యూరప్‌లోని మేటి బయాల‌జీ నిపుణుల్లో.. మన మహిమ!

ఈ రోజుల్లో ఎంతోమంది మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ.. తమదైన ముద్ర వేస్తున్నారు. మరికొంతమంది విదేశాల్లో కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన డాక్టర్‌ మహిమా స్వామి ఈ జాబితాలో చేరారు. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ (EMBO)లో యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ నెట్‌వర్క్‌లో....

Published : 28 Dec 2022 21:05 IST

ఈ రోజుల్లో ఎంతోమంది మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ.. తమదైన ముద్ర వేస్తున్నారు. మరికొంతమంది విదేశాల్లో కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన డాక్టర్‌ మహిమా స్వామి ఈ జాబితాలో చేరారు. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ (EMBO)లో యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ నెట్‌వర్క్‌లో సభ్యురాలిగా ఎంపికయ్యారు. యూరప్‌లోని మేటి బయాల‌జీ నిపుణుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందారు.

EMBO ఐరోపాలోనే ప్రతిష్టాత్మక సంస్థ. ఇందులోని దాదాపు 1900 మందికి పైగా శాస్త్రవేత్తలు లైఫ్ సైన్సెస్‌ అంశాలపై నిరంతరం వివిధ పరిశోధనలు చేస్తుంటారు. లైఫ్ సైన్సెస్‌లో పరిశోధనలు చేస్తోన్న విద్యార్థులకు ఈ సంస్థ ఆర్థిక సహాయంతో పాటు వివిధ రకాల సదుపాయాలను కల్పిస్తుంటుంది. ఇందుకోసం ఏటా ప్రతిభావంతులైన పరిశోధకులను ఎంపిక చేసి యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ నెట్‌వర్క్‌లో భాగం చేస్తుంటుంది. ఇందులో స్థానం సంపాదించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండే లైఫ్ సైన్సెస్‌ విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. తాజాగా మన దేశానికి చెందిన డాక్టర్‌ మహిమా స్వామి ఈ ఘనత దక్కించుకున్నారు.

పేగుల రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలు..

బెంగళూరుకు చెందిన మహిమా స్వామి బిట్స్ పిలానీ (రాజస్థాన్)లో బయలాజికల్ సైన్స్‌ అండ్‌ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ కోసం జర్మనీ వెళ్లిన ఆమె Wolfgang Schamel ల్యాబ్‌లో పలు పరిశోధనలు చేశారు. ఆ తర్వాత లండన్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్ చేశారు. ఈ క్రమంలో పేగుల్లోని రోగనిరోధక వ్యవస్థపై పలు పరిశోధనలు నిర్వహించారు. అలా 2013లో స్కాట్లాండ్‌లోని Dundee యూనివర్సిటీలో స్వతంత్ర పరిశోధకురాలిగా చేరారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ప‌రిశోధ‌నా బృందానికి ఆమె సారథ్యం వహిస్తున్నారు. 2017లో వెల్‌కం ట్రస్ట్‌ అందించే ‘సర్‌ హెన్రీ డేల్ ఫెలోషిప్’కి సైతం ఎంపికయ్యారు మహిమ.  తాజాగా ప్రతిష్టాత్మకమైన EMBO యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ నెట్‌వర్క్‌లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

లక్షల్లో ఆర్థిక సహాయం...

ఈ ఏడాది యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ నెట్‌వర్క్‌లో మహిమతో పాటు మరో 23 మంది స్థానం సంపాదించుకున్నారు. ఈ నెట్వర్క్‌లో ప్రస్తుతం 135 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో స్థానం సంపాదించిన వారికి రెండో సంవత్సరం 15 వేల యూరోల (దాదాపు 13 లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అలాగే వివిధ గ్రాంట్‌ల ద్వారా నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి 10 వేల యూరోలు (దాదాపు 9 లక్షల రూపాయల) అందుకునే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పరిశోధనలకు అవసరమైన వివిధ రకాల సదుపాయాలను కల్పిస్తుంటారు.

ఈ సందర్భంగా మహిమ మాట్లాడుతూ ‘ఈ నెట్‌వర్క్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఐరోపా వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో భాగం కావడం ద్వారా మా పరిశోధనలు మరింత ముందుకు వెళతాయని భావిస్తున్నా. ఈ అవార్డును గెలుచుకోవడానికి సహాయపడిన నా బృందానికి, మెంటార్లకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్