తబలాపై రామాయణ గాథ

తబలా అనగానే పురుషులే స్ఫురిస్తారు. అలాంటి ఈ రంగంలోకి ప్రవేశించి దేశంలోనే తొలి తబలా కళాకారిణిగా నిలిచారు అనురాధా పాల్‌. తబలా లెజెండ్‌ ఉస్తాద్‌ అల్లా రఖా, జాకీర్‌ హుస్సేన్‌ల దగ్గర ఇరవై ఏళ్లపాటు శిక్షణ తీసుకుని తబలాపై ఎన్నో ప్రయోగాలు చేశారు. దానిపై పాటలు మాత్రమే కాదు కథలూ చెప్పొచ్చంటూ ఏకంగా రామాయణాన్నే వినిపించి రికార్డు సృష్టించారీ లేడీ జాకీర్‌ హుస్సేన్‌.

Published : 29 May 2024 04:03 IST

తబలా అనగానే పురుషులే స్ఫురిస్తారు. అలాంటి ఈ రంగంలోకి ప్రవేశించి దేశంలోనే తొలి తబలా కళాకారిణిగా నిలిచారు అనురాధా పాల్‌. తబలా లెజెండ్‌ ఉస్తాద్‌ అల్లా రఖా, జాకీర్‌ హుస్సేన్‌ల దగ్గర ఇరవై ఏళ్లపాటు శిక్షణ తీసుకుని తబలాపై ఎన్నో ప్రయోగాలు చేశారు. దానిపై పాటలు మాత్రమే కాదు కథలూ చెప్పొచ్చంటూ ఏకంగా రామాయణాన్నే వినిపించి రికార్డు సృష్టించారీ లేడీ జాకీర్‌ హుస్సేన్‌.

మె స్వస్థలం ముంబయి. బాల్యంలో ఎవరైనా స్నేహితులతోనో, బొమ్మలతోనో ఆడుకుంటారు కానీ తనకు మాత్రం చెస్, క్రికెట్, టేబుల్‌ టెన్నిస్, గుర్రపుస్వారీలు.. అంటూ ఏవేవో నేర్పించి సరదాగా ఆడుకునే వీలే లేకుండా చేశారట అమ్మ ఇలాపాల్, నాన్న దేవీందర్‌పాల్‌. అయితే నాన్నకి సంగీతం మీదున్న ఆసక్తి వల్లే తబలా నేర్చుకోవాలనే కోరిక పుట్టిందట. కానీ ఈ రంగంలో మగవాళ్లే రాణించగలరు. తబలా వాయించాలంటే చేతుల్లో బలం ఉండాలి.. వంటి కారణాలతో ఇంట్లో వద్దనేవారట. కానీ పట్టుబట్టి తనే స్వయంగా నేర్చుకునేదట. ఆమె పట్టుదలని చూసి జాకీర్‌ హుస్సేన్‌ దగ్గర చేర్పించారట. ఆయన దగ్గర శిక్షణ తీసుకునేటప్పుడు, తబలా వాయించీ వాయించీ వేళ్లు విరిగిపోయేటంత నొప్పి, విరామం లేకుండా కూర్చోవడంతో తీవ్రమైన వెన్ను నొప్పితో బాధ పడేదాన్ని. అయినా తబలా పట్ల ఇష్టం ఏమాత్రం తగ్గలేదు అంటారు అనురాధ.

తబలాపై రామాయణం..

‘ఒకరోజు కాలేజ్‌లో పెద్ద ప్రోగ్రామ్‌ జరుగుతోంది. అప్పటి వరకూ ఉపన్యాసాలూ, పాటలు విని విసిగిపోయి అక్కడ ఎవరూ ఈ సంప్రదాయ సంగీతం వినడానికి ఆసక్తిగా లేరని నాకర్థమైంది. కానీ మా ప్రిన్సిపల్‌ మాత్రం నేను తబలా వాయించి తీరాలని పట్టుబట్టారు. అప్పుడొచ్చిన ఆలోచనే తబలాపై కథలు చెప్పడం. అంతమంది ముందు వాయించడమూ నాకు మొదటిసారే. ఏమవుతుందో అని కంగారు పడ్డాను. కానీ ఆశ్చర్యంగా అందరూ లేచి చప్పట్లు కొడుతూ ‘వన్స్‌ మోర్‌’ అంటూ గట్టిగా అరిచారు. ఆరోజే తబలాపై పాటలే కాదు కథలూ చెప్పొచ్చని అర్థమైంది’ అంటున్నారు అనురాధ. ఆ తర్వాత పదేళ్లు కష్టపడి తబలాపై రామాయణాన్ని సృష్టించి ఇటీవలే ఓ కొత్త ఫీట్‌ని సాధించారు. పక్షులు చేసే శబ్దాలు, గుర్రాల పరుగు, చినుకు సవ్వడి.. ఒక్కటేమిటీ ప్రతి శబ్దాన్నీ తబలాపై వాయించగలరు. దీని వెనక కఠోర శ్రమ ఉందని చెప్పే అనురాధ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాలైన వూడ్‌స్టాక్, వూమడ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శన ఇచ్చిన అతి పిన్నవయస్కురాలే కాదు.. మొట్టమొదటి మహిళా విద్వాంసురాలు కూడా. అంతర్జాతీయ కళాకారులతో కలిసి 30 దేశాల్లో దాదాపు 5వేలకు పైగా కచేరీలు చేశారు. ఇటీవలే ఈడీఎమ్‌ పల్సేటింగ్‌ శక్తితో ముడిపడి ఉన్న సంప్రదాయమైన తబలా బీట్స్‌తో ‘తబలా టానిక్‌’ అనే కొత్త ట్యూన్‌ చేశారు. ఈ స్థాయికి రావడానికి తబలాపై తనకున్న ఇష్టమొకటే కాదు, తన కుటుంబం కూడా ఓ కారణమని చెబుతోన్న  ఈమె, ‘అనురాధా పాల్‌ కల్చరల్‌ అకాడమీ’ని స్థాపించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా ఎంతోమందికి శిక్షణనిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్