తమ స్టార్టప్‌తో.. గుండె లయకు అండగా..!

లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌.. ఇది మన జీవన లయ. అదుపులో ఉన్నంతవరకు సరే.. కానీ వివిధ ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల ఒక్కోసారి ఇది దెబ్బతింటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. పరిస్థితి చేయి దాటాక పరిష్కారం కోసం చూస్తే ఏం ప్రయోజనం? అందుకే క్షణక్షణం గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించే.....

Updated : 03 Dec 2022 18:14 IST

లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌.. ఇది మన జీవన లయ. అదుపులో ఉన్నంతవరకు సరే.. కానీ వివిధ ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల ఒక్కోసారి ఇది దెబ్బతింటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. పరిస్థితి చేయి దాటాక పరిష్కారం కోసం చూస్తే ఏం ప్రయోజనం? అందుకే క్షణక్షణం గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించే పరికరాన్ని తమ స్టార్టప్ ద్వారా అభివృద్ధి చేశారు హైదరాబాద్‌కు చెందిన అపర్ణ భోగు దంపతులు. గుండె లయను నిరంతరం మానిటర్‌ చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఇతర సమస్యల్ని సైతం పసిగడుతూ హృద్రోగుల గుండెకు కొండంత అండగా నిలుస్తోన్న తమ పరికరం గురించి, తమ వ్యాపార ప్రస్థానం గురించి ప్రత్యేకంగా ‘వసుంధర.నెట్‌’తో పంచుకున్నారు అపర్ణ.

మాది హైదరాబాద్‌. ముంబయిలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక.. యూఎస్‌లోని కార్నగీ మెలన్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మాస్టర్స్‌ చదివాను. ఏడేళ్ల పాటు అక్కడే వివిధ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేశాను. అయితే నాకు చిన్న వయసు నుంచే వ్యాపారం ప్రారంభించాలన్న తపన ఉండేది. ఉద్యోగం బిజీలో పడిపోయి నా లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానేమో అనిపించింది. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబంతో కలిసి భారత్‌కు తిరిగొచ్చేశా.

ఆలోచన పుట్టిందలా..!

అవసరమే ఆలోచనకు బీజం వేస్తుందంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. ఓ రోజు మావారి తాతగారు వాకింగ్‌ చేస్తూ కళ్లు తిరిగి పడిపోయారు. గుండె లయ దెబ్బతినడమే ఇందుకు కారణమని పరీక్షల్లో తెలిసింది. కొంతమంది విషయంలో సకాలంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.. పైగా ఈ రోజుల్లో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హృద్రోగ సమస్యలొస్తున్నాయి. కాబట్టి గుండె లయను నిరంతరం పర్యవేక్షించే పరికరం అందుబాటులో ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్స అందించచ్చన్న ఆలోచన మా మదిలో మొదలైంది. ఈ క్రమంలోనే- ‘మోనిత్రా హెల్త్‌కేర్’ సంస్థను నెలకొల్పి, గుండె లయను పర్యవేక్షించే ‘అప్ బీట్’ అనే పరికరాన్ని అభివృద్ధి చేశాం. మా సంస్థకు సంబంధించి ప్రత్యేకంగా ఆపరేషన్స్, క్లినికల్ రీసెర్చ్.. వంటి విభాగాల్లో నేను కీలక పాత్ర పోషిస్తున్నాను. గత రెండేళ్లుగా హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో మా అప్‌ బీట్‌ పరికరాన్ని వాడుతున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..?

ఇది బ్యాటరీ సహాయంతో నడిచే బ్యాండ్‌ ఎయిడ్‌ను పోలిన ప్యాచ్‌ లాంటి పరికరం. దీనిపై ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ ఉంటుంది. ఈ ప్యాచ్‌ను సర్జికల్‌ టేప్‌ సహాయంతో ఛాతీ మీద అమర్చుతారు. అప్పట్నుంచి గుండె కొట్టుకునే వేగాన్ని ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది. గుండె లయలో వచ్చే మార్పులను పసిగడుతుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పేషెంట్‌ తన ఫోన్లో అప్‌ బీట్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్లూటూత్‌ ద్వారా ప్యాచ్‌తో సంధానమై గుండె లయకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంగ్రహిస్తుంది. దాన్ని విశ్లేషించి భద్రపరచడానికి మా వద్ద ప్రత్యేకమైన నిపుణుల బృందం ఉంది. గుండె సమస్యల్ని బట్టి ఈ పరికరాన్ని ఎన్ని రోజులు (కనిష్టంగా 24 గంటలు, గరిష్టంగా 72 రోజులు) అమర్చుకోవాలో డాక్టర్లు సూచిస్తారు. ఈ క్రమంలో గుండె లయను ఒక క్రమపద్ధతిలో పర్యవేక్షించడం ద్వారా నిర్దిష్ట చికిత్స చేయడం సులభతరం అవుతుంది.

ప్రతి అడుగూ ఓ సవాలే!

వ్యాపారం ప్రారంభించాలనుకోవడం సులభమే కావచ్చు.. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం, అభివృద్ధి చేయడంలో అడుగడుగునా సవాళ్లే ఎదురవుతుంటాయి. ప్రత్యేకించి వైద్య పరికరాల రూపకల్పనకు సంబంధించి తయారీ, క్లినికల్‌ రిపోర్టింగ్, ఆపరేషన్స్‌.. ఇలా ఎన్నెన్నో విభాగాలుంటాయి. ఇలా ప్రతి విభాగంలో అత్యుత్తమ నైపుణ్యాలున్న మానవ వనరులను గుర్తించి.. ఎంపిక చేసుకోవడం కాస్త క్లిష్టమైన ప్రక్రియే! దీనికి తోడు పరికరం తయారీ కోసం ఎంచుకునే ముడి సరుకులు, ఆయా మెటీరియల్‌ నాణ్యతను గుర్తించడమూ సవాలనే చెప్పాలి. అందులోనూ మా పరికరం కోసం మన దేశంలో తయారైన మెటీరియల్‌నే వాడాలనుకున్నాం. అయితే ఇలా పరికరం తయారీ పూర్తి చేయడం ఒకెత్తయితే.. దాని పనితీరును పర్యవేక్షించడం మరో ఎత్తని చెప్పాలి. ఎందుకంటే ప్యాచ్‌ చర్మానికి ఎంత బాగా అతికి ఉంటే అంత కచ్చితమైన ఫలితం వస్తుంది. అలాగే ఈ క్రమంలో ప్యాచ్‌ కోసం వాడిన మెటీరియల్‌ వల్ల చర్మ అలర్జీలు రాకుండా నాణ్యత విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గుండె లయను రికార్డ్‌ చేయడంలో ఇది సక్సెసైందా? లేదంటే ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా? అన్న విషయాలు సునిశితంగా పరిశీలించాలి. సంస్థ ప్రారంభంలో ఎదురైన ఇలాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలిగామంటే.. అందులో మా నిపుణుల సహకారం ఎంతో అని చెప్పాలి.

వాళ్ల నమ్మకమే నడిపిస్తోంది!

మనం తయారుచేసే ఏ ఉత్పత్తైనా క్లిక్కవ్వాలంటే.. వినియోగదారులకు దానిపై పూర్తి నమ్మకం కలగాలి. ఆ విషయంలో మేము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగామని చెప్తా. ఎందుకంటే ప్రస్తుతం మా పరికరానికి డాక్టర్లు, పేషెంట్ల నుంచి సంతృప్తికరమైన స్పందన వస్తోంది. అలాగే మా ఉత్పత్తిని మార్కెటింగ్‌ చేసే క్రమంలో నగరంలోని పలు ఆస్పత్రులకు వెళ్లాం.. అక్కడికొచ్చిన పేషెంట్స్‌కి దీని గురించి వివరించాం. కార్డియాలజిస్ట్‌లను కలిసి ఈ పరికరం పనితీరు గురించి వివరించాం. గుండెకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించే IHRS వంటి పలు సదస్సుల్లోనూ పాల్గొని పరికరం గురించి వివరించాం. ఇవన్నీ మా పరికరం వినియోగదారులకు చేరువ కావడానికి ఎంతగానో దోహదం చేశాయి. ఏడాదిలో సగటున 5000 పేషెంట్స్‌కు సంబంధించిన హార్ట్‌బీట్స్‌ కలెక్ట్‌ చేశాం.

పోటీ ఉన్నా..

మా ఉత్పత్తిని వినియోగదారులకు అందించడంతోనే మా బాధ్యత తీరిపోదు. ప్యాచ్‌ పెట్టినప్పట్నుంచి దాని పనితీరును నిరంతరం పరిశీలిస్తుంటాం. దీనికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించడానికి మా దగ్గర ప్రత్యేకమైన మానిటరింగ్‌ నిపుణుల బృందం ఉంది. ప్యాచ్‌ వాడకం విషయంలో వినియోగదారులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ కూడా ఇస్తాం. ఈ ప్రత్యేకతలే మేము మార్కెట్లో పోటీని తట్టుకొని నిలదొక్కుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో మేం చేసిన ఓ అధ్యయనానికి సంబంధించిన పేపర్ ‘European Heart Rhythm Association (EHRA)’ జర్నల్‌లో కూడా ప్రచురితమైంది.


వాళ్ల ప్రోత్సాహం ఎంతో!

మా పరికరం అభివృద్ధిలో, దాన్ని ఎక్కువమంది వినియోగదారులకు చేరువ చేయడంలో టీ-హబ్/ వీ హబ్ కమ్యూనిటీ మాకెంతో ఉపయోగపడింది. ఇందులో భాగంగా ఇతర సంస్థలతో చర్చించి మన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.. కొత్త సలహాలు తీసుకోవచ్చు. అలాగే విదేశీ ఎంబసీల నుంచి వచ్చే విదేశీ పర్యటకుల్ని కలిసే అవకాశం ఉండడంతో మన ఉత్పత్తుల గురించి వారికి తెలియజేయచ్చు. ఇక ‘ఇంటర్న్‌షిప్‌ హైరింగ్‌ ప్రోగ్రామ్‌’లో భాగంగా ఆయా విభాగాలకు సంబంధించిన నిపుణుల్ని గుర్తించడం సులభతరం అవుతుంది. ఇక మహిళా పారిశ్రామికవేత్తలంతా కలిసి వాళ్ల వ్యాపారాలు/స్టార్టప్స్‌ గురించి చర్చించుకునే వెసులుబాటు కూడా ఉంది.


ఆ విషయంలో అమ్మే స్ఫూర్తి!

ఓ ఆంత్రప్రెన్యూర్‌గా, అమ్మగా.. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. వ్యాపారం అనేది నిరంతర అభ్యాసం. పట్టుదల, కృషికి తోడు సవాళ్లను ఎదిరించినప్పుడే అందులో రాణించగలం. ఈ క్రమంలో అటు వృత్తి ఉద్యోగాల్ని, ఇటు ఇంటిని బ్యాలన్స్‌ చేయడం ఒత్తిడితో కూడుకున్న విషయం. అయినా పనులకు ప్రాధాన్యమిస్తూ, తపనతో ముందుకు సాగితే దీన్నీ అధిగమించచ్చు. అంతెందుకు.. మా అమ్మ మా చిన్నతనంలో ఇంటి బాధ్యతల రీత్యా తన తపనను నెరవేర్చుకోలేకపోయింది. కానీ మేం పెద్దయ్యాక సొంతంగా డేకేర్‌ సెంటర్‌ నిర్వహించింది. ఇలా తన పట్టుదల నాలో స్ఫూర్తి రగిలించింది. అలాగే మా వ్యాపార అభివృద్ధిలో మా అత్తమామలు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. శ్రద్ధ పెడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. నా వ్యాపార, వ్యక్తిగత సూత్రం ఇదే!


అదే మా లక్ష్యం!

వైద్య పరికరాల నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి అందించే ISO-13485 సర్టిఫికేషన్ కూడా మా ఉత్పత్తికి లభించింది. EMI/EMC టెస్టింగ్‌లోనూ పాసైంది. HYSEA-2020లో ‘టాప్‌-10 స్టార్టప్స్‌’లో మా సంస్థకు చోటు దక్కింది. టీ-హబ్‌ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ‘మోస్ట్‌ రెజిలియంట్‌ ఎంట్రప్రెన్యూర్‌’ అవార్డూ మమ్మల్ని వరించింది. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. ఫౌండ్‌ ఎవ్రీవేర్‌!’ ఇదే మా నినాదం. మా పరికరం అమర్చుకుంటే తమ సమస్యకు సరైన పరిష్కారం దొరికినట్లే అన్న నిశ్చింత వినియోగదారుల్లో కలగాలి. ఈ క్రమంలో అప్‌ బీట్‌ను త్వరలోనే దేశవ్యాప్తం చేసే దిశగా కృషి చేస్తున్నాం. గుండె లయ ఒక్కటే కాదు.. శరీర ఉష్ణోగ్రత, బ్రెయిన్‌ సిగ్నల్స్‌ గుర్తించడం.. ఇలా శరీరం నుంచి వచ్చే ఏ సిగ్నల్‌నైనా క్యాప్చర్‌ చేయడమే లక్ష్యంగా మరిన్ని వైద్య పరికరాల్ని తయారుచేయడమే మా భవిష్యత్ లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్