Published : 19/06/2022 12:02 IST

తండ్రి గొప్పతనాన్ని చాటాలనుకుంది!

అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. వేలు పట్టి నడిపించి, విద్యాబుద్ధులు నేర్పించి తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. మనం ఒక్కో మెట్టు ఎక్కుతుంటే తానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఆనందాన్ని పొందుతాడు. అలా ఎదిగే క్రమంలో పొరపాటున తప్పటడుగు వేస్తుంటే దండించైనా సరే సరైన దారిలో పెడతాడు. స్క్రీన్ మీద ఎందరు హీరోలను చూసి చప్పట్లు కొట్టినా.. నిజజీవితంలో ప్రతి ఒక్కరికీ రియల్ హీరో మాత్రం నాన్నే. మన ఎదుగుదలలో, మన జీవితంలో ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే నాన్నను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనకు తెలియజేయడానికి 'ఫాదర్స్‌డే' ఓ చక్కటి సందర్భం. ఈ క్రమంలో అసలు పితృదినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? దాని విశిష్టత ఏంటి.. మొదలైన వివరాలన్నీ తెలుసుకుందాం రండి..

ఇదీ నేపథ్యం..

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర కీలకమే. ఒకప్పుడు తల్లి పిల్లల సంరక్షణ చూసుకుంటే.. తండ్రి వారికి కావాల్సిన అవసరాలను సమకూర్చడానికి ప్రయత్నించేవాడు. అయితే ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పిల్లల బాధ్యత కూడా సరిసమానంగా పంచుకోవడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో తల్లిదండ్రులిరువురి పాత్రల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగని వారిరువురి బాధ్యతల్లో ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఎక్కువగా తల్లి పాత్రే ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. మరి తండ్రి కష్టానికి ఎలాంటి గుర్తింపు లేదా?

ఇలాంటి ఆలోచనే అమెరికాకు చెందిన సొనారా స్మార్ట్ అనే అమ్మాయికి వచ్చింది. ఒక సందర్భంలో చర్చిలో మాతృదినోత్సవం గురించి ఫాదర్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అది వింటున్న సొనారాకు.. తల్లి మాదిరిగా తండ్రికి ఎందుకు గుర్తింపు ఇవ్వకూడదు? ఫాదర్స్‌డే ఎందుకు జరుపుకోకూడదు? అనే ఆలోచన వచ్చింది. దీనికి కూడా కారణం లేకపోలేదు. సొనారా తండ్రి విలియం స్మార్ట్ ఓ సైనికుడు. తన భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా తన ఆరుగురి పిల్లల సంరక్షణ బాధ్యతను తానే తీసుకున్నాడు. వారికి ఏ లోటూ రాకుండా పెంచాడు. తల్లి లేకపోయినా తమని అంత బాగా పెంచిన తండ్రికి సముచిత గౌరవం కల్పించాలని సొనారా భావించింది. అలా ఆమె 19 జూన్, 1910న తన తండ్రిని గౌరవిస్తూ పితృదినోత్సవానికి శ్రీకారం చుట్టింది.

నాన్నకూ గౌరవం కల్పించాలని..

పితృదినోత్సవాన్ని జరుపుతానంటే సొనారాను చూసి అప్పట్లో అందరూ గేలి చేశారట. అంతేకాదు.. పిల్లల సంరక్షణ, బాధ్యత పూర్తిగా తల్లి తన భుజాల మీద వేసుకొని నడిపిస్తుందని కూడా కొందరు వాదించారట. ఇలా పిల్లల పెంపకం విషయంలో తండ్రికి రెండో స్థానాన్ని కేటాయించడం సొనారాకు అస్సలు నచ్చలేదు. పిల్లలు మానసికంగా, ఆర్థికంగా ఎదిగే విషయంలో తల్లి మాదిరే తమ తండ్రిని కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అలాగే వారికి సురక్షితమైన జీవితాన్ని అందించడానికి తండ్రి కూడా తన శక్తికి మించి కృషి చేస్తాడు. అందుకే తల్లితో పాటు తండ్రికీ సమాన గుర్తింపు, గౌరవం కల్పించాలని సొనారా నిర్ణయించుకుంది. ఆ ఉద్దేశంతోనే పితృదినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది.

అలా ప్రపంచ వ్యాప్తంగా..

సొనారా పితృదినోత్సవ సంప్రదాయాన్ని 1910లో ప్రారంభించినప్పటికీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత 1924లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ 'ఫాదర్స్‌డే' ప్రాధాన్యాన్ని గుర్తించారు. అలాగే 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జాతీయ స్థాయిలో పితృదినోత్సవాన్ని జరుపుకోవడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. అలా ఏటా జూన్ మూడో ఆదివారం ఫాదర్స్‌డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రిచర్డ్ నిక్సన్ చేసిన కృషి వల్ల అమెరికా అంతటా ఫాదర్స్‌డే పెద్ద ఎత్తున జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సంస్కృతి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అలాగని అన్ని దేశాలు ఒకే రోజున ఫాదర్స్‌డేని జరుపుకోవు. ఎక్కువ దేశాలు జూన్ మూడో ఆదివారం జరుపుకొంటుండడంతో దాన్నే 'అంతర్జాతీయ పితృదినోత్సవం'గా గుర్తించారు.

మరో కథనం..

ఫాదర్స్‌డే ఎప్పుడు మొదలైందనే దానిపై మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. 1908లో పశ్చిమ వర్జీనియాలోని ఫెర్మోంట్ నగరంలో ఓ గనిలో పేలుడు సంభవించి 361 మంది కార్మికులు మరణించారు. వారి సంస్మరణార్థం వారి పిల్లలు ఒక చర్చిలో పితృదినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా మారిందనే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని