ఫోరెన్సిక్‌ రంగంలో నీకేం తెలుసన్నారు..

1993 ముంబయి పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 ఉగ్రదాడి, నాగ్‌పుర్‌ నక్సల్‌ మర్డర్‌ కేస్‌.. ఇంకా ఎన్నో! ఈ కేసులన్నీ పరిష్కరించింది ఒక్కరే. ఫోరెన్సిక్‌ యూనిఫాంలో ఆత్మవిశ్వాసంతో కనిపించే ఓ వ్యక్తిని ఊహించుకున్నారా? కానీ వీటిని పరిష్కరించింది చీర, నుదుటిన పెద్ద బొట్టుతో సంప్రదాయానికి అద్దం పట్టే ఓ మహిళ! దేశంలో తొలి మహిళా ఫోరెన్సిక్‌ నిపుణురాలు.

Updated : 13 Mar 2023 07:20 IST

తొలి అడుగు

1993 ముంబయి పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 ఉగ్రదాడి, నాగ్‌పుర్‌ నక్సల్‌ మర్డర్‌ కేస్‌.. ఇంకా ఎన్నో! ఈ కేసులన్నీ పరిష్కరించింది ఒక్కరే. ఫోరెన్సిక్‌ యూనిఫాంలో ఆత్మవిశ్వాసంతో కనిపించే ఓ వ్యక్తిని ఊహించుకున్నారా? కానీ వీటిని పరిష్కరించింది చీర, నుదుటిన పెద్ద బొట్టుతో సంప్రదాయానికి అద్దం పట్టే ఓ మహిళ! దేశంలో తొలి మహిళా ఫోరెన్సిక్‌ నిపుణురాలు.. అయిదు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు! డాక్టర్‌ రుక్మణి కృష్ణమూర్తి.. ఆమె గురించి తెలుసుకుందాం రండి!

ముంబయి మాతుంగ రైల్వేస్టేషన్‌! అక్కడో రైల్లో అగ్ని ప్రమాదం. కొత్తగా ఉద్యోగంలో చేరారు రుక్మణి. ప్రమాదం జరిగిన చోటికి వెళ్లబోతుంటే ‘నీకేం తెలుస’ని పై అధికారి ఆపేశారు. తన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ని చూపించి.. ‘అది నా బాధ్యతల్లో భాగం. వెళ్లకుండా నేనెలా పని చేయాలి’ అన్నారామె. ఆశ్చర్యపోయిన పైఅధికారి వెంటనే అనుమతిచ్చారు. ప్రమాదానికి కారణం కిరోసిన్‌ అని గుర్తించినావిడ నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అది ప్రజారవాణాలో అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వాటిని తీసుకెళ్లకూడదనే చట్టానికి కారణమైంది.

ఒక ఎమ్మెల్యే! భార్యను కిరోసిన్‌ పోసి అంటించి, గదికి తాళం వేశాడు. క్రైం సీన్‌లో సేకరించిన శాంపిల్స్‌లో కిరోసిన్‌ ఆధారాల్లేవు. అయినా కిరోసిన్‌ పోసి అంటించడం వల్లే ఆమె చనిపోయిందని నివేదికిచ్చారు రుక్మణి. వాదప్రతి వాదాలెన్నో జరిగాయి. కోర్టు నుంచి ఆవిడకి పిలుపొచ్చింది. ‘ఆమె ఒంటిపై నగలు కరిగిపోయాయి. అంటే దాదాపు 800 డిగ్రీల వేడి ఉందని అర్థం. అంతవేడిలో కిరోసిన్‌ అవశేషాలుండవు’ అని చెప్పి శిక్ష పడేలా చేశారు.

రుక్మణి కృష్ణమూర్తి.. చూడటానికే శాంతంగా ఉంటారు. పని విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారన్నదానికి ఉదాహరణలే ఈ సంఘటనలు. ఈవిడ ఈ తత్వానికి పెరిగిన వాతావరణమూ కారణమే! ఆడపిల్లంటే బరువనుకునే మధ్యతరగతి కుటుంబంలో అయిదో సంతానంగా పుట్టారీమె. అబ్బాయిల కంటే అమ్మాయి తక్కువని చెప్పే అమ్మ అభిప్రాయాన్ని మార్చాలనుకొని పట్టుదలగా చదివారు. అనలిటికల్‌ కెమిస్ట్రీలో పీజీ, పీహెచ్‌డీ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌గా చేరి, డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. కొత్తలో పై అధికారి ఈవిడని చూసి ‘ఫోరెన్సిక్‌ రంగంలో అమ్మాయిలేం చేస్తార’న్నారట. ఆ మాటను సవాల్‌గా తీసుకొని పనిచేసినావిడ తర్వాత ఎన్నో కీలక కేసులను పరిష్కరించారు. 93- ముంబయి పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 ఉగ్రదాడి, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ స్కామ్‌ లాంటి పెద్ద కేసులే కాదు.. గ్యాంగ్‌స్టర్‌ కేసులు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, హత్యలు వంటివెన్నో పరిష్కరించారు. 1993లో ముంబయిలో 12 చోట్ల టెర్రరిస్టుల దాడులపై ఈవిడిచ్చిన నివేదిక ఇంటర్‌పోల్‌ దర్యాప్తుతో సరిపోలింది. అప్పుడెన్నో ప్రశంసలు అందుకున్నారామె. ఫ్రాన్స్‌, హాంకాంగ్‌, చైనా, లండన్‌, అమెరికా సహా ఎన్నో దేశాల్లో ఫోరెన్సిక్‌ అంశాలపైౖ ప్రసంగించారు కూడా.


సామాన్యుల కోసమనీ!

దేశంలోనే టాప్‌ ఫోరెన్సిక్‌ సైంటిస్టుల్లో రుక్మణి పేరు ఉంటుంది. 2012లో పదవీ విరమణ పొందినా పని నుంచి విశ్రాంతి తీసుకోలేదు. ప్రభుత్వ ఫోరెన్సిక్‌ నిపుణుల సేవలు పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలకే! వాటిని సామాన్యులు, ప్రైవేటు సంస్థలకు చేరువ చేయాలనుకుని ‘హెలిక్‌ అడ్వయిజరీ’ ప్రారంభించారు. లై డిటెక్టింగ్‌, డీఎన్‌ఏ టెస్టింగ్‌, సైబర్‌ ఫోరెన్సిక్‌, స్పీకర్‌ ఐడెంటిఫికేషన్‌, నార్కో అనాలిసిస్‌, బ్రెయిన్‌ సిగ్నేచర్‌ ప్రొఫైలింగ్‌ వంటి అధునాతన సేవల్నీ అందిస్తున్నారామె. ముంబయి, నాగ్‌పుర్‌, పుణె, ఔరంగాబాద్‌, నాసిక్‌, అమరావతిల్లో ఆరు అధునాతన ల్యాబొరేటరీలనూ ఏర్పాటు చేసినావిడ 110 రిసెర్చ్‌ పేపర్లను రాశారు. 12 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సినిమాల్లో క్రైం సీన్స్‌లో ఫోరెన్సిక్‌ పరికరాల వినియోగంపై సలహాలూ ఇస్తున్న ఈమె 72 ఏళ్ల వయసులోనూ కేసులను పరిష్కరిస్తుండటమే కాదు.. కార్పొరేట్‌ ఫోరెన్సిక్‌ సెంటర్‌ని ప్రారంభించి, శిక్షణనీ ఇస్తున్నారు. తాజాగా ఆమె కథ సినిమాగానూ రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్