‘జీరో వేస్ట్‌ పార్టీలే’.. ఆమె వ్యాపార సూత్రం!

వేడుకలంటే అలంకరణ తర్వాత గుర్తొచ్చేది.. క్యాటరింగ్‌, కట్లరీ సెక్షన్లే! వంటలంటే ఎలాగూ ఆర్డర్‌ ఇచ్చేస్తే.. వేదిక వద్దకే వచ్చేస్తాయి. ఇక వడ్డించడానికి ఉపయోగించే సామగ్రి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ఉందిగా అని నిశ్చింతగా ఉంటాం. నిజానికి దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం....

Updated : 14 Jul 2023 17:48 IST

వేడుకలంటే అలంకరణ తర్వాత గుర్తొచ్చేది.. క్యాటరింగ్‌, కట్లరీ సెక్షన్లే! వంటలంటే ఎలాగూ ఆర్డర్‌ ఇచ్చేస్తే.. వేదిక వద్దకే వచ్చేస్తాయి. ఇక వడ్డించడానికి ఉపయోగించే సామగ్రి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ఉందిగా అని నిశ్చింతగా ఉంటాం. నిజానికి దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లుతుందని ఆలోచించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. హైదరాబాద్‌కు చెందిన నిదర్శన సైకియాదాస్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రకృతి ప్రేమికురాలైన ఆమె.. ‘జీరో వేస్ట్‌ పార్టీ’లే లక్ష్యంగా ఓ సామాజిక స్టార్టప్‌ను ప్రారంభించింది. అలంకరణ దగ్గర్నుంచి విందు పూర్తయ్యే దాకా.. అడుగడుగునా పర్యావరణహితానికి ప్రాధాన్యమిస్తూ ఎకో వారియర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘వేడుకలంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయడం కాదు.. మధురానుభూతుల్ని కూడగట్టుకోవడం..’ అంటోన్న నిదర్శన.. తన ఎకో-ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకుంది.

నేను పుట్టి పెరిగింది అసోంలో. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగస్థులు కావడంతో.. ఎక్కువగా గ్రాండ్‌పేరెంట్స్‌ పర్యవేక్షణలోనే పెరిగాను. స్కూలుకు సెలవులొస్తే చాలు.. తాతయ్యకు కిచెన్‌ గార్డెన్‌లో, పశువుల పెంపకంలో సహాయపడేదాన్ని. ఈ క్రమంలోనే కంపోస్టింగ్‌, ప్రకృతితో గడపడం నేర్చుకున్నా. దిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ ఆనర్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశాక.. మార్కెటింగ్‌ రంగంలో 13 ఏళ్ల పాటు పనిచేశా.

చెత్త డబ్బా చూశాకే..!

చిన్నతనం నుంచి నేను పెరిగిన వాతావరణం నన్ను పర్యావరణ ప్రేమికురాలిగా మార్చేసింది. ఈ క్రమంలోనే నేను వేసే ప్రతి అడుగూ పర్యావరణహితంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకునేదాన్ని. ఇక ఇంట్లో జరిగే పార్టీలు, బయట వేడుకల్లో పాల్గొన్నప్పుడు.. ఎంజాయ్‌ చేయడం అటుంచితే.. వాడి పడేసే వ్యర్థాలు నిండిన చెత్తడబ్బా పైకే నా దృష్టి మళ్లేది. వాటి వల్ల పర్యావరణానికి ఎంత నష్టమో ఆలోచిస్తుంటే నా మనసు కకావికలమైపోయేది. ఎలాగైనా ఈ చెత్తకు అడ్డుకట్ట వేయాలనిపించింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడే ‘కమ్యూనిటీ యుటెన్సిల్‌ బ్యాంక్‌’ ఐడియా తట్టింది. వెంటనే దీన్ని మా గేటెడ్‌ కమ్యూనిటీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశా. చాలామంది నుంచి సానుకూల స్పందన వచ్చింది. మా కమ్యూనిటీకి చెందిన నా స్నేహితురాలు, ఐటీ ఉద్యోగిని అయిన మధుమిత సుబ్రమణియమ్‌ నాతో జత కలిసింది. అలా ఇద్దరం కలిసి 2019లో ‘ది బార్టన్‌ కంపెనీ’ పేరుతో ‘పర్యావరణహిత పాత్రల బ్యాంకు’ను ప్రారంభించాం. ఆపై కొన్ని నెలలకు మా గేటెడ్‌ కమ్యూనిటీకి చెందిన సుశోమా నాగరాజ్‌, రీనా జార్జ్‌లు కూడా మాతో చేతులు కలిపారు. పార్టీల్లో, వేడుకల్లో జీరో వేస్ట్‌ పద్ధతుల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడడమే మా సంస్థ ముఖ్యోద్దేశం!

ఆద్యంతం.. ‘జీరో వేస్ట్‌’ సూత్రం!

అది ఏ ఈవెంట్‌ అయినా సరే.. అలంకరణ దగ్గర్నుంచి విందు భోజనం దాకా.. ప్రతిదీ జీరో వేస్ట్ పద్ధతిలో చేయడమే మా లక్ష్యం. మా సామాజిక సంస్థ వేదికగా ఆయా వేడుకల కోసం స్టీలు సామగ్రిని అద్దెకిస్తున్నాం. ఈ క్రమంలో టిఫిన్ ప్లేట్లు, భోజనం చేసే ప్లేట్స్‌, టంబ్లర్స్‌, గ్లాసులు, బౌల్స్‌, స్పూన్లు, ఫోర్కులు.. ఇలా అన్నీ స్టీలువే సప్లై చేస్తున్నాం. ఇక వేడుక జరిగే ప్రదేశంలో కోకోపీట్‌ మిశ్రమంతో కూడిన కంపోస్ట్‌ బిన్స్‌ ఏర్పాటుచేస్తాం. తడి వ్యర్థాల్ని అందులో వేసి కంపోస్టింగ్‌ చేయడం లేదంటే బయోగ్యాస్‌ ప్లాంట్‌కి పంపించడం.. పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేయడం.. తిరిగి ఉపయోగించుకునే వాటిని శుభ్రం చేసి.. భద్రపరచడం.. వంటివీ చేస్తున్నాం. ఇక ఆయా స్టీలు పాత్రలు/సామగ్రిని వేడుకల కోసం అద్దెకిచ్చే ముందు కూడా ప్రత్యేక పద్ధతుల్లో శానిటైజ్‌ చేసి అందిస్తున్నాం. అయితే ఇక్కడితో మా పని పూర్తైందని చేతులు దులుపుకోకుండా.. పార్టీ/వేడుక ఆద్యంతం పూర్తి పర్యావరణహితంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో.. అలంకరణ, వేడుక జరిగే ప్రదేశం, క్యాటరింగ్‌.. తదితర విషయాల్లోనూ ఆయా నిర్వాహకుల్ని ఓ రోజు ముందే సంప్రదించి.. వారు పర్యావరణహిత వస్తువులు ఉపయోగించేలా వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నాం.

అవగాహన కల్పిస్తూ..

అయితే పర్యావరణహితంగా వేడుకలు చేసుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ దీంతో ఏకీభవించకపోవచ్చు. అలాగే వేడుకకు హాజరయ్యే కొందరు అతిథులకూ ఇది నచ్చకపోవచ్చు. ఈ క్రమంలో ఆయా వేడుకల నిర్వహణకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి ముందే వాళ్ల ఇంట్లో వాళ్లను కలిసి మాట్లాడుతున్నాం. పర్యావరణహిత వేడుకలు, ఎకో-ఫ్రెండ్లీ కట్లరీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల్ని వారికి వివరిస్తున్నాం. ఇక వేడుకల సమయంలో వచ్చే అతిథులకూ ప్రత్యక్షంగా దీనిపై అవగాహన పెంచుతున్నాం. ప్రస్తుతం పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, మారథాన్లు.. వంటి ఈవెంట్లు పర్యావరణహితంగా జరిగేలా మా సంస్థ పలువురినీ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో 50-5000 మంది దాకా ఆతిథ్యం అందించే సామర్థ్యం మాకుంది.

ఇలా వేడుకల్లోనే కాదు.. వివిధ అంశాల్లో పర్యావరణహిత ఎంపికలపై అవగాహన పెంచడంలో భాగంగా.. కాలేజీలు, స్కూళ్లు, కార్పొరేట్‌ కంపెనీల్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 50కి పైగా వర్క్‌షాప్స్‌ నిర్వహించి.. ఇంట్లో పాటించే కంపోస్టింగ్ పద్ధతులు; పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రత్యేకించి మహిళలు నెలసరి సమయంలోను, జీవనశైలిలోను పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన  కల్పించాం. మరోవైపు ‘జీరో వేస్ట్‌ మోడల్‌ విలేజ్‌’లే లక్ష్యంగా పలు ప్రముఖ సంస్థలతోనూ కలిసి పని చేస్తున్నాం.

గిఫ్ట్‌లు.. ఎకో ఫెస్ట్‌లూ!

కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ కూడా మా సంస్థ కార్యకలాపాల్లో ఒకటి. కరోనా సమయంలో మొదలుపెట్టిన ఈ సేవల్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాం. అలాగే గేటెడ్‌ కమ్యూనిటీల్లో ‘మ్యాటీ ఎకో ఫెస్ట్‌’ పేరుతో జీరో వేస్ట్‌ ఈవెంట్లు కూడా నిర్వహిస్తుంటాం. ఇందులో భాగంగా.. ‘ఫ్లీ మార్కెట్‌’ (పర్యావరణహిత పద్ధతుల్లో తయారుచేసిన హస్తకళా ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌), ‘ఫుడ్‌ స్టాల్స్‌’ (చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలు, వీగన్‌ వంటకాల ప్రదర్శన), పిల్లలు-పెద్దలకు ‘క్రాఫ్ట్‌ సెషన్స్‌’, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ‘బృంద చర్చలు’.. వంటివెన్నో చేస్తున్నాం. ఇలాంటి ఫెస్ట్‌లు ఇప్పటివరకు ఆరు చోట్ల నిర్వహించాం.. త్వరలోనే మరొకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఇక మా వెబ్‌సైట్‌ వేదికగా.. దేశవ్యాప్తంగా ఉన్న చేతి వృత్తి కళాకారులు, పర్యావరణహితంగా మహిళలు తయారుచేసిన గృహాలంకరణ వస్తువుల్నీ విక్రయిస్తున్నాం. పర్యావరణహితంగా వేడుకలు చేసుకోవాలనుకునే కస్టమర్లు.. వీటిలో నుంచి కూడా వాళ్ల ఈవెంట్‌కు ఉపయోగపడే వస్తువులు, కట్లరీ ఐటమ్స్‌ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మా కట్లరీ బ్యాంకు ఉంది. త్వరలోనే ముంబయి, చెన్నైల్లోనూ కట్లరీ బ్యాంకులు తెరవబోతున్నాం. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈవెంట్లు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే పబ్లిక్‌ ఈవెంట్లూ ఎకో-ఫ్రెండ్లీగా చేయాలన్న ఆలోచన ఉంది.

మావారి ప్రోత్సాహంతో..!

సమాజంలో మార్పు తీసుకురావాలంటే.. ముందు ఇంటి నుంచి మార్పు మొదలవ్వాలంటారు. ప్రస్తుతం నేనూ ఇదే చేస్తున్నా. ఇంట్లో పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీ అలవాట్లను పాటిస్తుంటా. వృథాను తగ్గించి చెత్తను కంపోస్ట్‌ చేయడం, రీసైక్లింగ్‌ చేసుకోవడంతో పాటు వృథాను తగ్గిస్తూ, వాతావరణానికి మేలు చేసే వస్తువుల్నే కొంటాను. ఇక నా ఆశయం కోసం నా కార్పొరేట్‌ కెరీర్‌ ఉన్నత దశలో ఉన్నప్పుడే ఉద్యోగం మానేశాను. ఆ సమయంలో మావారు నా ఆసక్తిని గుర్తించి నన్ను ప్రోత్సహించారు. మాకు ఇద్దరబ్బాయిలు. వాళ్లూ నాలాగే పర్యావరణ ప్రేమికులు. నెలకోసారి పచ్చటి పంట పొలాల మధ్య గడపడం.. ఏడాదికోసారి అడవులు, గ్రామీణ ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లడం మాకు అలవాటు. పిల్లలు ఇలాంటి పర్యటనలతో వారి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్