పేరుతో కదం తొక్కి, టైమ్‌ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రభావిత ఉద్యమాల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

నెలల తరబడి సాగిన ఈ ఉద్యమ తీవ్రతకి దిగివచ్చిన ప్రభుత్వం... మొరాలిటీ పోలీస్‌ వ్యవస్థను రద్దు చేసింది. ఇది చిన్న విజయమే. అయినా ఆ స్ఫూర్తితో మరిన్ని మార్పుల కోసం పోరాటం సాగుతూనే ఉంది...

చదువుకోసం...

అమ్మమ్మ.. అమ్మ.. అమ్మాయి... సాధారణంగా అమ్మమ్మ తరంతో పోలిస్తే నేటితరం అమ్మాయికి హక్కులపరంగా బోలెడు వెసులుబాట్లు ఉండాలి కదా? కానీ అప్ఘనిస్థాన్‌లో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. కొత్తగా వచ్చిన తాలిబన్‌ ప్రభుత్వం... ‘అమ్మాయిలకు యూనివర్సిటీ చదువులు వద్దు, హైస్కూల్‌ మూసేయండి, మగతోడు లేకుండా బయటకు వెళ్లొద్దు’ వంటి ఆంక్షలు విధించడంతో అక్కడి స్త్రీల పరిస్థితి దశాబ్దాల వెనక్కి వెళ్లినట్టయింది. దాంతో ఉద్యమిస్తే ప్రాణాలమీదకు వస్తుందని తెలిసినా కాబూల్‌లోని స్త్రీలంతా ఏకమై ‘బడులు తెరవండి’ అంటూ నినదిస్తున్నారు.

సురక్షిత గర్భస్రావం కోసం

కొన్ని దేశాల్లో గర్భస్రావాలపై కఠినమైన నిబంధనలున్నాయి. తల్లి ప్రాణాలమీదకు వచ్చినా, అది అత్యాచారం వల్ల కలిగిన బిడ్డ అయినా కూడా సడలింపులు ఇవ్వడానికి వెనుకాడే దేశాలూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే.. ఏ నిబంధనలూ లేని దేశాల్లో ఎన్ని అబార్షన్లు జరుగుతున్నాయో .. కఠిన నిబంధనలు ఉన్న దేశాల్లోనూ అన్నే జరుగుతున్నాయని బ్రిటన్‌ అధ్యయనం చెబుతోంది. కాకపోతే ఇవేమీ చట్టపరంగా జరగవు. అనుమతుల్లేని ఆసుపత్రుల్లో అసురక్షిత పద్ధతుల్లో చేయడం వల్ల తల్లుల ప్రాణాలమీదకి వస్తోంది. ఏటా 2.5 కోట్ల గర్భస్రావాలు జరుగుతుంటే అందులో 13 శాతం మంది స్త్రీలు మరణిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని పోలాండ్‌, ఎల్‌సాల్వడార్‌ వంటి దేశాల స్త్రీలు ఉద్యమించారు. ప్రస్తుతానికి ఈఏడాది కొలంబియా, మెక్సికో, అర్జెంటీనా, భారత్‌ వంటి దేశాల్లో సురక్షిత గర్భస్రావాల విషయంలో స్త్రీలకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి.


ఇంటిపనికి ‘విలువ’లేదా?

వంట, పిల్లల్ని చూడటం.. ఇవన్నీ ఆడవాళ్ల బాధ్యతలుగా మాత్రమే చూస్తాం. ఆ పనికి ‘విలువ’ కట్టమంటే మాత్రం మనసొప్పదు.  ప్రపంచ వ్యాప్తంగా రోజూ 16.4 బిలియన్ల గంటలని ఆడవాళ్లు విలువ కట్టని పని కోసం వెచ్చిస్తున్నారు. దీనికి విలువ కనుక కడితే అది ప్రపంచ ఎకానమీలో పదోవంతుకు సమానం అని ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ చెబుతోంది. స్త్రీ, పురుష వివక్ష పెరగడానికి ఈ ‘అన్‌ పెయిడ్‌ కేర్‌ వర్క్‌’ కూడా కారణమే అంటారు బ్రిటన్‌ మహిళలు. తల్లైన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాలు, సంస్థల వైఖరికి నిరసనగా ‘మార్చ్‌ ఆఫ్‌ మమ్మీస్‌’ పేరుతో పెద్దఎత్తున ఉద్యమించారు. నైజీరియా రచయిత్రి నాగోజీ, బ్రిటన్‌కు చెందిన కేట్‌క్విల్టన్‌ నాయకత్వంలో.. ఉద్యోగ వేళలు, మాతృత్వ సెలవుల విషయాల్లో వెసులుబాట్ల కోసం గళం విప్పారు. స్త్రీ, పురుష బాధ్యతలు భిన్నంగా ఉన్నప్పుడు పని వేళలూ వాళ్లకు అనుకూలంగా ఉండాలనీ, తల్లుల బాధ్యతలకి విలువ కట్టాలని ఉద్యమించారు. దాంతో ప్రభుత్వం ప్రసవానంతర పనివేళలు, సెలవుల విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఇది ఇతర దేశాల్లోనూ స్ఫూర్తి రగిలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్